మీర్పేట్లో భార్య హత్య కేసు.. బాడీని ముక్కులు చేసి.. మేక కాళ్లు,తల అని చెప్పిండు

మీర్పేట్లో భార్య హత్య కేసు.. బాడీని ముక్కులు చేసి.. మేక కాళ్లు,తల అని చెప్పిండు
  • మటన్​కొట్టే మొద్దు.. బట్టలు స్వాధీనం

ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్​లోని మీర్ పేట్ లో ఓ రిటైర్డ్​ఆర్మీ జవాన్ తన భార్యను చంపి ముక్కలు చేసి పడేసిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గురైన వెంకటమాధవిని ఆమె భర్త గురుమూర్తి ఎలా చంపాడు? ఆధారాలు లేకుండా ఎలా చేశాడు? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్​చేస్తున్నారు. హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నా ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.  వెంకటమాధవి చనిపోయిందని నిరూపించడం, అది కూడా హత్యకు గురైందని ప్రూవ్​చేయడం, ఆ హత్య ఆమె భర్తే చేశాడని ఆధారాలు సేకరించడం ఎలా అనే పరిశోధిస్తున్నారు. ఇందులో భాగంగా వెంకటమాధవి హత్యకు గురవడానికి ముందు ఆమె ధరించిన బట్టలు, గురుమూర్తి ఇంట్లో ఓ మద్యం బాటిల్, మటన్ కొట్టే మొద్దు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. 

వీటితో పాటు టెక్నికల్​ఎవిడెన్స్, సీసీ ఫుటేజీ, సెల్​ఫోన్​సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పీఎస్ లో ఉన్న నిందితుడిని గురువారం సాయంత్రం రంగారెడ్డి కోర్టుకు తరలించి స్టేట్ మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ స్టేట్​మెంట్ ఆధారంగా మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి గురుమూర్తిని రిమాండ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. శుక్రవారం రిమాండ్ కు పంపిన తర్వాత తిరిగి కస్టడీకి తీసుకుని సీన్ రీ కన్స్ స్ట్రక్షన్ చేయబోతున్నట్టు తెలుస్తున్నది.

అరెస్టు చేసినప్పుడు మద్యం మత్తులోనే

వెంకటమాధవిని హత్య చేసే ముందు నుంచి గురుమూర్తి మద్యం మత్తులోనే ఉన్నట్లు తెలుస్తున్నది. వెంకటమాధవిని హత్య చేసేందుకు, ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసేందుకు, ఎముకలను పొడి చేసేందుకు ధైర్యం చాలకపోవడంతో ఫుల్లుగా మందు కొట్టినట్టు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకునేటప్పుడు కూడా అతడు మందు తాగే ఉన్నట్టు సమాచారం.  ఆయన ఇంట్లో దొరికిన మద్యం బాటిల్స్ ఆధారంగా పోలీసులు ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. 

మేక కాళ్లు, తల అని చెప్పిండు 

వెంకటమాధవిని హత్య చేసి ముక్కలుగా నరికిన తర్వాత గురుమూర్తి ఇంట్లో ఓ పెద్ద స్టవ్ పై ఆమె తల, మాంసం నుంచి వేరు చేసిన ఎముకలను కాల్చాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో నుంచి వచ్చిన దుర్వాసన గురించి పక్క ఇండ్ల వారు ప్రశ్నించారు. దీనికి ‘మేక కాళ్లు, తలకాయ తెచ్చి వండుతున్నా.. అవి ఉడకబెడ్తుంటే ఈ వాసన వస్తుంది’ అని చెప్పినట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు.