కేఎంసీ మెడికో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా?

  • ఆమె రక్తంలో విషపదార్థాలు లేవని తేల్చిన టాక్సికాలజీ రిపోర్ట్​
  • పోలీసులకు దొరికిన ‘సక్సీనైల్​ కోలిన్‍’ ఇంజక్షన్​ కథేంటి? 
  • మర్డర్‍ చేశారంటున్న ప్రీతి ఫ్యామిలీ, అపొజిషన్‍ లీడర్లు
  • వరంగల్‍ పోలీసులకు పెద్ద సవాల్​గా మారిన కేసు
  • అనుమానాస్పద మృతి కేసుగా మార్చే అవకాశం?


వరంగల్‍,  వెలుగు:మెడికో ధరావత్​ ప్రీతి కేసు మిస్టరీగా మారింది.  తాజాగా విడుదలైన టాక్సికాలజీ రిపోర్ట్ తో ఆమె మృతిపై మరిన్ని అనుమానాలు  అలుముకున్నాయి.  ఆమె  గుండె, కాలేయం, రక్తం, ఇతర అవయవాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని  టాక్సికాలజీ రిపోర్ట్​ నిర్ధారించింది. దీంతో ఆమెది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై సస్పెన్స్​ నెలకొంది.  ప్రీతిది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతుండగా.. ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  నిమ్స్​ ఆస్పత్రిలో డయాలసిస్ పేరిట ప్రీతి కడుపును క్లీన్​ చేయడంవల్ల  ఆధారాలు లేకుండా చేశారని ప్రీతి పేరెంట్స్ ​మొదటి నుంచీ అంటున్నారు. అయినా ఇప్పటివరకు ఆత్మహత్య కోణంలోనే పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్​ఎన్నో కొత్త ప్రశ్నలను వరంగల్​ పోలీసుల ఎదుట నిలిపింది. ప్రీతి కుటుంబ సభ్యులు, అపొజిషన్​ లీడర్లు లేవనెత్తుతున్న అనుమానాలకు ఈ రిపోర్ట్​బలం చేకూరుస్తున్నది. దీంతో ఇకపై విచారణను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నది పోలీసులకు అంతుచిక్కడం లేదు. కేసును అనుమానాస్పద మృతిగా మారుస్తారా? అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.  టాక్సికాలజీ రిపోర్ట్​ మాత్రమే ఫైనల్ కాదని, కొన్నిసార్లు అవయవాల్లోని  మత్తు పదార్థాల ఆనవాళ్లను గుర్తించడం కష్టమవుతుందని పలువురు పోలీసు అధికారులు చెబుతున్నారు.  ఇంకా రావాల్సి ఉన్న ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​ (ఎఫ్​ఎస్​ఎల్​) రిపోర్టులపైనా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

నేర విచారణ విభాగంలో ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలైనా   ప్రీతి మరణానికి   కారణమేంటో తేల్చలేకపోయింది.ఫిబ్రవరి 22న సూసైడ్ అటెంప్ట్​ చేసుకున్న ప్రీతి  హైదరాబాద్‍ నిమ్స్​లో ట్రీట్‍మెంట్​ పొందుతూ ఫిబ్రవరి 26న చనిపోయింది. ఘటన జరిగిన రోజే ఎంజీఎంలో ఆమె రక్త నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. వరంగల్‍ పోలీస్​ కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే విషయాన్ని ఫిబ్రవరి 24న మీడియాతో చెప్పారు. గదిలో ప్రీతి  పడిపోయినచోట 'సక్సీనైల్‍ కోలిన్‍' ఇంజక్షన్​ దొరికిందని.. అంతకుముందు దాని గురించి ప్రీతి  గూగుల్‍లో సెర్చ్​చేసినట్లు పేర్కొన్నారు. టాక్సికాలజీ రిపోర్ట్​కోసం బ్లడ్​ శాంపిల్స్​​ తీశామని, రిపోర్ట్​​వచ్చాక పూర్తి వివరాలు ఇస్తామన్నారు. దాదాపు 10 రోజుల తర్వాత వచ్చిన రిపోర్టులో ఆమె శరీరంలో  విష పదార్థాలు లేవని తేలడంతో.. ఆ ఇంజక్షన్​ ఏమైందన్న సందేహాలు కలుగుతున్నాయి.  తన కూతురు ప్రీతిని  సీనియర్​ స్టూడెంట్​సైఫ్‍ మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశాడని ప్రీతి తండ్రి నరేందర్​ ఫిబ్రవరి 22న వరంగల్‍ మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో సైఫ్​పై   ర్యాగింగ్‍, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేశారు. 24న పోలీసులు సైఫ్ ను అరెస్ట్​ చేశారు.  అతన్ని  మొదట పరకాల సబ్​ జైలుకు.. ఆపై ఖమ్మం జైలుకు తరలించారు. కేఎంసీ, ఎంజీఎంలో పోలీసులు టెక్నికల్​ టీంతో కలిసి విచారణ కొనసాగించారు. ఈక్రమంలో కాలేజీ అధికారులు, డ్యూటీ డాక్టర్లు, ప్రీతి ఫ్రెండ్స్,  సీనియర్లు, క్లాస్‍మేట్లు, ఎంజీఎం సిబ్బందితో మాట్లాడి వివరాలు రాబట్టారు. వాట్సాప్‍ చాటింగ్​లు, ఫోన్‍కాల్​ డేటాను సేకరించారు. 

సైఫ్‍.. మళ్లీ ఖమ్మం జైలుకు

మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన కేఎంసీ పీజీ ​స్టూడెంట్ సైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​ నాలుగురోజుల కస్టడీ గడువు  సోమవారంతో ముగిసింది. టాక్సికాలజీ  రిపోర్టు నేపథ్యంలో  మరో నాలుగు రోజుల పాటు సైఫ్​ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు సోమవారం  కోర్టును కోరినా.. దాన్ని జడ్జి  పెండింగ్​లో పెట్టారు. దీంతో వరంగల్​ పోలీసులు అతన్ని  ఖమ్మం  జైలుకు తరలించారు.  కస్టడీలో ఉండగా సైఫ్​ను పోలీసులు వివిధ కోణాల్లో ఎంక్వైరీ చేసినట్లు తెలుస్తోంది.