మిర్చి రైతుపై ‘బరువు’ కిరికిరి.. రిగ్గింగ్ అయిన వ్యాపారులు

మిర్చి రైతుపై ‘బరువు’ కిరికిరి.. రిగ్గింగ్ అయిన వ్యాపారులు
  •     ఏనుమాముల మార్కెట్లో మిర్చి బస్తాకు 49 కిలోలు దాటొద్దని రింగ్‍ అయిన వ్యాపారులు
  •     మంత్రులు, కలెక్టర్ల సమక్షంలో తీసుకున్న నిర్ణయమంటున్రు
  •     అడిగితే.. రోజూ పొద్దున్నే ధర, కాంటాలు పెట్టకుండా నిరసన

వరంగల్‍, వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులు  'బరువు' కిరికిరి  చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి సీజన్‍ నడుస్తున్న నేపథ్యంలో రోజూ పొద్దున్నే ఏదో ఒక సాకుతో ధర పెట్టకుండా కాంటాలు బంద్‍ చేసి నిరసన తెలుపుతున్నారు.  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వడగండ్ల వానతో రైతులు పంట నష్టపోయి తలలు పట్టుకున్న క్రమంలో ఉన్న కాస్తా పంట అమ్ముకోడానికి మార్కెట్‍ వస్తున్న రైతులకు వ్యాపారులు పెట్టే రూల్స్​ తలనొప్పిగా మారుతున్నాయి.

రైతులు పంటతో సహా తెల్లవారుజామునే మార్కెట్‍ యార్డులకు చేరుకుని కాంటాల కోసం ఎదురుచూస్తుండగా వ్యాపారులు మాత్రం బస్తాకు ఫలానా బరువు కంటే ఎక్కువుంటే తీసుకునే ప్రసక్తి లేదని మొండికేస్తున్నారు. 

49 కిలోల బరువు దాటొద్దని.. కండీషన్‍ 

ఏనుమాముల మార్కెట్‍కు రైతులు గతంలో మిర్చి తీసుకువచ్చే క్రమంలో బరువు దాదాపు 53 నుంచి 55 కిలోల మధ్య ఉండేది. కాగా, వ్యాపారులతో కలిసి పనిచేస్తున్న చాంబర్‍ ఆఫ్‍ కామర్స్​ దీనిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మిర్చి బస్తా 25 కిలోల నుంచి 49 కిలోల మధ్య మాత్రమే ఉండాలని కండీషన్‍ పెట్టింది. మార్కెట్‍ శాఖ జీవోగా చెప్పింది. ఏప్రిల్‍ 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిర్చి బరువు 49 కంటే ఎక్కువగా ఉంటే తూకం వేసే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. 

రైతులకు అడుగడుగునా.. అన్యాయమే 

మార్కెట్‍లోకి  ఏటా మిర్చి సీజన్‍లో డైలీ దాదాపు 50 వేల బస్తాల మిర్చి వస్తుంది. ఇప్పుడు ఒక్కో బస్తాను 49 కిలోల చొప్పున లెక్కిస్తారు కాబట్టి.. అంతేస్థాయి పంట మార్కెట్‍ రావాలంటే మరో 6 వేల బస్తాలు పెంచాలి. తద్వారా డైలీ 56 వేల మిర్చి బస్తాలు మార్కెట్‍ వస్తాయి.   మొదటి దశలో అన్యాయం చూసినట్లయితే.. రైతులు ఇప్పుడు రూ.80 నుంచి రూ.90 చొప్పున వ్యాపారుల వద్ద మళ్లీ కొత్త గోనె సంచి కొనాల్సి ఉంటుంది.  

తీరా పంట విక్రయించే క్రమంలో అదే గోనె సంచికి రూ.30 చొప్పున రైతుకు కట్టించేందుకు వ్యాపారులు ఇష్టపడటం లేదు. రెండో దశలో తరుగు అన్యాయం జరగనుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో 55 కిలోల బస్తాపై కిలో బరువు తరుగు తీస్తున్నారు. ఇప్పుడు ఒక్కో బస్తాలో 49 కిలోల మిర్చి ఉన్నా తరుగు మాత్రం అంతే ఉంటుంది. కానీ రైతు తీసుకొచ్చే బస్తాల సంఖ్య పెరుగుతుంది. ఆ పెరిగిన బస్తాలపై సైతం ఇప్పుడు కొత్తగా కిలో చొప్పున తరుగు తీస్తారు. 

నెలలో.. అడిషనల్‍ ఇన్‍కమ్‍ రూ.1 కోటి 50 లక్షలు

మార్కెట్లోకి ఇప్పటి వరకు సరాసరి రోజుకు 50 వేల బస్తాల మిర్చి పంట వస్తుండగా.. 49 కిలోల చొప్పున తీసుకుంటే వ్యాపారులకు 6 వేలకు పైగా బస్తాల తరుగు అదనంగా రానుంది. ఒక్కో బస్తాలో తీసే కిలో మిర్చి తరుగు విలువ రూ.115 నుంచి రూ.120 ఉంటోంది. అంటే మొత్తం 6 వేల బస్తాలపై రోజుకు వ్యాపారులకు దాదాపు రూ.7 లక్షల 20 వేల అదనపు లాభం రానుంది.  సీజన్‍లో నెలకు 20 రోజులు మార్కెట్‍ నడిచినా దాదాపు 1 కోటి 50 లక్షల రూపాయలు రానున్నాయి. ఇదేగాక మార్కెట్లో దడువాయిలు 'ముని, ధర్మం' పేరుతో ఇష్టారీతిన ప్రతీ పది బస్తాలకు అరకిలో, కిలో చొప్పున వసూలు చేస్తున్నారు. 

మంత్రి ఎర్రబెల్లి ఒప్పుకున్నారంటా..

మార్కెట్‍లో ''గోనె సంచుల సమస్య, రైతులకు చెల్లించే ధర, మిర్చి బస్తా బరువు గరిష్ఠంగా 49 కిలోలు..” అంశంపై ఎన్నోసార్లు గొడవ జరిగింది. వ్యాపారులు కాంటాలు బంద్‍ చేయగా.. తమను ఇష్టారీతిన మోసం చేస్తున్నారని రైతులు ఆందోళనలు, ధర్నాలకు దిగారు. ఈ క్రమంలో పలుమార్లు మార్కెట్‍లో క్రయవిక్రయాలు ఆగాయి. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు దీనిని శాశ్వత పరిష్కారం చూపే పేరుతో చర్చలు జరిపారు.  

దీనిపై మంత్రి, అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా, మార్కెట్‍ ఆఫీసర్లు, వ్యాపారులు మాత్రం '49 కిలోల బరువు' ఫ్లెక్సీలు కట్టారు. మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల సమక్షంలో తాము తీసుకున్న నిర్ణయానికి వారు మద్దతు తెలిపారని చెప్పుకుంటున్నారు. ఇదేం తెలియని రైతులు ఎప్పటిలానే 50 కిలోల బరువుతో మిర్చి బస్తాలు తెస్తుండగా.. సోమ, మంగళ వారాల్లో వ్యాపారులు మధ్యాహ్నం వరకు కాంటాలు పెట్టలేదు. తాము చెప్పిన రూల్స్​ పాటిస్తేనే కొనుగోలు చేస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో పంట అమ్ముకునేందుకు వచ్చే రైతులకు ఎదురుచూపులు, నష్టాలు తప్పడంలేదు.