కర్నూలు: అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో మొన్న జరిగిన నాటు బాంబు పేలుడులో గాయపడ్డ వరకుమార్ (13) అనే బాలుడు చనిపోయాడు. స్కూల్ పక్కనే దాచి ఉంచిన నాటు బాంబులను గుర్తించి గుండ్రంగా బంతిలా ఉండడంతో వాటిని చేతిలోకి తీసుకుని ఆడుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలింది. దీంతో వరకుమార్ రెండు చేతులు తెగిపడగా.. ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పెద్ద శబ్దంతో పేలుడు జరగడం.. బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురించి తెలిసిన వెంటనే బనగానపల్లె సీఐ సురేష్ కుమార్ రెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నాటు బాంబు పేలుళ్లను నిర్ధారించుకునేందుకు క్లూస్ టీమ్ ను రప్పించారు. గాయపడ్డ వరకుమార్ ను మెరగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో చికిత్స ఫలించక కన్నుమూశాడు. కొద్దిసేపటి క్రితం వరకుమార్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాటు బాంబు పేలుడు ఆనవాళ్లు కనిపించడంతో డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి, ఫ్యాక్షన్ కంట్రల్ జోన్ సీఐ వెంకటరమణ, ఎస్.ఐ సోమ్లానాయక్ తదితరులు చెన్నంపల్లె గ్రామంలో నాటు బాంబు పేలుడు జరిగిన స్థలాన్ని పరిశీలించారు.
Read more news…