టీఆర్ఎస్ లో బుజ్జగింపుల పర్వం.. టికెట్ రేసులో కంచర్ల కృష్ణారెడ్డి

మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ప్రగతిభవన్ నుంచి నల్గొండ ఎమ్మెల్యే  కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులకు పిలుపు వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని  నియోజకవర్గ అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తుండటంతో భూపాల్ రెడ్డి సోదరులకు ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. 

ఎవరిని అదృష్టం వరిస్తుందో 

మునుగోడు నియోజకవర్గం టికెట్ ఆశిస్తూ యాక్టివ్ గా కంచర్ల కృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య గౌడ్ పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచి చూడాల్సిందే. 

అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపుతారన్న సంకేతాలు స్థానిక నేతల్లో ఆందోళన కలిగించింది. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన టీఆర్ఎస్ నాయకులు చౌటుప్పల్లో రహస్యంగా సమావేశమయ్యారు.  దండు మల్కాపూర్లోని ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్ లో జరిగిన  సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 300 మంది నాయకులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దని వారంతా తీర్మానం చేశారు. ఆయనకు తప్ప టికెట్ ఎవరికైనా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ లో అసంతృప్తులు ఎవరూ లేరు కేవలం ఆశావహులు మాత్రమే ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన గంటల వ్యవధిలోనే నేతలు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

కూసుకుంట్ల అభ్యర్థిత్వానికి వ్యతిరేకత 

మునుగోడు నియోజకవర్గానికి చెందిన 90శాతం మంది టీఆర్ఎస్ నేతలు కూసుకుంట్ల అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఆయనకు టికెట్ ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆయన సూచన మేరకు సీఎం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  ఈ నెల 20న టీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగ సభకు అనువైన స్థలం ఎంపిక కోసం మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు కూసుకుంట్ల వెళ్లారు. ఈ నేపథ్యంలో స్థానిక టీఆర్ఎస్ నేతల తీర్మానం మంత్రి జగదీశ్ రెడ్డికి తలనొప్పిగా మారింది.