చీకోటి ప్రవీణ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​​లో పాల్గొన్న మంత్రి

చీకోటి ప్రవీణ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​​లో పాల్గొన్న మంత్రి
  • ప్రవీణ్​ బర్త్​డే సెలబ్రేషన్స్​​లో పాల్గొన్న మంత్రి
  • సోమవారం విచారణతో ఎవరికి నోటీసులో!
  • ​ఫాంహౌస్​పై ఆఫీసర్ల దాడులు
  • ఫామ్‌‌హౌస్​లో ఆఫ్రికన్ దేశాల ప్రమాదకర జంతువులు
  • నాన్‌‌ బెయిలబుల్‌‌ కేసులు పెట్టే యోచనలో ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు

హైదరాబాద్‌‌, వెలుగు : క్యాసినో దందా రాష్ట్ర లీడర్లలో గుబులు పుట్టిస్తున్నది. ఎప్పుడు ఎవరి పేర్లు బయటపడతాయోనని నాయకులు భయపడుతున్నారు. క్యాసినో నిర్వాహకుడు ప్రవీణ్‌‌ కుమార్, అతని ఏజెంట్​మాధవరెడ్డి ఈడీ విచారణలో ఎవరి పేర్లు బయటపెడతారోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్  హైదరాబాద్‌‌కు చెందిన ఇద్దరు మంత్రులు, ఓ మాజీ మంత్రిని ఈడీ నోటీసుల భయం వెంటాడుతోంది. ప్రవీణ్ బర్త్‌‌ డే సెలబ్రేషన్స్‌‌లో ఓ మంత్రి పాల్గొనడం, క్యాసినో ఏజెంట్‌‌ మాధవరెడ్డి కారుకు అంటించిన ఎమ్మెల్యే స్టిక్కర్‌‌ అధికార పార్టీ నేతలది కావడమే ఇందుకు కారణం. వారితో పాటు రంగారెడ్డి, నిజామాబాద్‌‌, వరంగల్‌‌ జిల్లాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఏపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు చీకోటి క్యాసినో గేమ్‌‌లో రెగ్యులర్ కస్టమర్స్​గా ఉన్నట్లు తెలిసింది. ప్రవీణ్‌‌, మాధవరెడ్డి సోమవారం ఈడీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో నేతలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. 

హవాలా బ్రోకర్స్‌‌ ఇండ్లలో సోదాలు 

హవాలా ఏజెంట్లపై ఈడీ ఫోకస్‌‌పెట్టింది. ప్రవీణ్‌‌, మాధవరెడ్డి నెట్‌‌వర్క్‌‌లోని నలుగురు ఏజెంట్లు కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. హవాలా ఏజెంట్లు సంపత్‌‌, రాజేశ్, వెంకటేశ్, బబ్లూ ఇండ్లలో శుక్రవారం సోదాలు జరిపింది. ప్రవీణ్‌‌ ప్రధాన ఏజెంట్‌‌గా పనిచేస్తున్న సంపత్‌‌ను సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. క్యాసినో ట్రిప్‌‌లో ఫ్లైట్‌‌టికెట్స్, సెలెబ్రిటీలకు సంబంధించిన కాంటాక్ట్స్‌‌, పేమెంట్స్‌‌లో సంపత్‌‌ కీలక వ్యక్తిగా గుర్తించింది. చీకోటి ద్వారా క్యాసినోకు మళ్లించిన డబ్బు, వాటికి సంబంధించి వివరాలను రాబట్టినట్లు తెలిసింది. 

మే నుంచి జూన్‌‌ 20 వరకు కీ ట్రాన్సాక్షన్స్ 

నాలుగు బ్యాంక్ అకౌంట్స్‌‌లోని ట్రాన్సాక్షన్స్‌‌ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మే నుంచి జూన్‌‌20 వరకు జరిగిన ట్రాన్సాక్షన్లను పరిశీలిస్తున్నారు. గోవా, థాయ్‌‌లాండ్‌‌, నేపాల్‌‌లో  క్యాసినో నిర్వహించిన సమయంలో సెలెబ్రిటీలతో ప్రమోషన్​ చేయించినట్లు ఆధారాలు సేకరించారు. ప్రమోషన్స్‌‌కు సంబంధించిన  రెమ్యూనరేషన్‌‌ క్యాష్‌‌ను ఆన్‌‌లైన్‌‌లోనే చెల్లించినట్లు గుర్తించారు.ఈ క్రమంలోనే సంబంధిత సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నట్లు సమాచారం. 

‘వెగాస్ బై బిగ్‌‌డాడీ’ కలెక్షన్స్,పేమెంట్స్‌‌పై ఫోకస్

జూన్‌‌లో గోవా, నేపాల్‌‌లోని మోచీ క్రౌన్‌‌ హోటల్‌‌లో నిర్వహించిన ‘వెగాస్ బై బిగ్‌‌డాడీ’ క్యాసినోపై అధికారులు ఫోకస్‌‌ పెట్టారు. గత నెల 10 నుంచి 13 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. క్యాసినో ట్రాన్సాక్షన్స్‌‌ కోసం ఐదు అకౌంట్లను వినియోగించినట్లు గుర్తించారు. గత నెలలోనే హవాలా మార్గంలో డబ్బులు మారినట్లు గుర్తించారు.  

ఫామ్​ హౌస్​లో అరుదైన జంతువులు

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని సాయిరెడ్డిగూడెంలో చీకోటి ప్రవీణ్‌‌కు 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్‌‌హౌస్ ఉంది. అక్కడే వీకెండ్ పార్టీలు జరుగుతుంటాయి. వీఐపీలతో మీటింగ్స్ కూడా జరుతున్నట్లు సమాచారం. ఈడీ రెయిడ్ల అనంతరం ఫారెస్ట్‌‌ అధికారులు ఫామ్‌‌హౌస్‌‌పై ఫోకస్ పెట్టారు. రేంజ్‌‌ ఆఫీసర్ రమేశ్​కుమార్‌‌, డిప్యూటీ  రేంజ్ ఆఫీసర్  హేమ ఆధ్వర్యంలో శుక్రవారం ఫామ్‌‌హౌస్‌‌ను చెక్‌‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాములు, ఇతర జంతువులు పెంచుకుంటున్నట్లు గుర్తించారు.  ఫామ్ హౌస్ లో ప్రమాదకర జంతువులు కూడా ఉన్నాయని, వాటిని జూకి తరలిస్తామని హేమ చెప్పారు. అయితే  అనుమతులు ఉన్నవాటిని ఫామ్‌‌హౌస్‌‌లోనే వదిలేస్తామని వెల్లడించారు. యానిమల్‌‌ ప్రొటెక్షన్‌‌కి సంబంధించి ఎలాంటి రూల్స్ బ్రేక్ చేసినా నిర్వాహకులపై నాన్ బెయిలబుల్  కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

క్యాసినో వెనుక మంత్రులు, రాజకీయ ప్రముఖులు - పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌ మహేశ్​ కుమార్ 

 క్యాసినో దందా తెర వెనుక మంత్రులు, రాజకీయ ప్రముఖులు ఉన్నారనీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​మహేశ్​ కుమార్ గౌడ్  ఆరోపించారు.  శుక్రవారం గాంధీభవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రుల అండతోనే క్యాసినో నిర్వాహకులు ప్రవీణ్‌‌,  మాధవరెడ్డి ఈ దందా నడుపుతున్నారని ఆయన అన్నారు. వారి కాల్‌‌డేటా పరిశీలిస్తే చాలా మంది ప్రముఖుల బాగోతం బయట పడుతుందన్నారు. రాష్ట్రంలో ఐదారుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు పేకాట ఆడుతారని ఆయన చెప్పారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేలు  గోవా, శ్రీలంకకు వెళ్లి లక్షల్లో సిండికేట్‌‌ ఆడిన సందర్భాలు ఉన్నాయి.

చీకోటి ప్రవీణ్ వెనక రాజకీయ నాయకులు ఎవరున్నారో బయటపెట్టాలి. మంత్రుల అండతో ప్రవీణ్ ఇంత విచ్చలవిడిగా వ్యవహరించాడు. ఎమ్మెల్యే స్టిక్కర్ పై మంత్రి మల్లారెడ్డి చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నాడు. మల్లారెడ్డికి, ప్రవీణ్ కు సంబంధం ఎప్పటి నుంచి ఉందో బయటపెట్టాలి. మంత్రిని బర్తరఫ్ చేయాలి. బార్లు, పబ్బులకు కేసీఆర్​ప్రభుత్వం అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నది” అని మహేశ్​వ్యాఖ్యానించారు. బంగారు తెలంగాణ కేసీఆర్ వల్ల మద్యం తెలంగాణగా మారిందన్నారు.