అది మధ్యప్రదేశ్‌లో దట్టమైన అడవుల మధ్య ఉన్న చంబల్ లోయ. ఓ చోట చుట్టూ కొండల మధ్య విశాలమైన ప్రాంతం.. వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఎన్నో అద్భుత నిర్మాణాలు.. కొన్ని ఠీవిగా నిలబడి అబ్బురపరుస్తుంటే.. మరికొన్ని కూలిపోయి, శిథిలమై దీనంగా చూస్తుంటాయి. అవన్నీ వందల ఏళ్ల కింద నిర్మించిన శివాలయాలు. బటేశ్వర్ గా పిలిచే ఈ చోటుకు వెళ్లాలంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆ ప్రాంతమంతా బందిపోట్ల అడ్డా. ఈ గుడుల్లో చాలా వరకు ఆ బందిపోట్లు ఉండేందుకు, దోచుకొచ్చిన సొమ్ము దాచుకునేందుకు వాడుకున్నారు. ఇదంతా ఎప్పటి మాటో కాదు.. 2005 సంవత్సరం వరకు కూడా అదే పరిస్థితి. ఎంతో అద్భుతమైన ఆ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ప్రభుత్వం కూడా సాహసం చేయాల్సి రావడం విశేషం.
1200 ఏళ్ల కిందటి ఘనత
మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో గ్వాలియర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో బటేశ్వర్ ప్రాంతం ఉంది. ఇక్కడ 200కు పైగా ఆలయాలుంటే సగం వరకు కూలిపోయాయి. కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. క్రీస్తుశకం 8, 10 శతాబ్దాల మధ్య గుర్జారులు, ప్రతిహారులు ఈ ఆలయాలను నిర్మించినట్టు ఆర్కియాలజీ నిపుణులు గుర్తించారు. ఇసుక రాయితో కట్టిన ఈ గుడుల్లో చాలా వరకు శివాలయాలే. కొన్ని మాత్రం విష్ణుమూర్తి ఆలయాలు. ప్రధాన ఆలయాన్ని భూతనాథ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం లోపలా, బయటా ఖజురహో తరహాలో శృంగార శిల్పాలు ఉండటం గమనార్హం.
అన్నేళ్లు కాపాడింది బందిపోట్లే..
చారిత్రక సంపద సురక్షితంగా ఉండేందుకు బందిపోట్లే కారణమని.. వారే అక్కడ లేకుంటే స్మగ్లర్లు గుళ్లను ధ్వంసం చేసి శిల్పాలను ఎత్తుకెళ్లేవారని ఆర్కియాలజీ అధికారులు అంటుంటారు. బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇన్నేళ్లు బాగున్న గుడులకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది. బటేశ్వర్‌లో మైనింగ్ మాఫియా కాలుమోపిందని, వారు జరుపుతున్న పేలుళ్లతో అద్భుతమైన కట్టడాలు దెబ్బతింటున్నాయని అధికారులు చెప్తున్నారు.