సందర్భం : యూట్యూబ్​ స్టార్​ సుసాన్​

సందర్భం : యూట్యూబ్​ స్టార్​ సుసాన్​
  • సుసాన్​ నెట్​వర్త్​ 800 మిలియన్​ డాలర్లు

సుసాన్​ యూట్యూబ్​ స్టార్​గా వెలిగిపోయింది. అదేంటి! ఈమె యూట్యూబ్​ వీడియోల్లో ఎక్కడా చూడలేదు. ఆమె వీడియో క్లిప్స్​ ఆన్​లైన్​లో వైరల్​ కూడా కాలేదు. అయినా కూడా ఆమె మాత్రం యూట్యూబ్​ స్టార్​! ఎలా? ఎలాగంటే... మోస్ట్​ పాపులర్​ వీడియో షేరింగ్​ సైట్​ యూట్యూబ్​కి ఆమె సీఈఓగా ఉండేది.

యూట్యూబ్​లో వీడియోలు అప్​లోడ్​ చేసే చాలామందికి యూట్యూబ్​ను ముందుకు నడిపించిన సుసాన్​ గురించి తెలియకపోవచ్చు. కానీ వర్క్​లైఫ్​ బ్యాలెన్స్​ పర్ఫెక్ట్​గా చేసుకుని కెరీర్​లో ఎదిగేందుకు ఆడవాళ్లకు కుటుంబ బాధ్యతలు అడ్డుకాదని నిరూపించింది. ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ ‘‘నేను ఐదుగురు బిడ్డల తల్లిని కావడం వల్లే... కెరీర్​లో ప్రియారిటీస్​ను బాగా మేనేజ్​ చేసుకోగలిగా” అని చెప్పింది. రెండేండ్లు లంగ్​ క్యాన్సర్​తో పోరాడి56 ఏళ్ల వయసులో ‘ఇక సెలవు’ అంటూ వెళ్లిపోయింది. ఈ నెల ఆగస్టు 9వ తేదీన మరణించిన సుసాన్​ ఒజెస్కీ గురించి...

గూగుల్​, యూట్యూబ్​లు రూపుదిద్దుకోవడంలో సిలికాన్​ వ్యాలీ విజనరీ అయిన సుసాన్ పని కీలకం. కాలిఫోర్నియాలోని శాంటాక్లారా కౌంటీలో1968వ సంవత్సరం, జులై 5న పుట్టింది సుసాన్. ఆమె​ తల్లి ఎస్తేర్​, అమెరికన్​ జర్నలిస్ట్. తండ్రి స్టాన్లీ స్టాన్​ఫోర్డ్​ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్​. కొత్త వాటిని కనుగొనడం, ప్రపంచంలో ఎలాగైనా మంచి మార్పు తెచ్చే విషయాల పట్ల ప్యాషన్​ని ఆ యూనివర్సిటీ వాతావరణం ఆమెలో కలిగించింది. సుసాన్​కు ఇద్దరు చెల్లెళ్లు. అందులో ఏన్ ‘23అండ్​ మి’ అనే కంపెనీ సీఈఓ​ కాగా జేనెట్​ ఆంత్రోపాలజిస్ట్​.

చిన్నప్పట్నించీ ఏదో ఒక పని చేయాలనే తపన ఉన్న సుసాన్​ పదకొండేళ్ల వయసులో ‘స్పైస్​ రోప్స్​’ను ఇంటింటికీ తిరిగి అమ్మేది. కాలేజీలో హ్యుమన్​ సొసైటీ అండ్​ కల్చర్​ చదివేటప్పుడు సీనియర్​గా కంప్యూటర్​ క్లాస్​ చెప్పింది. ‘‘ప్రపంచాన్ని మార్చగల అద్భుతమైన శక్తి టెక్నాలజీకి ఉంది​. ఆ మార్పు ఎన్ని మార్గాల్లో జరుగుతుంది అనేది మనం గుర్తించలేం. అయితే ఆ శక్తిలో20 నుంచి 30 శాతం మాత్రమే ఆడవాళ్లు ఉంటే కనుక అది సమస్యగా మారుతుంది” అని గట్టిగా చెప్పేది సుసాన్​. అంటే రకరకాల కారణాలు చెప్పి ఆడవాళ్లను ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఉండొద్దని చెప్పడమే!

