- గాలులతో పక్క పొలాలు, గ్రామాలకు విస్తరిస్తున్న మంటలు
పెద్దపల్లి, వెలుగు : వరి, మక్కజొన్న కోసిన తర్వాత కొందరు రైతులు కొయ్యకాలు తగులబెడుతుండడం వల్ల ఇటు పొలానికి, అటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. కొన్ని సార్లు ఈదురుగాలులకు నిప్పు రవ్వలు ఎగిరిపడి భారీ అగ్నిప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పక్క పొలాలు అంటుకోవడంతో పాటు, సమీప గ్రామాల్లోని ప్లాంట్లు, కొనుగోలు సెంటర్లకు విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ కమ్ముకుంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొయ్యకాలు తగులబెట్టకుండా రైతులకు అవగాహన కల్పించాల్సిన అగ్రికల్చర్, ఫైర్ ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాలో గత నాలుగు రోజుల్లో వరి కొయ్యలు కాల్చడం వల్ల పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు జరిగాయి.
పర్యావరణానికి భారీగా నష్టం
వరికొయ్యలు కాల్చడం వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. రైతులకు అవగాహన లేకపోవడం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కొయ్యలను పంట చేన్లలోనే తగులబెడుతున్నారు. దీనికి తోడు గాలులు వీస్తుండడంతో నిప్పు రవ్వలు ఎగిరిపడుతున్నాయి. దీంతో మంటలు పక్క పొలాలకు, కొన్ని సార్లు ఇతర గ్రామాల్లోకి విస్తరిస్తున్నాయి. హరితహారంలో భాగంగా రోడ్ల పక్కన నాటిన మొక్కలకు మంటలు అంటుకుంటుండడంతో అవి కాలిపోతున్నాయి. మరో వైపు దట్టమైన పొగ కమ్ముకుంటుండడంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలకు గురవుతుండగా, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తగ్గనున్న పంటల దిగుబడి
వరికొయ్యలను తగులబెట్టడం కారణంగా దిగుబడిపై ప్రభావం చూపుతుందని, రాను రాను పంటల దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందని సైంటిస్ట్ లు చెబుతున్నారు. కొయ్యకాల్ల మొదళ్లలో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు పలు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ పంటలకు ఉపయోగపడేవేనని, కొయ్యలను తగులబెట్టడం వల్ల ఇవన్నీ కాలిపోతాయని సైంటిస్టులు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఇలా కొయ్యలను కాల్చడం మూలంగా పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు, భారీ వర్షాలు పడే టైంలో భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. వరికొయ్యలను పొలం, చేన్లలోనే కలిపి దున్నితే మందుల వాడకం తగ్గించుకోవడంతో పాటు నత్రజని, నాలుగు శాతం భాస్వరం అదనంగా అందే అవకాశం ఉంటుంది. కొయ్యకాలును పొలంలో కలిపి దున్నితే అది కుల్లిపోయి సేంద్రియ ఎరువుగా ఉపయోగపడి 10 శాతం దిగుబడి పెరుగుతుంది. దుక్కి దున్నే టైంలో సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే అవశేషాలు ఈజీగా డీకంపోజ్ అవుతాయని, దీని వల్ల బీపీపీ వాడకం కూడా తగ్గుతుందని అగ్రికల్చర్ సైంటిస్టులు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలు
పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం పోతారంలో ఓ రైతు ఇటీవల తన పొలంలో కొయ్యకాలుకు నిప్పు అంటించి వెళ్లిపోయాడు. ఆ మంటలు సమీపంలోని సోలార్ ప్లాంట్ కు విస్తరించాయి. గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్‌స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. .
పెద్దపల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని రాఘవాపూర్ గ్రామ పరిసరాల్లో ఓ రైతు కొయ్యకాలు అంటించడంతో ఆ మంటలు రైల్వే స్టేషన్సిగ్నల్ వద్దకు విస్తరించాయి. గమనించిన స్థానికులు ఫైర్‌స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. ఇన్‌టైంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది
.
ఓదెల మండలంలో ఓ రైతు కొయ్యకాలుకు పెట్టిన నిప్పు రోడ్డు పార్క్ చేసిన ఇన్నోవాకు అంటుకుంది. దీంతో కారు కాలిబూడిదైంది.జూలపల్లి మండలంలో కొయ్యలకు పెట్టిన నిప్పు అంటుకొని తిరుమల్ అనే రైతుకు సంబంధించిన రెండెకరాల అరటితోట దగ్ధమైంది.
భూసారం తగ్గుతుంది
వరి, మక్కజొన్న కొయ్యకాలు కాల్చడం వల్ల భూసారం తగ్గుతుంది. కొయ్యకాలును కలిపి దున్నకోవడం వల్ల నత్రజని, భాస్వరం పెరుగుతుంది. దీని వల్ల అధిక దిగుబడి వస్తుంది. రైతులెవరూ కొయ్య కాలును తగులబెట్టొద్దు.
- శ్రీధర్సిద్ధిఖి, వ్యవసాయ శాస్త్రవేత్త, పెద్దపల్లి