పూడ్చిన డెడ్ బాడీని బయటకు తీసి ఎముకలు ఎత్తుకెళ్లిన్రు.. బెజ్జూర్ మండలం ఏటిగూడలో కలకలం

పూడ్చిన డెడ్ బాడీని బయటకు తీసి ఎముకలు ఎత్తుకెళ్లిన్రు..  బెజ్జూర్ మండలం ఏటిగూడలో కలకలం

కాగజ్ నగర్, వెలుగు : పూడ్చిన శవాన్ని బయటకు తీసి ఎముకలు సేకరించిన ఐదుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమావాస్య రోజున శవం నుంచి ఎముకలు సేకరించడం,  క్షుద్రపూజలు సైతం చేసిన ఆనవాళ్లు కనిపించడంతో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏటిగూడ గ్రామస్తు లు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... బెజ్జూర్ మండలం ఏటిగూడ గ్రామానికి చెందిన ఎర్నాగి చిన్నన్న 15 రోజుల కింద అనారోగ్యంతో చనిపోయాడు. 

కుటుంబ సభ్యులు తమ భూమిలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులకు డెడ్ బాడీని పూడ్చిపెట్టిన చోట పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వెళ్లి చూడగా నిమ్మకాయ, గుమ్మడికాయ, మృతదేహం నుంచి తీసిన ఎముకలతో నిందితులు కుంకుమ కనిపించడంతో పాటు మృతదేహం నుంచి ఎముకలు ఎత్తికెళ్లినట్లు గుర్తించారు. 

వెంటనే బెజ్జూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏటిగూడకే చెందిన గెడం రావుజీ, కరీంనగర్ కు చెందిన ఇద్దరితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. క్షుద్రపూజలు, గుప్త నిధుల సేకరణ కోసం ఎముకలు సేకరించినట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.