న్యూఢిల్లీ: దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోందని, రోజురోజుకూ పరిస్థితి తీవ్రమవుతోందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ మంగళవారం హెచ్చరించింది. ఇది ఆందోళన కలిగించే విషయమని చెప్పింది. దేశంలోని కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 10 జిల్లాల పేర్లను ప్రకటించింది. పుణె, ముంబై, నాగ్ పూర్, థానే, నాసిక్ తదితర జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్టు పేర్కొంది. ఈ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు టెస్టుల సంఖ్య పెంచాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 'ఈ రాష్ట్రాల ప్రతినిధులతో మాట్లాడాం. కేసులు పెరుగుతున్నప్పుడు, టెస్టులు పెంచడం లేదు. టెస్టుల సంఖ్యను పెంచాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో స్క్రీనింగ్ టెస్టుల కోసం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయాలి' అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. దేశంలో యూకే వేరియంట్ కేసులు 807, సౌత్ ఆఫ్రికా వేరియంట్స్ 47, బ్రెజిల్ వేరియంట్ ఒక కేసు ఉన్నట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో హోం ఐసోలేషన్ ను మానిటర్ చేయడం లేదన్నారు. హోం ఐసోలేషన్ పాటించనివారికి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పని సరి చేయాలని సూచించారు. ప్రజలందరూ మాస్కులు పెట్టుకోవాలని, కరోనాపై పోరాటంలో ఇది 70 శాతం ఎఫెక్టివ్ గా ఉంటుందని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ చెప్పారు.
కేసులు కొంచెం తగ్గినయ్
దేశంలో ఐదు రోజుల తర్వాత కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 7,85,864 శాంపిల్స్ టెస్టు చేయగా 56,211 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,95,855కు చేరింది. మహారాష్ట్రలో 31,643, పంజాబ్‌లో 2,868, కర్నాటకలో 2,792 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వరకు 1,13,93, 201 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మంగళవారం 271 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 1,62, 114కు పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 24 ,26, 50,025 శాంపిల్స్ టెస్టు చేసినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఒక్క మహారాష్ట్రలోనే 63 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్టు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, చత్తీస్ గఢ్ లో రోజూ కొత్త కేసులు పెరుగుతున్నాయంది. ఈ 8 రాష్ట్రాల్లోనే 86 శాతం కేసులు నమోదవుతున్నట్టు తెలిపింది.
మాస్కు సరిగ్గా పెట్టుకోకున్నా ఫైనే..
ఎయిర్ పోర్టుల్లో మాస్కు సరిగ్గా పెట్టుకోనివారికి, ఫిజికల్ డిస్టెన్స్ పాటించనివారికి ఫైన్ విధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. కొన్ని ఎయిర్ పోర్టుల్లో కరోనా ప్రోటోకాల్స్ సరిగ్గా పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. మాస్కు పెట్టుకోకుంటే ప్యాసింజర్లను విమానం నుంచి దింపేయాలని ఈ నెల 13న డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. హోలీ పండుగ రోజున ఢిల్లీలో మాస్క్ పెట్టుకోని 730 మందికి పోలీసులు ఫైన్ వేశారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించనందు కు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేసినవారికి కూడా జరిమానా విధించారు.