పసుపు బోర్డుకు మించిన మేలు చేస్తున్నం

పసుపు బోర్డుకు మించిన మేలు చేస్తున్నం

కేంద్రం చేయాల్సినవన్నీ చేస్తోంది.. రాష్ట్రమే ఎలాంటి ప్రపోజల్స్​ పంపట్లే

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పైసెస్​​బోర్డు రీజనల్​ఆఫీస్​ను నిజామాబాద్​కు ఇచ్చింది. కొత్త వ్యవసాయ చట్టానికి అనుగుణంగానే బోర్డులో ఉన్న పవర్స్​తోపాటు టైస్(టీఐఈఎస్), క్లస్టర్​ స్కీమ్​లను కూడా ఇచ్చింది. విదేశాల నుంచి పసుపు దిగుమతిపై కూడా నిషేధం పెట్టింది. నిజామాబాద్​ నుంచి డైరెక్ట్​గా ఎగుమతి అయ్యేట్లు రైల్వే శాఖ ట్రైన్లు కూడా నడుపుతోంది. కేంద్రం బ్రహ్మాండమైన ఫ్రేం వర్క్​ఎస్టాబ్లిష్​ చేసి ఎక్స్​టెండ్​ కూడా చేసింది. ఇక ఇంప్లిమెంట్​ చేయాల్సిన బాధ్యత స్టేట్​సర్కార్​మీద ఉంది. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలి. ప్రైవేట్​రంగం ఇన్వాల్వ్​అయితే రైతులకు బై బ్యాక్​ అగ్రిమెంట్లు అవుతాయి. లోడింగ్, ఆన్​లోడింగ్​లు, మార్కెట్​ యార్డుల్లో వెయిటింగ్​లు, ఏజెంట్ల చేతుల్లో రైతులు మోసపోవడం వంటివి అరికట్టవచ్చు. ఇప్పటికే పెద్ద కంపెనీలు నిజామాబాద్​కు వచ్చి పసుపు విషయంలో ఎటువంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే దానిపై స్టడీ చేశాయి. ఇలాంటి ఇన్​ఫ్రాస్ర్టక్చర్​త్వరలోనే వస్తుందని నమ్మకం ఉంది. రెండు, మూడేండ్లు టైం పట్టినా ఆ లోపు రైతులకు అన్యాయం జరగకుండా క్వింటాకు రూ.9 వేల మద్దతు ధర వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్​ పంపివ్వాలి.

