జగిత్యాల టౌన్, వెలుగు: బాలుడు కిడ్నాప్ అయ్యాడంటూ జరిగిన ప్రచారం జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కి చెందిన వెంకటేశ్వర్ రావు-– అనురాధ కొడుకు ఫణి రేవంత్(11). ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమై సాయంత్రం కరీంనగర్ బస్టాండ్ లో ప్రత్యక్షమయ్యాడు. స్థానికులు గుర్తించి కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
వారు జగిత్యాల పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి బస్టాండ్ లో వదిలేశారని బాలుడు ఎంక్వైరీ లో తెలిపినట్లు సమాచారం. కొంత కాలంగా బాలుడి తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుండడంతో వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తన భర్తే కొడుకును కిడ్నాప్ చేసినట్లు తల్లి ఆరోపించింది. తల్లి హాస్టల్ కు పంపిస్తుందనే భయంతో బాలుడే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.