మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ 

  • మేడిగడ్డపై కేంద్రం డెడ్‌లైన్ 
  • రేపటిలోగా అడిగిన సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌లో 20వ పియర్‌ కుంగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో లేఖ రాసింది. ఘటనపై తాము కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని జాతీయ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ పేర్కొంది. రేపటిలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 23 నుంచి 26 వరకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది.

అయితే  కమిటీ తిరుగుపయనానికి ముందే.. వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాశారు. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కేంద్రం కోరింది. కాగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని అధికారులు తెలిపారు. రేపటిలోగా ఇవ్వకుంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు లేనట్టుగా భావిస్తామని, ఆ మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపింది.