- సేఫ్టీ మెజర్స్ పాటించాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ: కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని కేంద్ర హెల్త్ మినిస్ట్రీ శనివారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. అన్ని రాష్ట్రాలు తగిన సేఫ్టీ మెజర్స్ పాటించాలని సూచించింది. మహారాష్ట్రలో ఇప్పటికీ దేశంలోనే అత్యధికంగా డైలీ కేసులు రికార్డ్ అవుతున్నాయని తెలిపింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 6,112 కేసు లు కన్ఫామ్ అయ్యాయని తెలిపింది. కేరళలో కూడా భారీగా డైలీ కేసులు వస్తున్నాయి. ఇక్కడ శుక్రవారం కొత్తగా 4 వేలకు పైగా డైలీ కేసులు వచ్చాయి. పంజాబ్‌లోనూ వారం రోజుల్లోనే కేసులు సడెన్ గా పెరిగాయి. శుక్రవారం 383 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 297 కొత్త కేసులు వచ్చాయి. చత్తీస్‌గఢ్‌లో 259 కొత్త కేసులు కన్ఫామ్ అయ్యాయి.
కరోనా రూల్స్ పాటించాలె
దేశంలోని మొత్తం యాక్టివ్ కేసుల్లో 75.87 కేసులు కేరళ, మహారాష్ట్రల్లోనే ఉన్నాయని కేంద్రం తెలిపింది. గడిచిన ఒక రోజు సమయంలో తెలంగాణతో సహా18 స్టేట్స్, యూటీల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలుగుతామని కేంద్రం సూచించింది.
1.07 కోట్ల మందికి టీకా
దేశవ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల వరకు అందిన డేటా ప్రకారం.. 1,07,15,204 డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయింది. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్లు ఈ నెల 13న స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ డోస్ కంప్లీట్ అయినవారికి 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేస్తున్నట్లు ఈ మేరకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.
దేశంలో ఏడున్నర వేల వేరియంట్లు: సీసీఎంబీ
హైదరాబాద్: దేశంలో 7,569కిపైగా కరోనా వేరియంట్లు ఉన్నట్టు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సైంటిస్టులు వెల్లడించారు. 5 వేలకుపైగా కరోనా వేరియంట్లను తాము గుర్తించామని, అవి ఎలా మార్పులు చెందాయో అనలైజ్ చేసినట్టు తెలిపారు. చైనాలోని వుహాన్ లో ఈ వైరస్ ను మొదటిసారి గుర్తించినప్పటి నుంచి ఈ వేరియంట్లను అనలైజ్ చేసినట్టు సీసీఎంబీ సైంటిస్టుల టీమ్ తమ రీసెర్చ్ లో పేర్కొంది. ‘ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వేరియంట్లను గుర్తించాం. వీటిలో వేగంగా వ్యాప్తి చెందే ఈ484కె, ఎన్501వై మ్యుటేషన్లు ఉన్నాయి. ఇండియాలో వీటి ప్రాబల్యం తక్కువగా ఉన్నందున అవసరమైన మేరకు సీక్వెన్సింగ్ చేయలేకపోయాం. మరిన్ని కరోనా వైరస్ జీనోమ్లను సీక్వెన్స్ చేసి కొత్త వేరియంట్లను ఐడెంటిఫై చేయాల్సి ఉంది’ అని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నాయని, దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్ 440కె కరోనా వేరియంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతోందని చెప్పారు. దీని ట్రాన్స్ మిషన్‌ను అర్థం చేసుకునేందుకు చాలా క్లోజ్‌గా సర్వైలన్స్ చేయాల్సి ఉందన్నారు. ఏడాది కిందట ఒక వేరియంట్‌తో మొదలైన కరోనా.. ఇప్పుడు అనేక వేరియంట్లుగా మార్పులు చెందిందన్నారు. ఏ3ఐ వేరియంట్ తక్కువగా స్ప్రెడ్ అవుతోందని, దీన్ని ఏ2ఏ వేరియంట్ ఓవర్ టేక్ చేసినట్టు తెలిపారు. కిందటేడాది ఎక్కువ కాలం ఈ వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తి చెందినట్టు వెల్లడించారు.