బుద్ధుని అస్తికలపైన నిర్మించిన పవిత్ర కట్టడాన్ని స్తూపం అంటారు. మూడు రకాల స్తూపాలుంటాయి. అవి ధాతుగర్భ స్తూపాలు, పారిభోజక స్తూపాలు, ఉద్దేశిక స్తూపాలు. బౌద్ధ సన్యాసుల నివాస గృహాలను విహారం లేదా ఆరామం అని, ప్రార్థనా మందిరాలను చైత్యాలని అంటారు. బౌద్ధులకు పవిత్రమైన 8 పుణ్యక్షేత్రాలను అష్టమహాస్థానాలు అంటారు. అవి లుంబిని, గయ, సారనాథ్, కుషినార, రాజగృహ, వైశాలి, శ్రావస్తి, సంకిస్స.
బుద్ధుని బోధనలు
నాలుగు ఆర్య సత్యాలు 1. ప్రపంచమంతా దు:ఖమయం 2. కోరికలే దు:ఖానికి కారణం 3. దు:ఖాన్ని నిరోధించవచ్చు 4. దానికో మార్గం ఉంది.
అష్టాంగ మార్గము 1. సరైన క్రియ 2. సరైన దృష్టి 3. సరైన వాక్కు 4. సరైన లక్ష్యం 5. సరైన మార్గము 6. సరైన జీవనోపాధి 7. సరైన చైతన్యం 8. సరైన ధ్యానం. అన్నింటిలోనూ అతిని త్యజించాలని, అన్ని విషయాల్లో మధ్యే మార్గాన్ని పాటించాలని మధ్యమార్గమును గౌతమ బుద్ధుడు బోధించాడు.
మత శాఖలు
నాలుగో బౌద్ధ సమావేశంలో 18 బౌద్ధ శాఖలు కలిసి హీనయాన, మహాయాన శాఖలుగా అవతరించాయి. హీనయానశాఖలు స్థవిరవాద/ థేరవాద, సాతాంత్రిక, సమ్మతీయ, మహిశాక, మూలస్థవిరవాద, కశ్యపిక. మహాయాన శాఖలు మహాసాంఘిక, సర్వస్తవాద, చైత్యక, హైమావతి, సిద్ధార్థిక, లోకోత్తరవాద, పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల
హీనయానం: హీనయానులు మార్పును వ్యతిరేకించేవారు. గ్రంథ రచనలో పాళి భాషను కొనసాగించారు. మోక్షం వ్యక్తిగతమని భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు.
మహాయానం: పరిస్థితులకు అనుగుణంగా మార్పును స్వాగతించేవారు. వీరు సంస్కృత భాషను స్వీకరించారు. అందరికీ మోక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. బుద్ధుడిని విగ్రహ రూపంలో పూజిస్తారు. దేశంలో విగ్రహారాధనను ప్రవేశ పెట్టారు.
వజ్రాయానం: క్రీ.శ. 5వ శతాబ్దంలో గుంటూరు జిల్లాలోని అమరావతిలో వజ్రాయానం ఆవిర్భవించింది. వీరు భోదిసత్వుల భార్యలైన తారలను పూజిస్తారు. నాగార్జునకొండకు చెందిన సిద్ధనాగార్జునుడు వజ్రా యాన మతాన్ని ప్రచారం చేశాడు. ఇందులో కాలచక్రయానము, సహజ యానము అనే శాఖలు ఉన్నాయి. బుద్ధుని పూర్వజన్మలను బోధిసత్వులు అంటారు. ముఖ్యమైన బోధిసత్వులు వజ్రపాణి, అవలోకిటేశ్వర, మంజుశ్రీ, అమితాబ, మైత్రేయ.
బౌద్ధ పండితులు
హీనయానానికి చెందిన పండితుడు బుద్ధఘోషుడు విసుద్దిమగ్గ(త్రిపీటకాలపైన వ్యాఖ్యానం), దాతుకథ ప్రకరణ, కథావత్తు ప్రకరణ, సామంత పసాదిక( వినయ పీటకపైన వ్యాఖ్యానం)
మహాయానానికి చెందిన పండితుడు ఆచార్య నాగార్జునుడు. మాధ్యమికవాదం, శూన్యవాదం అనే నూతన తత్వాలను బోధించాడు. మాధ్యమికకారిక, శూన్యసప్తతి, ప్రజ్ఞాపారమితి, సుహృల్లేఖ, రసరత్నాకర, ఆరోగ్యమంజరి అతని రచనలు
భావవివేకుడు తర్కజ్వాల, ప్రజ్ఞప్రదీప, కరతలరత్న అనే గ్రంథాలను సంస్కృతంలో రచించాడు.
బుద్ధ పాలితుడు ప్రసాంగిక మాధ్యమికవాదము అనే కొత్త తత్వాన్ని బోధించాడు. సంస్కృతంలో మాధ్యమికవృత్తి అనే గ్రంథాన్ని రచించాడు.
