స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి

స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వండి
  • అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశం
  • అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని వెల్లడి 
  • వచ్చే నెల 3న మరోసారి మీటింగ్

హైదరాబాద్, వెలుగు : స్థానికత ఆధారంగా 317 జీవో బాధితుల లిస్ట్ ఇవ్వాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. నిజమైన అర్హుల వివరాలు అందజేయాలని, దాంతో అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తామని కమిటీ వెల్లడించింది. శుక్రవారం సెక్రటేరియెట్ లో 317 జీవో సబ్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్, మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ మెంబర్లు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని కమిటీ నిర్ణయించింది. 

కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించినా.. మరికొన్ని శాఖల నుంచి నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల  ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత.. 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగుల దరఖాస్తులు రిపీట్ అయినట్టు సబ్ కమిటీ గుర్తించింది. కాగా, ఈ జీవో వెసులుబాటును ఉపయోగించుకొని ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిం చాలానే ఉద్దేశానికి వ్యతిరేకంగా కొంతమంది వారి వారి సొంత జిల్లాకు పోవాలనే ప్రయత్నంలో ఉన్నారని ఉన్నతాధికారులు మంత్రులు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో నిజమైన అర్హుల వివరాలు అందజేయాలని కమిటీ సభ్యులు అధికారులను ఆదేశించారు. అలాగే, వచ్చేనెల 3న మరోసారి సమావేశం కావాలని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.