దేశ ప్రగతికి సముచిత కేటాయింపులు : డా.ఎండీ ఖ్వాజా మొయినొద్దీన్

భారత దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023–-24  ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్నిరంగాలపై దృష్టి పెట్టింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఆకర్షించే అంశం ఆదాయ పన్ను పరిమితిని 7 లక్షల వరకు  పెంచడం. తద్వారా ఉద్యోగులకు అంతమేరకు ఆదాయ మిగులు సాధ్యపడింది. వ్యవసాయ రంగాన్ని మరింత బలపర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ అప్ లకు ప్రాధాన్యం ఇస్తూ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలైన పాడి, హార్టికల్చర్, మత్స్య రంగాలకు భారీ కేటాయింపులే చేశారు. జీడీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం హామీలేని రుణాలకు కేటాయింపులు పెంచారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చారు. సాంఘిక వర్గాలైన సీనియర్ సిటిజన్స్, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి పథకాలను ప్రవేశ పెట్టారు.

రోడ్డు, రైల్వే, విమానయానం వంటి మౌలిక సదుపాయాలకు ఈ బడ్జెట్ లో దాదాపు10 లక్షల కోట్లు కేటాయించడం విశేషం. ఇందులో సింహభాగం రైల్వేకు కేటాయించగా, రాష్ట్రాల ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​కు వడ్డీలేని రుణాలను ఈ బడ్జెట్ లోనూ కొనసాగించారు. వైద్య రంగ అభివృద్ధికి కొత్త నర్సింగ్ కాలేజీలు పెంచడం, ఫార్మా రంగంలో పరిశోధనలు ప్రోత్సహించడం మంచి పరిణామాలు. కరోనాలో చతికిలపడిన టూరిజం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం కల్పించారు. గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి ఈ బడ్జెట్ లో సముచిత స్థానం ఇచ్చారు. ఇలా దేశంలోని అన్నిరంగాలను ప్రగతి పథంలో నడిపే విధంగా కేటాయింపులు చేశారు.

- డా.ఎండీ ఖ్వాజా మొయినొద్దీన్, ప్రొఫెసర్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్