మైత్రేయనాథుడు మహాయానంలో యోగకార/ విజ్ఞానవాద అనే తత్వాన్ని బోధించాడు. లంకావతారసూత్ర అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.
దిగ్నాగుడు ప్రమాణసముచ్ఛయ, న్యాయ ప్రవేశ, ఆలంబన పరీక్ష, హేతుచక్రధమరు మొదలైన గ్రంథాలను సంస్కృతంలో రాశాడు.
సంగీతిల ప్రాధాన్యత
మొదటి బౌద్ధ సంగీతిలో ఆనందుడు సుత్తపీఠికను రాశాడు. ఇందులో బుద్ధుడి బోధనలు ఉన్నాయి. ఉపాలి వినయ పీఠికను రచించాడు. ఇది బౌద్ధుల ప్రవర్తన నియమావళికి చెందింది. రెండో బౌద్ధ సంగీతిలో బౌద్ధం రెండు శాఖలుగా విడిపోయింది. మహాకాత్యాయన నాయకత్వంలోని అవంతికి చెందిన బౌద్ధులు థేరవాద/ స్థవిరవాదశాఖగా మహాకాశ్యప నాయకత్వంలోని వజ్జికి చెందిన బౌద్ధులు మహాసాంఘి శాఖగా చీలిపోయింది. మూడో బౌద్ధ సంగీతిలో అభిదమ్మ పీఠిక రాశారు. బౌద్ధ మత ప్రచార సంఘాలు ఏర్పాటు చేశారు. నాలుగో బౌద్ధ సంగీతిలో18 శాఖలు కలిసి హీనయానం, మహాయానంగా అవతరించాయి.
అంతానికి కారణాలు
బౌద్ధం క్రీ.పూ.4–5వ శతాబ్దాల్లో ఉచ్ఛస్థితికి చేరుకొని ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ 12వ శతాబ్దపు చివరికి పుట్టిన దేశంలోనే సంపూర్ణంగా అంతరించింది. అంతర్గత కలహాలు పెరిగి బౌద్ధ మతం 18 శాఖలుగా విడిపోయింది. 5వ శతాబ్దంలో వజ్రాయానం అనే నూతన శాఖ ప్రారంభమై బౌద్ధమతాన్ని నైతికంగా భ్రష్టు పట్టించింది. గుప్తులు, ఆ తర్వాత వచ్చిన రాజవంశాలు హిందూ మతాన్ని ఆదరించడం బౌద్ధం అంతానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. హిందూ మతంలో ప్రధాన శాఖ అయిన శైవం విజృంభించి బౌద్ధాన్ని అంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఏడో శతాబ్దంలో బెంగాల్‌ను పాలించిన శశాంకుడనే శైవరాజు బౌద్ధులకు పవిత్రమైన గయలోని బోధి వృక్షాన్ని నేల కూల్చాడు. 1194లో భక్తియార్ ఖిల్జీ అనే తురుష్క సేనాని నలందతో సహా అన్ని బౌద్ధ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి, దేశంలో చివరి బౌద్ధులను చంపడంతో బౌద్ధం అంతమైంది.
పవిత్ర గ్రంథాలు
పాళి భాషలో రాసిన త్రిపీఠికాలు బౌద్ధులకు పవిత్ర గ్రంథాలు. సుత్తపీటక. ఇందులో 5 భాగాలుంటాయి. దిగనికాయ, మజ్జిమ నికాయ, అంగుత్తర నికయ, సంయుక్త నికయ, ఖుద్దక నికయ. వినయ పీటకను బుద్ధుని శిష్యుడైన ఉపాలి రచించాడు. ఇందులో బౌద్ధమతస్తుల ప్రవర్తన నియమావళి చర్చించబడింది. ఇందులో పతిమొక్క, సుత్త విభాంగ, ఖండక భాగాలుంటాయి. అభిదమ్మ పీఠికను మూడో బౌద్ధ సమావేశంలో రాయబడింది. ఆ సమావేశ అధ్యక్షుడైన మొగలిపుత్తతిస్స రచించాడు. ఇందులో సుత్త, వినయ పీఠికాలకు సంబంధించిన తాత్వికమైన చర్చ ఉంటుంది.
కాలం నగరం అధ్యక్షుడు సమకాలీనరాజు
క్రీ.పూ. 483 రాజగృహము మహాకశ్యప అజాతశత్రువు
క్రీ.పూ. 383 వైశాలి సబకమి కాలాశోకుడు
క్రీ.పూ.250 పాటలీపుత్రము మొగలిపుత్తతిస్స అశోకుడు
క్రీ.శ.1 కాశ్మీర్‌లోని కుందనవనం వసుమిత్ర కనిష్కుడు