సుసాన్​ టెక్​ జర్నీ...

సుసాన్​ టెక్​ జర్నీ గురించి చెప్పాలంటే గూగుల్​ ఫౌండర్స్​  లారీ పేజ్​, సెర్గీ బ్రిన్​ గురించి కొంత చెప్పుకోవాలి. స్టాన్​ఫోర్డ్​ యూనివర్సిటీకి చెందిన ఈ ఇద్దరూ సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​ను తయారుచేసేందుకు స్టార్టప్​ పెట్టాలనుకున్నారు. తమ ఆలోచనలకి రూపు ఇచ్చేందుకు ఒక ప్లేస్​ కావాలని వెతుకుతున్నారు. ఆ యువ కంప్యూటర్​ సైంటిస్ట్​లకు కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్​లో ఉన్న సుసాన్​ ఇంటి గ్యారేజ్​ ఆసరా అయింది. సరిగ్గా అప్పుడే సుసాన్​కి కూడా ఇంటి లోన్​ కట్టేందుకు గ్యారేజ్​ అద్దెకు ఇవ్వడం మంచిది అనిపించింది. అలా ఆ ఇద్దరి అవసరాలకు తగ్గట్టు పర్ఫెక్ట్​ అరేంజ్​మెంట్​ జరిగిపోయింది.1998లో జరిగిన ఆ ఏర్పాటు గూగుల్​ సెర్చ్​ ఇంజిన్​కు వేదిక అయ్యింది.

ఆ గ్యారేజిలో చేరిన లారీ, సెర్గీలు ఇద్దరూ పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తుండే వాళ్లు.  గ్యారేజిని డజన్ల కొద్దీ కంప్యూటర్లతో నింపేశారు. ఇంటి హాల్​మీదుగా కేబుల్స్​ చెల్లా చెదురుగా పడి ఉండేవి. ఆఖరికి బాత్​రూమ్​ సింక్​ మీద కూడా కంప్యూటర్​ పెట్టేవాళ్లు. వాళ్లు ఆ ఇంట్లో చేరడం ఆర్ధికంగా సుసాన్​కి చేయూతగానే ఉండేది. కానీ కొన్ని విషయాల్లో వాళ్లని భరించాల్సి వచ్చింది కూడా. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుండడం వల్ల అర్ధరాత్రి దాటాక రెండు గంటలకి ఆకలి వేసేది వాళ్లకు. అంతే వెంటనే వాళ్లకి సుసాన్​ ఫ్రిజ్​ కళ్లముందు కదిలేది. ఆ ఫ్రిజ్​ రెంట్​ అగ్రిమెంట్​లో లేనప్పటికీ ‘రేపు ఇచ్చేద్దాం’ అనే ఆలోచనతో అందులో ఉన్న ఫుడ్​ తిని ఆకలి తీర్చుకునేవాళ్లు. మరుసటి రోజు ఉదయం సుసాన్​ నిద్ర లేచి బ్రేక్​ఫాస్ట్​ కోసం కిందకు వచ్చేసరికి ఫ్రిజ్​లో ఫుడ్​  కనిపించేది కాదు. దాంతో ఇక లాభం లేదని తను రిఫ్రిజిరేటర్​ కొనుక్కుని వాళ్లకు తన రిఫ్రిజిరేటర్​ ఇచ్చేసింది. బహుశా ఆ సమస్య వల్లే కావచ్చు గూగుల్​ ఉద్యోగులకు ఫుడ్​ 24 గంటలు అందుబాటులో ఉంచే కల్చర్​ ఆచరణలో పెట్టారు.

