నీటి కేటాయింపుల్లేని ప్రాజెక్టులన్నీ కొత్త ప్రాజెక్టులే

  • డీపీఆర్​లు ఇచ్చేందుకు అంగీకరించిన సీఎంలు
  • కృష్ణా, గోదావరి కొత్త ట్రిబ్యునళ్లకు గ్రీన్​ సిగ్నల్​
  • సుప్రీంకోర్టులో కృష్ణా ట్రిబ్యునల్​పై కేసు విత్​ డ్రా చేసుకుంటామన్న కేసీఆర్
  • కృష్ణా బోర్డు హెడ్​క్వార్టర్​ విజయవాడకు తరలింపు

హైదరాబాద్‌, వెలుగుకృష్ణా గోదావరి జలాలపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు మరో మలుపు తిరిగాయి. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం నిర్వహించిన అపెక్స్​ భేటీలో పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులన్నీ కొత్తవేనని కేంద్రం స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్డిక్షన్‌ ను నోటిఫై చేసే అధికారం తమకే ఉందని తేల్చింది. గోదావరి, కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్​ ఏర్పాటుకు లైన్​ క్లియర్​ చేసింది. ఇంతకాలం ప్రాజెక్టుల డీపీఆర్​లను సమర్పించకుండా పెండింగ్​లో పెట్టిన ఇరు రాష్ట్రాల సీఎంలు.. ఈ భేటీలో కేంద్రానికి డీపీఆర్​లను ఇచ్చేందుకు అంగీకరించారు. సుప్రీంకోర్టులో కేసును తెలంగాణ విత్‌డ్రా చేసుకుంటేనే.. కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ వేయడం సాధ్యమవుతుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​షెకావత్​ స్పష్టం చేశారు. న్యాయ​సలహా మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో వెంటనే బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ అవార్డుపై సుప్రీంకోర్టులో వేసిన కేసును విత్‌డ్రా చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌ అంగీకరించారు. గోదావరి జలాలపై కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు కోసం వెంటనే రిక్వెస్టును పంపిస్తామని తెలిపారు.

కాళేశ్వరం, పాలమూరు, పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం కొత్త ప్రాజెక్టులే!

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్​ జరిగింది. ప్రగతిభవన్​ నుంచి కేసీఆర్‌, ఢిల్లీలోని ఏపీ భవన్​ నుంచి జగన్, హైదరాబాద్​లోని జలసౌధ నుంచి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు పరమేశం, చంద్రశేఖర్‌ అయ్యర్‌ లు ఈ భేటీలో పాల్గొన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్డిక్షన్‌, కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి పంపకాలు, వినియోగంపై మెకానిజం ఏర్పాటు, కృష్ణా బోర్డు హెడ్‌ క్వార్టర్​ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించడంపై చర్చించారు.ఈ సందర్భంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, కంతనపల్లి ప్రాజెక్టులు.. ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం కొత్త ప్రాజెక్టులేనని అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌ తేల్చింది. వాస్తవానికి ఏపీ పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీంలు మొదలుపెట్టడంతోనే జల వివాదాల అంశం మళ్లీ తెరమీదికి వచ్చింది.

