అర్బన్ ఫ్లడ్ కింద కేంద్రం నుండి తేవాలి
జిల్లా నుంచి మేం సీఎం దగ్గర ఫండ్స్ పట్టుకొస్తాం
సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడాలే
చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే లు ధర్మారెడ్డి, రమేశ్
వరంగల్ రూరల్, వెలుగు: అకాల వర్షాలకు వరంగల్ సిటీ నీటమునిగిన నేపథ్యంలో అర్బన్ ఫ్లడ్ కింద కేంద్ర ప్రభుత్వం నగరానికి రూ.500 కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. ఇదే అంశాన్ని గ్రేటర్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు . శనివారం హన్మకొండ సర్య్కూట్ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, మేయర్ గుండా ప్రకాశ్‍తో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా సిటీలో 212 మి.మీ. వర్షపాతం నమోదు కావడంతో 1200 కుటుంబాలు ఇబ్బందులు పడ్డా యన్నారు. సీఎం ఆదేశానుసారం మున్సిపల్ మంత్రి కేటీఆర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి జనాలకు ధైర్యం చెప్పారన్నారు. అప్పటి కప్పుడు రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు విషయంలో టాస్క్ ఫోర్స్ టీంపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని చెప్పారు. ఇక్కడి బీజేపీ లీడర్లు గల్లీల్లో విహారయాత్ర మాదిరి సిటీలో తిరిగితే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తుఫాన్ పర్యటనకు వచ్చాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్, అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గల్లీలో కాకుండా ఢిల్లీలో తమ పలుకుబడి ఉపయోగించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యే లంతా సీఎం కేసీఆర్ ను కలవడం ద్వారా జిల్లాకు తాము నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
జంగాకు ఎంక్వైరీ భయమెందుకు?
డీసీసీ బ్యాంకులో జంగా రాఘవరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడనప్పుడు సీబీసీఐడీ విచారణకు ఎందుకు భయపడుతున్నాడని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ ప్రశ్నించారు. బ్యాంకులో జంగాపై దాదాపు రూ.7 కోట్ల అవకతవకల ఆరోపణలున్నాయి కాబట్టే విచారణ అనగానే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. జంగా రాఘవరెడ్డి ఎర్రబెల్లిపై ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.