ఇంటెల్​ నుంచి గూగుల్​కి

గ్యారేజిలో గూగుల్​ సెర్చ్​ ఇంజిన్​కి సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడు సుసాన్​ ​ ఇంటెల్​లో పనిచేస్తోంది. అయితే గూగుల్​ కంపెనీ పొటెన్షియల్​ను అంచనా వేసిన సుసాన్​ ఇంటెల్​లో చేస్తున్న ఉద్యోగానికి రిజైన్​ చేసింది. గూగుల్​లో16వ ఉద్యోగిగా చేరింది. ఉద్యోగంలో చేరిన వెంటనే గూగుల్​ మార్కెటింగ్​తో పాటు కన్జ్యూమర్​ ప్రొడక్ట్స్ అయిన గూగుల్​ ఇమేజెస్, గూగుల్​ బుక్స్​ బాధ్యతలు అప్పజెప్పారు. వాళ్లిద్దరూ సెర్చ్​ ఇంజిన్​ మీద దృష్టి పెట్టారు. వాళ్ల లక్ష్యం డబ్బులు సంపాదించడం కాదు. బెస్ట్​ సెర్చ్​ ఇంజిన్​ తయారుచేయడమే. అదేమంత చిన్న టాస్క్​ కాదు. తన మీద పెట్టిన పెద్దబాధ్యతను ఛాలెంజ్​గా తీసుకుంది సుసాన్​. ఏళ్లు గడిచే కొద్దీ ఒక్కో ర్యాంక్​ దాటుకుంటూ సీఈఓ స్థాయికి చేరుకుంది.

‘‘నా ప్రయాణంలో ఒక్కో ఛాలెంజ్​ను ధైర్యంగా ఎదుర్కొన్నా. ఎందుకంటే మా మిషన్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలకు  మేలు కలుగుతుంది. కావాల్సిన సమాచారం దొరుకుతుంది. క్రియేటర్స్​కి సపోర్ట్​గా ఉంటుంది. నలుమూలల నుంచి ఎన్నో స్టోరీస్​ తెలుసుకోవచ్చు. ఆర్టిస్ట్​ల నుంచి చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ల వరకు సపోర్టు ఇవ్వొచ్చు.ఈ మొత్తం ప్రయాణంలో మేం సాధించిన ప్రతీ విషయం నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మేం చేసిన ప్రతీ పనికి ఒక అర్థం ఉంది. సంతోషం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే అందరికీ ఎంతో అవసరమైన ఒక ప్లాట్​ఫామ్​ను సృష్టించగలిగాం” అని ఒక బ్లాగ్​ పోస్ట్​ చేసింది సుసాన్​.

యూట్యూబ్​ను కొనేసి...

గూగుల్​ 2005లో వీడియో లాంచ్​ చేసింది. 2006లో ఇంటర్నెట్​ కంపెనీని1.65 బిలియన్​ డాలర్లతో తమ రైవల్​ వీడియో అప్​లోడ్​ వెబ్​సైట్ యూట్యూబ్​ను కొనేసింది.  అలాగే గూగుల్​​ ఇమేజ్​ సెర్చ్​ డెవలప్​మెంట్​లో లైసెన్స్​ సెర్చ్​ టెక్నాలజీని తెచ్చింది. ఈ ప్రాసెస్​లో సుసాన్​ కీలక పాత్ర పోషించింది. 2014, ఫిబ్రవరిలో యూట్యూబ్​ సీఈఓగా అపాయింట్ అయ్యింది. గూగుల్​ అడ్వర్టైజ్​మెంట్స్​ బిజినెస్​లో వీడియో ప్లాట్​ఫామ్​ అనేది ఎంత ముఖ్యం అనే విషయాన్ని గ్రహించి ముందుకు వెళ్లింది సుసాన్​​. ఆ తరువాత దశాబ్ద కాలంలో చాలా స్పీడ్​గా దాన్ని డెవలప్​ చేయగలిగింది.

‘‘టెలివిజన్​ ప్రేక్షకులను కోల్పోతున్న క్రమంలో యూట్యూబ్​ అనేది ప్రతి ప్రాంతంలో, ప్రతి స్క్రీన్​ మీదకు చేరింది” అని 2016లో జరిగిన యూట్యూబ్​ బ్రాడ్​కాస్ట్​ ఈవెంట్​లో గర్వంగా చెప్పింది సుసాన్​. గూగుల్​, యూట్యూబ్​... రెండు టెక్​ సంస్థలను డెవలప్​ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంత బాధ్యతగల స్థానంలో ఉంటూ ఉద్యోగాలు చేసే ఆడవాళ్లకు, తల్లిదండ్రులకు  అనుకూలంగా వర్క్​స్పేస్​ ఉండేలా కృషి చేసింది. మరీ ముఖ్యంగా పేరెంటల్​ లీవ్​ గురించి చెప్పాలి. ఆమె గూగుల్​లో చేరేటప్పటికి నాలుగు నెలల గర్భిణి. గూగుల్​లో పేరెంటల్​ లీవ్​ తీసుకున్న మొదటి వ్యక్తి ఆమె.

