బ్యాలెన్స్​ లేని బడ్జెట్​ 

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​కు ఒక లక్ష్యం, దిశా నిర్దేశం అంటూ లేదు. బడ్జెట్ మొత్తం పరనిందా ఆత్మ స్తుతిలాగానే ఉంది. కేవలం కాగితాల మీద వేసుకునే అంకెలు మాత్రమే తప్ప, వాస్తవ ఆర్థిక స్థితికి దూరంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధి సమతుల్యం ఎక్కడా కనిపించడం లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపకపోవడం వంటి దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు నెలకొన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారే కాని, ప్రజల సంక్షేమంపై, రాష్ట్ర అభివృద్ధిపై ఎటువంటి ఆలోచన చేయడం లేదు. గత బడ్జెట్లో ఆదాయం రూ.1.76లక్షల కోట్లు చూపిస్తే, వచ్చింది 1.20లక్షల కోట్లు మాత్రమే, అంటే 56 వేల కోట్లు అదనంగా చూపారు. ఈ సారి బడ్జెట్​లో ఏకంగా 1.90కోట్ల ఆదాయం చూపారు. అంటే గత సంవత్సరం ఆదాయం కంటే 70వేల కోట్లు అదనంగా చూపారు. ఇది సాధ్యమా? ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ కాదా? కాకి లెక్కలు కావా? ఇది పూర్తిగా మోసపూరితమైన బడ్జెట్. టీఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. సీఎం కేసీఆర్ అప్పులు చేయడం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర అప్పులు 79 వేల కోట్లు ఉంటే అది ఇప్పుడు 3 లక్షల 30వేల కోట్లకు పెరిగింది. ఇవే కాకుండా మిషన్ భగీరథ, విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టులు మొదలైన పథకాలకు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ప్రజలకు తెలియజేయాలి. మొత్తం మీద అప్పు చేసి పప్పు కూడు అన్న చందంగా ఉంది తెలంగాణ బడ్జెట్​.

ఉన్న ఉద్యోగాలు ఊడబెరికారు..

రాష్ట్రంలోని రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం తప్ప... ఏనాడూ వారి సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​ను చూస్తే అర్థమవుతున్నది. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మానిఫెస్టో ద్వారా వాగ్దానం చేసి సంవత్సరాలు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. తెలంగాణలో నిరుద్యోగరేటు 7 శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గ్రూప్-1 నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ యువతే 85శాతం మంది ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉ ద్యోగాలనే ఊడ బెరికారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ, పంచాయితీ కార్యదర్శులు, విద్యా వాలంటీర్లు, వైద్య ఆరోగ్యశాఖలో కలిపి 52వేల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. ఆసరా పెన్షన్లు, వృద్ధులు, వితంతువు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి సుమారు 11 లక్షల ధరఖాస్తులు పెండింగ్​లో ఉన్నాయి. ఇంటి పేరు కస్తూరి, ఇల్లంతా గబ్బిలాల వాసన లెక్క ఉంది బడ్జెట్. నిరుద్యోగ భృతి నెలకు రూ.3016 నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. కొలువుల భర్తీలేదు, భృతీలేదు.

మద్యం సేవించడంలో నెంబర్ 1..

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం మద్యం ద్వారానే 37వేల కోట్లు సమకూర్చుకుంటోంది, తాగుబోతుల సంఖ్య పెంచి ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణ నంబర్ వన్, అంటే మద్యం సేవించడంలో కేసీఆర్ ప్రభుత్వం విజయం సాధించింది. 26 జనవరి గణతంత్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ రాకపోవడం, మంత్రులు హాజరుకాకపోవడం అప్రజాస్వామికం. రాజ్యాంగ దినోత్సవం నాడు కూడా సీఎం, మంత్రులు హాజరుకాకుండా రాజ్యాంగాన్ని అవమానపరిచారు. గవర్నర్ మేడారం వెళితే ప్రోటోకాల్ పాటించలేదు. హెలికాప్టర్ సమకూర్చలేదు. ఆఖరుకు శాసనసభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

గౌరవ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేశారు..

రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఈ బడ్జెట్ సెషన్ మొత్తం ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గార్లని సస్పెండ్ చేయడం అన్యాయం. ప్రజాక్షేత్రంలో గెలిచి వచ్చిన గౌరవ ఎమ్మెల్యేలను సస్పెండ్​ చేయడమే కాకుండా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఇంతటి నిరంకుశ నిర్ణయాలను ఎప్పుడూ చూడలేదు. బడ్జెట్లోని ప్రతీ మాటకు ముందు, వెనుక కేంద్రం మీద నింద వేస్తుంటే నిల్చొని నిరసన తెలిపితే సెషన్ అంతా సస్పెండ్ చేస్తారా. గతంలో ఇదే టీఆర్ఎస్ శాసన సభ్యులు, ముఖ్యంగా బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన మంత్రి హరీష్ రావు గవర్నర్ ప్రసంగాన్ని, బడ్జెట్ కాపీలను చించేసి ఛైర్ పైకి విసిరేసిన సందర్భాలున్నాయి. మరి అప్పుడు హరీష్ రావును జీవితకాలం సస్పెండ్ చేయాల్సి ఉండెనా. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర సర్కార్ కూడా మా 12 బీజేపీ ఎమ్మెల్యేల పై ఈ విధంగానే రాజ్యాంగ విరుద్దంగా సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీం కోర్టు తప్పుబట్టింది. శాసన సభ్యుల హక్కుల్ని కాలరాయలేరని చెప్పింది.

బీసీ సంక్షేమ పట్టింపే లేదు..

విద్యా, వైద్యానికి కేటాయింపులు తగ్గించి, పేదవాడికి ఆ రెండు అందుబాటులో లేకుండా చేసింది. మౌలిక వసతులు లేక ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. గత ఆరు సంవత్సరాల్లో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. టీచర్ల నియామకం లేక కేవలం విద్యా వాలంటీర్లతోనే నెట్టుకొస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. పైపెచ్చు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 5 లక్షల ఆరోగ్య భీమా ఆయుష్ మాన్ మనరాష్ట్రంలో అమలుకు నోచుకోకపోవడం వల్ల కరోనా కష్ట కాలంలో తెలంగాణ పేదలు ఆర్థికంగా చితికిపోయారు. కార్పోరేట్ ఆసుపత్రులకు లక్షల రూపాయలు చెల్లించలేక ప్రాణాలు కోల్పోయారు. బీసీ సంక్షేమాన్ని కాగితాలకు, కేటాయింపులకే పరిమితం చేసింది కేసీఆర్ సర్కార్. గత బడ్జెట్లలో కార్పొరేషన్లో ఫెడరేషన్ల పేరు మీద కేటాయించి ఖర్చు చేయని నిధులే 3700 కోట్లు, మళ్లీ బడ్జెట్​లో నిధులు కేటాయిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. గత నాలుగేండ్లుగా బీసీ ఫెడరేషన్లకు ఒక్క పైసా కేటాయించలేదు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ముచ్చటే లేదు. ఆత్మగౌరవ భవనాలకు 2018 లోనే నిధులు కేటాయిస్తున్నట్లు జీవో జారీ చేశారు. 2022 బడ్జెట్లో మళ్లీ అదే కేటాయింపులు చూపిస్తున్నారు. బీసీ కార్పొరేషన్​కి 2018 లో రుణాలు ఇచ్చిన తర్వాత గత నాలుగు సంవత్సరాల నుండి ఇప్పటికి 5.5 లక్షల మంది రుణాల కోసం ఎదురుచూస్తు న్నారు. ఈ బడ్జెట్ లో కూడా వారికి న్యాయం జరగలేదు. బీసీ విద్యార్థుల పెండింగ్ స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్​ విషయంలో కూడా విద్యార్థులకు ఏ విధమైన ఊరట కనిపించలేదు. పేదలైన బీసీ బిడ్డలకు బీసీ బంధు ప్రకటిస్తామని హామీ ఇచ్చి మరిచారు.

10వేల మంది జీహెచ్​ఎంసీ  వర్కర్లను తొలగించారు..

కార్పొరేషన్లు అప్పు తీసుకోవడానికి, రాష్ట్ర ఆదా యంలో 90% వరకు గ్యారంటీ అవకాశం ఉంటే మోదీ ప్రభుత్వం దాన్ని 200 శాతానికి పెంచింది. తద్వారా కార్పొరేషన్లకు రూ. 2.60లక్షల కోట్లు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించింది మోదీ సర్కార్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​కు 2,750 కోట్లు కేటాయించారు. కానీ గత ఆరు నెలలుగా నిధులు విడుదల చేయనేలేదు. వైద్య రంగానికి సంబంధించి ఏడాది కాలంగా రూ. 600 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టోలో 18వేల మంది కార్మికులను క్రమబద్దీకరిస్తామని చెప్పి, జీహెస్​ఎంసీలో 10వేల మంది కార్మికులను తొలగించారు. కేంద్రం తెలంగాణకు ఇప్పటి వరకు పన్నుల వాటా కింద రూ.1.22 లక్షల కోట్లు, కేంద్ర పథకాల ద్వారా 1.15 లక్షల కోట్లు ఇచ్చింది.

- డా. కె. లక్ష్మణ్ 
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు