- మీ ఫ్రెండ్లీ పోలీసులే కేసు పెట్టారు
- పారిపోయాడని కోర్టుకు చెప్పారు
- కొడుకును పోగొట్టుకున్న తల్లిని పరామర్శించరా?
- ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల టౌన్, వెలుగు : జగిత్యాల రూరల్మండలంలో ఉన్న హబ్సిపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టించారని ఆరోపించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం ఇందిరాభవన్ లో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సర్పంచ్‌పై కేసు నమోదైందని, అయినా పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు.
నిందితుడు పరారీలో ఉన్నాడని కోర్టుకు చెప్పారని, పరారీలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పాల్గొన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఆ కేసులో పోలీసులు ఎవరికీ ఫ్రెండ్లీగా పని చేసారో అందరికీ తెలుసన్నారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి ఇంటిపై ముగ్గురు దాడి చేస్తే బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీసులు స్పందించలేదని, దీంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఇందులో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడన్నారు. కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని, ఎస్పీ ఎంక్వైరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. జాగృతి మహిళా అధ్యక్షురాలు కవిత నిందితులను పరామర్శించారని, కానీ పాతికేండ్ల కొడుకు చనిపోయిన బాధలో ఉన్న తల్లిని, ఆ కుటుంబాన్ని మాత్రం పరామర్శించలేదన్నారు. 2014కు ముందు కేసీఆర్, కేటీఆర్, కవిత స్థితి..ఇప్పటి స్థితి అన్నీ బయటకు వస్తాయన్నారు.