స్కోప్‌‌ మార్చినవన్నీ కొత్త ప్రాజెక్టులే

2014 జూన్‌‌ 2 తర్వాత స్కోప్‌‌ మార్చి చేపట్టినవన్నీ కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని తేల్చిచెప్పారు. బచావత్‌‌ అవార్డులోని ప్రాజెక్టులన్నీ పాతవిగానే పరిగణిస్తామని.. ఏపీ రీఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌లోని 11వ షెడ్యూల్‌‌లో పేర్కొన్న ఏపీలోని తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ.. తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడులను పాతవిగానే చూస్తామని తెలిపారు. అవికాక మిగతావన్నీ కొత్త ప్రాజెక్టులేనన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర అవసరాల కోసం పలు ప్రాజెక్టుల స్వరూపాన్ని మార్చుకున్నామని.. గోదావరిపై కాళేశ్వరం, సీతారామ, కంతనపల్లి, కృష్ణాపై పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర ప్రాజెక్టులు పాతవేనని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన షెకావత్‌‌.. నీళ్ల అలోకేషన్‌‌ లేనివి, ప్రాజెక్టు వాటర్‌‌ సోర్స్‌‌ సహా, స్కోప్‌‌ మార్చినవన్నీ కొత్తవేనని చెప్పారు. వాటికి అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి, సీడబ్ల్యూసీ, సంబంధిత రివర్‌‌ బోర్డు టెక్నికల్‌‌ అప్రైజల్‌‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. స్పందించిన కేసీఆర్.. ఏపీ చేపడ్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇస్తామంటే తాము ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. దీంతో తాము కడుతున్న అన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు రివర్‌‌ బోర్డులకు అందజేస్తామని జగన్​ అన్నారు. డీపీఆర్‌‌లను పరిశీలించి ఎన్ని నీళ్లు అవసరం, ఎన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని షెకావత్ చెప్పారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండగా ప్రాజెక్టులు ఎక్కువగా కడుతున్నారన్నారు. డీపీఆర్‌‌లు ఇస్తే టైం నిర్దేశించి, నిర్ణీత వ్యవధిలోనే టెక్నికల్‌‌ క్లియరెన్సులు ఇస్తామని హామీ ఇచ్చారు.

‘గోదావరి’ ట్రిబ్యునల్‌‌ కోసం కేసీఆర్‌‌ పట్టు

గోదావరి నీళ్లను ప్రాజెక్టుల వారీగా పంచాలని కేసీఆర్‌‌ పట్టుబట్టారు. బచావత్‌‌ అవార్డులో సబ్‌‌ బేసిన్ల వారీగా కేటాయింపులు చేశారని.. ప్రాజెక్టుల వారీగా ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ.. రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో గోదావరి నీటి పంపకాలపై అగ్రిమెంట్‌‌ చేసుకోవచ్చని సూచించారు. అన్నింటికీ ట్రిబ్యునళ్లతోనే పరిష్కారం దొరకదని, చర్చల ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. అలా కాదంటే.. కేంద్రమే కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటుచేసి పంపకాలను తేల్చుతుందన్నారు. కొత్త ట్రిబ్యునల్​ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌‌  మళ్లీ కోరడంతో.. ఇరు రాష్ట్రాల నుంచి ప్రతిపాదన వస్తే ఏడాదిలోగా ఏర్పాటు చేస్తామని షెకావత్‌‌ ప్రకటించారు. పోలవరం నుంచి కృష్ణాడెల్టాకు మళ్లించే 45 టీఎంసీల గోదావరి నీళ్లకు బదులుగా.. నాగార్జునసాగర్‌‌కు ఎగువన కృష్ణాలో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించడంపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసి పరిశీలిస్తామన్నారు.

కేసు విత్‌‌డ్రా చేసుకుంటాం

ఐఎస్‌‌ఆర్‌‌డబ్ల్యూడీ యాక్ట్‌‌ 1956లోని సెక్షన్‌‌ -3 ప్రకారం కృష్ణా నికర జలాలను పునః పంపిణీ చేయాలని కేసీఆర్ డిమాండ్​ చేశారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ.. ఈ అంశంలో తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌‌ సుప్రీంలో పెండింగ్‌‌లో ఉంది కాబట్టి, దీనిపై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. తెలంగాణ కేసు వాపస్‌‌ తీసుకుంటే కొత్త ట్రిబ్యునల్‌‌ ఏర్పాటుపై న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు.దీంతో బ్రిజేశ్‌‌ ట్రిబ్యునల్‌‌ అవార్డుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేసిన కేసును విత్‌‌డ్రా చేసుకునేందుకు సీఎం కేసీఆర్‌‌ అంగీకరించారు.