యూట్యూబ్​ను కొనేసి...

మల్టీ బిలియన్​ డాలర్​ టెక్​ కంపెనీ నడుపుతూనే తన వ్యక్తిగత జీవితానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలా మేనేజ్​ చేసి ఉంటుందామె అని చాలామంది అనుకుంటుంటారు. ఇదే విషయాన్ని 2014లో ఆమెను ఇంటర్వ్యూ చేసిన వాళ్లు అడిగారు. ఆ ఇంటర్వ్యూ టైంకి ఆమె రెండోసారి ప్రెగ్నెంట్.. 8 నెలల గర్భిణి. ‘‘ఒక్కముక్కలో చెప్పాలంటే... తల్లి ఉద్యోగిని అయితే ఆ కుటుంబానికి కలిగే ప్రయోజనాల మీద నాకు, నా కుటుంబానికి నమ్మకం ఉంది. మీ పిల్లలు మీ కెరీర్​ నుంచి ఎంతో కొంత పొందుతారు. అలాగే మీ పిల్లల వల్ల మీ కెరీర్​కు కూడా ఎంతో కొంత అందుతుంది” అని చెప్పింది.

అదే నా కెరీర్​కు మైల్​స్టోన్​!

ఒక స్థాయికి చేరుకున్నాక ఇలాంటి మాటలు ఎన్నయినా చెప్పొచ్చు అనే వాళ్లు కూడా ఉంటారు. కానీ, ఆమె  వర్క్​లైఫ్​ బ్యాలెన్స్​ ఎలా  చేసుకుందో తెలిస్తే ఆ మాట అనరు. సీఈఓలకు టైం దొరకడం అనేది కష్టం. అదికూడా సిలికాన్​ వ్యాలీలో పనిచేసే వాళ్లకు ఆ ఛాన్స్​ ఉండదనే చెప్పాలి.  కానీ సుసాన్​ మాత్రం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లిపోయేది. ప్రతి రోజు రాత్రి తన కుటుంబంతో కలిసి భోజనం చేసేది.  ఆ విషయం గురించి చెప్తూ ‘‘నేను ఇంట్లో డిన్నర్​ చేసేందుకు ట్రై చేసేదాన్ని. పిల్లలు నిద్రపోయాక ఇ–మెయిల్స్​ చెక్​ చేసుకునేదాన్ని. ఇలాంటి బ్యాలెన్స్​ వర్కింగ్ విమెన్​కి చాలా అవసరం. కుటుంబ బాధ్యతలు నన్ను బెటర్​ సీఈఓగా నిలబెట్టాయి. ఎందుకంటే పనులను వాటి ప్రాధాన్యతలను బట్టి ఒక లిస్ట్​ చేసుకోవాల్సి వస్తుంది. అలా చేయడం కంపెనీ మీద పాజిటివ్​ ఎఫెక్ట్​కి కారణం అయ్యింది. నేను పర్ఫెక్ట్​ తల్లిని అనుకోను.

కొన్ని సందర్భాల్లో వర్క్​ విషయంలో కూడా నాకు నేను పర్ఫెక్ట్​ కాదనే అనుకున్నా. అందుకు కారణం టైం సమస్య. కానీ ఆ రెండు విషయాలే నన్ను బెటర్​ తల్లిని, వర్క్​ప్లేస్​లో దృష్టి పెట్టేలా చేశాయి. ఐదుగురు పిల్లల తల్లిని కావడం వల్ల మల్టీటాస్కింగ్​, పనులను ప్రియారిటైజ్​ చేసుకోవడం చాలా బాగా వచ్చింది. తల్లిని కావడం వల్ల వర్క్​ విషయంలో కూడా సక్సెస్​ అయ్యా. నా రెండో బిడ్డ కడుపులో ఉన్నప్పుడు సక్సెస్​ఫుల్​, డిమాండింగ్​ కెరీర్​ను వదిలేస్తా అనుకున్నారు కొందరు. అదే నా స్థానంలో జూనియర్​ లెవల్​లో ఉన్న ఉద్యోగిని అయితే డైరెక్ట్​గా ‘నువ్వు ఉద్యోగం మానేస్తావా’ అని ఆమెనే అడుగుతారు. కానీ నన్ను మాత్రం ఆ ప్రశ్న అడిగే ధైర్యం చేయలేదు. వాళ్లలో వాళ్లు ఆమె జాబ్​ క్విట్​ చేస్తుంది అనుకునేవాళ్లు. నేరుగా అడగకపోవడానికి కారణం నేను ఉన్నత స్థాయి ఉద్యోగిని కావడమే!

