జగిత్యాల, వెలుగు: సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల సెగ జగిత్యాల జిల్లాకు తాకింది. ఈ లీకుల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డిది మల్యాల మండలం తాటిపెల్లి గ్రామం కావడం, ఈయనకు తిరుపతి స్నేహితుడు కావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే రెండురోజులుగా ఆయా గ్రామాల్లో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేస్తుండగా పలు ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. మల్యాల మండలంలో పది మందికి గ్రూప్1 ప్రిలిమ్స్‌లో 75- నుంచి 100 మార్కులు రాగా, వీరిలో ఏడుగురు బీఆర్ఎస్ లీడర్లు, వారి సంబంధీకులే ఉన్నట్లు తెలుస్తున్నది.
అభ్యర్థుల్లో కొండగట్టు డైరెక్టర్, ఎంపీటీసీ
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీల కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి స్వగ్రామం మల్యాల మండలం తాటిపెల్లి. అదే మండలంలోని పోతారం.. కేటీఆర్ పీఏ తిరుపతి స్వగ్రామం. దీంతో రెండు రోజులుగా విజిలెన్స్ ఆఫీసర్లు అక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. తిరుపతికి సన్నిహితంగా ఉండే కొండగట్టు దేవస్థానం డైరెక్టర్, తిరుపతి సామాజిక వర్గానికి చెందిన ఓ ఎంపీటీసీ.. గ్రూప్1 ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు సాధించినట్లు తెలుస్తున్నది. వయసు పైబడినా వీరిద్దరు గ్రూప్వన్రాయడం, అందులో 100 మార్కుల దాకా రావడం, తిరుపతికి సన్నిహితులు కావడంతో ఆఫీసర్లు వీళ్లిద్దరినీ ప్రశ్నించారు. గతంలో ఏమీ లేని వీరిద్దరిలో ఒకరు ఇటీవలే రూ. 60 లక్షల విలువైన ఇల్లు కొనుగోలు చేయగా, మరొకరు రూ.20 లక్షలతో కారు కొనడం గమనార్హం. వీటికి డబ్బులు ఎలా వచ్చాయి? అనే విషయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏ2 గా ఉన్న రాజశేఖర్ తన స్వగ్రామం తాటిపెల్లిలో తన స్నేహితుడి ద్వారా లావాదేవీలు జరిపాడని, చుట్టు ప్రక్కల గ్రామాల్లో అభ్యర్థులు, యువకుల వద్ద రూ.2-3 లక్షల వరకు వసూలు చేశాడని ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. పోతారానికి చెందిన ఓ బీఆర్ఎస్ నేత కొడుకు, మల్యాలలోని ఓ గ్రామ సర్పంచ్, బీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యులు, పోతారం గ్రామానికి చెందిన ఓ జడ్పీటీసీ అనుచరుడుగా పేరున్న బీఆర్ఎస్ లీడర్, అతని బంధువు క్వాలిఫై అయినట్లు తెలుస్తున్నది.