గంటకుపైగా మాట్లాడిన కేసీఆర్‌‌

రెండు గంటలకుపైగా అపెక్స్​ మీటింగ్‌‌లో గంటకుపైగా కేసీఆరే మాట్లాడారు. కృష్ణా, గోదావరి బోర్డులకు జ్యూరిస్డిక్షన్‌‌ ఇవ్వాలన్న అంశాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిబ్యునల్‌‌ మాత్రమే బోర్డుల జ్యూరిస్డిక్షన్‌‌ తేల్చాలని డిమాండ్​ చేశారు. ఏపీ సీఎం జగన్‌‌ మాత్రం.. బోర్డులకు పరిధి, అధికారాలు ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి జోక్యం చేసుకుంటూ.. బోర్డులు ఏర్పాటై ఆరేండ్లు అయినా జ్యూరిస్డిక్షన్‌‌ ఇవ్వలేకపోయామని, రెండు రాష్ట్రాలు భిన్న వాదన చేస్తుండటంతో లేటవుతోందని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం కేంద్రానికి బోర్డుల పరిధి, అధికారాలు నిర్ణయించే పవర్​ ఉందని, రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా తామే నిర్ణయిస్తామని తేల్చి చెప్పారు. దీంతో బోర్డుల జ్యూరిస్డిక్షన్‌‌ నోటిఫై చేయడానికి కేసీఆర్‌‌ ఓకే చెప్పారు. అపెక్స్‌‌ ఎజెండాలో చేర్చిన అంశాలతోపాటు గోదావరి–కృష్ణా– కావేరి లింక్‌‌ ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించారు. ఏపీ, తెలంగాణ మధ్య నీళ్ల సమస్యను పరిష్కరించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదన్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కేంద్రం ఆ వివాదాలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఆ ప్రాజెక్టులన్నీ మా నాన్న మొదలుపెట్టినవే: జగన్‌‌

సీఎం కేసీఆర్‌‌ మాటిమాటికీ 60 ఏండ్ల గోస అంటున్నారని.. ఉమ్మడి ఏపీలో తన తండ్రి వైఎస్‌‌ రాజశేఖర్‌‌రెడ్డి మొదలుపెట్టిన ప్రాజెక్టులనే కేసీఆర్‌‌ ఇప్పుడు పూర్తి చేస్తున్నారని జగన్​ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా తన తండ్రే ప్రారంభించారన్నారు. ఇవి కాకుండా కేసీఆర్‌‌ ఏం చేశారని ప్రశ్నించారు. అయితే.. పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ అక్రమమని, దాని కెపాసిటీ పెంపుతోపాటు రాయలసీమ లిఫ్ట్‌‌ స్కీంను చేపట్టి బేసిన్‌‌ అవతలికి నీటిని తరలిస్తోందని కేసీఆర్‌‌ అభ్యంతరం తెలిపారు. జగన్‌‌ బదులిస్తూ.. గోదావరిపై తెలంగాణ ఇష్టమొచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతూ పోతే తాము చూస్తు ఊరుకోవాలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం మూడో టీఎంసీ, సీతారామ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు ఏం పర్మిషన్లు ఉన్నాయో చెప్పాలని నిలదీశారు. ఉమ్మడి ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల కిందనే తెలంగాణలో భూములకు నీళ్లు అందుతున్నాయని తేల్చిచెప్పారు. జగన్‌‌ నుంచి ఈ ఎదురుదాడిని ఊహించని కేసీఆర్‌‌… ఒకానొక దశలో చిన్నబుచ్చుకున్నట్టు తెలిసింది. కేసీఆర్‌‌ బదులివ్వబోతుండగా.. కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పినట్టు సమాచారం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణను తమకే అప్పగించాలని కేసీఆర్‌‌ కోరగా.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ రిజర్వాయర్ల నిర్వహణను బోర్డుల పరిధిలోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.