అవకాశాలు వచ్చాయంటే...

ఈ జనరేషన్ అమ్మాయిలకు నేనిచ్చే సలహా జీవితాన్ని ఎక్కువగా ప్లాన్​ చేసుకోవద్దు. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు... అన్నీ అనుకున్నట్టు ఉండకపోవచ్చు. నేను గూగుల్​లో చేరినప్పుడు నాలుగు నెలల గర్భిణిని. అలాగని వచ్చిన అవకాశాన్ని వద్దనుకోలేదు. కొన్ని సందర్భాల్లో టైం వచ్చినప్పుడు​ అప్పటికప్పుడు డెసిషన్​ తీసేసుకోవాలి. అలా నేను తీసుకున్న డెసిషన్​ వల్లనే కెరీర్​లో​ ఉన్నత స్థాయికి చేరుకున్నా. ఫ్యామిలీ, కెరీర్​ను బ్యాలెన్స్​ ఎలా చేయాలని కంగారు పడే ఉద్యోగినులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కనడం అనేది జీవితంలో వచ్చే పెద్ద మార్పు. ఆ మార్పు నుంచి కూడా చాలా త్వరగా బయట పడతాం. కాబట్టి అలా ఆలోచించాలి” అని సలహా ఇచ్చింది ఆమె.​. 

‘‘నా జీవిత భాగస్వామి అని చెప్పడం కాదు కానీ ఆమె ఒక బ్రిలియంట్​ మైండ్​. పిల్లలకు ఎంతో ప్రేమను అందించిన తల్లి. నాకే కాదు మరెందరికో ఆమె మంచి ఫ్రెండ్. ఆమె పని ప్రభావం నా కుటుంబం మీద, ప్రపంచం మీద ఎంతగా ఉందో మాటల్లో  చెప్పలేను. మా 26 ఏండ్ల దాంపత్యంలో నన్ను, ఐదుగురు పిల్లల్ని ఒంటరిగా వదిలేసి తను వెళ్లిపోయింది” అని భార్య మరణం తరువాత డెన్నిస్​ ట్రోపర్​ ఫేస్​బుక్​లో పోస్ట్​ చేశాడు.

జాన్​ హాప్​కిన్స్​ యూనివర్సిటీలో 2014లో సుసాన్ చేసిన​ గ్రాడ్యుయేషన్​ స్పీచ్​లో  ‘‘కెరీర్​, లైఫ్​ ఎందులో అయినా పర్ఫెక్ట్​ అవకాశాలు అనేవి ఎప్పుడో కానీ రావు. ఆ అవకాశాలు మంచిగా, గందరగోళంగా ఉంటాయి. చాలాసార్లు వాటిని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అవి రిస్కీగా కూడా ఉంటాయి. ఛాలెంజెస్​ విసురుతాయి. అయినా వాటిని పట్టుకోవాలి. ఛాలెంజెస్​ తట్టుకుని ముందుకు వెళ్లాలి” అని చెప్పింది​.

గూగుల్​ సీఈఓ సుందర్​ పిచాయ్​ మాట్లాడుతూ ‘‘ఇతరులకు మొదటి స్థానం ఇవ్వడంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. 20 ఏళ్ల క్రితం నేను గూగుల్​ ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఆమె చూపిన దయాగుణాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను.  క్యాంపస్​లో ఐస్​క్రీం తింటూ నడుస్తూ మాట్లాడుకున్నాం” అన్నాడు.