
హనుమకొండ, వెలుగు : చిన్న పాటి వానకే గ్రేటర్ వరంగల్‌లోని కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహానికి తగ్గట్టుగా నాలాలు వెడల్పు లేకపోవడం, ఉన్న వాటిలోనూ చెత్తాచెదారం, పూడిక పేరుకుపోవడంతో అవి ఉప్పొంగుతూ లోతట్టు ప్రాంతాలను ముంచేస్తున్నాయి. రెండు రోజుల కిందట సిటీలో అరగంట పాటు కురిసిన వానకే చాలా చోట్ల డ్రైన్లు పొంగి ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంపు పరిస్థితులు తలెత్తకుండా నాలాలు, మురుగు కాల్వల్లో డీ సిల్టేషన్ చేపట్టిన ఆఫీసర్లు కాలనీల్లోని చిన్న చిన్న డ్రైన్లను పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే పూడికతీత పనుల పేరుతో నిధులు మింగేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఉప్పొంగుతున్న కాల్వలు
వరంగల్ సిటీలో నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, ఇతర ప్రధాన నాలాలు కలిపి 53.3 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఒక మీటర్ వెడల్పు ఉన్న నాలాలు, పక్కా, కచ్చా డ్రైన్లు అన్నీ కలిపి సుమారు 3 వేల కిలోమీటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. కొన్నేండ్ల కిందట అప్పటి అవసరాల మేరకు డ్రైనేజీలు నిర్మించారు. కానీ ప్రస్తుతం సిటీ విస్తరించడంతో డ్రైనేజీలు సరిపోవడం లేదు. దీనికి తోడు చాలా చోట్ల కాల్వల మధ్యలోంచే పైపులైన్లు, స్తంభాలు వేయడంతో మరింత ఇరుకుగా మారి వరద ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో చిన్నపాటి వరదకే కాల్వలు ఉప్పొంగుతున్నాయి.
హనుమకొండలోని తిరుమల జంక్షన్, అశోక కాలనీ, గోకుల్ నగర్, శ్రీనివాసకాలనీ, వికాస్‌నగర్, పోచమ్మకుంట, అలంకార్ సెంటర్, రాయపుర, మచిలీ బజార్, కాపువాడ, ఆటోనగర్, బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీలు ఇరుకుగా ఉన్నాయి. రెండు రోజుల కిందట పడిన వానకు తిరుమల జంక్షన్ నీళ్లతో నిండి సమీపంలోని హనుమకొండ తహసీల్దార్ ఆఫీస్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఆవరణలోకి చేరింది. ప్రతీ సీజన్‌లో ఈ సమస్య ఏర్పడుతున్నా పరిష్కరించేందుకు ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు. పక్కనే ఉన్న కుడా అపార్ట్‌మెంట్, అంబేద్కర్ భవన్ వద్ద నాలాలు ఆక్రమణకు గురి కావడం, కాల్వలపై శ్లాబులు వేయడంతో వరద నీళ్లు వెళ్లే దారి లేక ముంపు పరిస్థితి ఏర్పడుతోంది.
రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా..
వర్షాకాలం ముందు నగరంలోని నాలాల్లో పూడికతీత తీసేందుకు ప్రతి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా సుమారు రూ.2.3 కోట్లతో 33 ప్రధాన నాలాలతో పాటు ఇంటర్నల్ డ్రైనేజీల్లో పూడికతీసే పనులు స్టార్ట్ చేశారు. ఈ పనులన్నీ ఈ నెల 5 వరకే కంప్లీట్ చేయాలని డెడ్‌లైన్ విధించారు. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా డీ సిల్టేషన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇంటర్నల్ డ్రైన్లను అయితే అసలు పట్టించుకోవడమే లేదు.
మరో వైపు పూడిక తీయకుండానే చాలా చోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించి నిధులు కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఇంజినీరింగ్ ఆఫీసర్లు కూడా సహకరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే చాలా చోట్ల గవర్నమెంట్ ఆఫీసులు, షాపింగ్ మాల్స్, ఇతర దుకాణాల ముందు స్లాబ్‌లు వేసుకున్నారు. వాటి కింద పూడిక పేరుకుపోతుండడంతో వరద ప్రవాహానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి డీసిల్టేషన్ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, నాలాలపై ఉన్న స్లాబ్‌లపై ఫోకస్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.