బెంగళూరులో ఓ యువజంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. కొన్నాళ్ల నుంచి సహజీవనం చేస్తున్న వీళ్లు ఉన్నట్టుండి ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోయారు. ప్రస్తుతం ఈ షాకింగ్ ఘటన బెంగళూరు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు మొదలుపెట్టారు. ఉన్నతవంతమైన జాబ్స్ చేస్తున్న వీళ్లు కలిసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఇరు కుటుంబాలను వెంటాడుతున్నాయి..!
బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల సౌమిని దాస్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో రెండో సంవత్సరం నర్సింగ్ చదువుతోంది. కేరళకు చెందిన 29 ఏళ్ల అభిల్ అబ్రహం బెంగళూరులోనే నర్సింగ్ సర్వీస్ ఏజెన్సీని నిర్వహిస్తున్నాడు. సౌమిని, అభిల్ మధ్య కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వారి ఫ్రెండ్ షిప్ కాస్త ప్రేమకు దారితీసింది. ఇంకేముందు.. ఇద్దరూ వేర్వేరుగా ఒంటరిగా ఉండకూడదనుకుని కలిసే ఉండాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలంగా దొడ్డగుబ్బిలోని ఒక అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తులోని ఫ్లాట్ లో సౌమిని, అభిల్ సహజీవనం చేస్తున్నారు.
అయితే... సౌమినికి అప్పటికే ఓ యువకుడితో పెళ్లి జరిగింది. తన భర్త పశ్చిమ బెంగాల్ లోనే ఉంటున్నాడు. ఈ మధ్యే సౌమిని తన సొంతూరుకు వెళ్లింది. తాను తన భర్తతో ఉండనని, మరో వ్యక్తితో ఉంటానని ఇంట్లో వాళ్లకు చెప్పింది. ఈ విషయం భర్తకు కూడా తెలియడంతో కుటుంబంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
పశ్చిమబెంగాల్ నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చింది సౌమిని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ... ఉన్నట్టుండి నవంబర్ 5వ తేదీ ఆదివారం ఒకే రూమ్ లో సౌమిని, అభిల్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని.. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వీరి కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకుంటూ ఫ్లాట్‌కు చేరుకున్నారు. లోపలి నుంచి అరుపులు వినపడడంతో బలవంతంగా లోపలికి వెళ్లారు. మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడ్డారు. కానీ.. ఫలితం లేకుండా పోయింది. సౌమిని అప్పటికే మంటల్లో కాలి.. విగతజీవిగా కనిపించింది. తీవ్ర గాయాలపాలైన అభిల్‌ను పోలీసుల సహయంతో స్థానికంగా ఉన్న విక్టోరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిల్.. అప్పటికే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు.
ఈ ఘటనను అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్న కొత్తనూరు పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. ఇంట్లో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. వీరి ఆత్మహత్యలకు అసలు కారణాలు ఏంటి...? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సౌమిని, అభిల్ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును మరింత స్పీడప్ చేశారు.