బోర్డులు పాత కాలం నాటి వ్యవస్థ

పసుపు యాభై స్పైస్​ల్లో ఒకటి. 1987లో కాంగ్రెస్​ ప్రభుత్వం స్పైసెస్​ బోర్డు ఏర్పాటు చేసి అందులో పసుపు పంటను పెట్టింది. హెడ్​ఆఫీస్​ను కేరళలోని కొచ్చిన్​లో ఏర్పాటు చేసింది. యాభై స్పైస్​ల ఉత్పత్తి, ఎగుమతుల్లో కేరళ వాటా ఒక్క శాతం కూడా ఉండదు. కాంగ్రెస్​ పార్టీలోని కేరళలాబీ బలంగా పనిచేసి బోర్డును అక్కడ పెట్టించుకున్నారు. అక్కడ బ్లాక్​పెప్పర్, ఇలాచి ఎక్కువ పండటంతో వాటిపైనే దృష్టి పెట్టారు. డబ్బులు కూడా ఎక్కువ వాటికే ఇచ్చారు. స్పైసెస్ బోర్డు కంటే ముందు రబ్బర్​బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలన్నీ పాత కాలం నాటివి. అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. పరిస్థితులు ఇప్పుడు మారాయి. ఇవాళ వంటలు, పూజల్లోనే కాదు.. అనేక రోగాలకు యాంటీ బయాటిక్ గా, ఇమ్యూనిటీ బూస్టర్​గా పసుపును వాడుతున్నారు. స్కిన్​కు మంచిదని కాస్మోటిక్స్​ల్లో ఎక్కువ వాడుతుండటంతో ఎగుమతులకు డిమాండ్​పెరిగింది. గత ఏడాదికీ ఇప్పటికీ దాదాపు 45 శాతం డిమాండ్​ పెరిగిందంటే ఏ మేరకు పసుపు ఎగుమతులు అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కరోనా వల్ల పసుపు వినియోగం ఇంకా పెరిగింది. ఇప్పుడు ఎగుమతులు చేయాలంటే దానికి తగినట్లు ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ ఉండాలి. వేర్​హౌస్​లు, కోల్డ్​స్టోరేజ్​లు, ప్రాసెసింగ్, ప్యాకింగ్, పౌడరింగ్​ప్లాంట్స్, ట్రాన్స్​పోర్ట్​కనెక్టివిటీ ఉండాలి. ఫుడ్​ ప్రాసెసింగ్, కామర్స్, హార్టికల్చర్, అగ్రికల్చర్​ మంత్రిత్వ శాఖలను కో–ఆర్డినేట్​ చేసుకునే వ్యవస్థ ఇప్పుడు బోర్డులకు లేదు. అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ తెలంగాణకు లెటర్​ రాస్తే సంవత్సరాల కొద్దీ రిప్లై ఇయ్యరు. ఇక్కడే ఇలా ఉంటే మళ్లీ ఫుడ్​ప్రాసెసింగ్, ప్యాకేజీ ఇండస్ర్టీస్, ట్రాన్స్​పోర్ట్  కు రైల్వేస్​ను కో–ఆర్డినేట్​ చేసే కెపాసిటీ లేదు. అందుకే టీ, కాఫీ, రబ్బర్​బోర్డులు అంతగా పనిచేయడం లేదు.

వ్యవసాయంలో మార్పులు రావాలె

నేను ఎంపీ అయ్యాక అబ్జర్వ్, స్టడీ చేసింది ఏంటంటే అగ్రికల్చర్​ అనేది మోస్ట్​ అనార్గనైజ్డ్​ సెక్టార్​గా మిగిలిపోయింది. దీనికి గత ప్రభుత్వాలే కారణం. ఇందులో మేజర్​ చేంజెస్​ రావాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేసినప్పుడు 2018లో పసుపు రైతులు పెద్ద ఉద్యమం చేపట్టారు. 178 మంది రైతులు ఎలక్షన్​లో నిలబడే వరకు అది పోయింది. దీంతో నేషనల్​ అటెన్షన్​వచ్చింది. 93 వేల ఓట్లు పొంది తమకు బలం ఉందని పసుపు రైతులు నిరూపించుకోవడం గొప్ప విషయం. ఎన్నికల్లో నేను గెలిచాను. అయితే ప్రచార సమయంలో ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న రాజ్​నాథ్​సింగ్, నేషనల్​ లీడర్​ రాంమాధవ్​ లాంటి వాళ్లు ప్రత్యేకంగా పసుపునకు ధర, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మార్కెట్​ ఇంటర్వెన్షన్​ ​స్కీమ్​కింద పసుపు రైతులను ఆదుకుంటామని రాంమాధవ్​అన్నారు. దీని ప్రకారం మార్కెట్​లో ధర తక్కువ ఉన్నప్పుడు క్వింటాకు రూ.9 వేలు రావాల్సిన సమయంలో రూ.7 వేలే వస్తే ఆ మధ్యలో వచ్చే లాస్​కు రూ.2 వేలు అందిస్తామని చెప్పారు.

రైతులకు సపోర్ట్​ అందుతది

అగ్రికల్చర్​లో మౌలిక సదుపాయాలు, ఎక్స్​పోర్ట్​ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ట్రేడింగ్​ ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ఎండ్​టూ ఎండ్​ ఏర్పాటు చేసుకుంటే రైతులకు మంచి ధర వస్తుంది. ఇప్పుడు జగిత్యాలలో పండిన పంట కోల్డ్​ స్టోరేజ్​లో పెట్టాలంటే కరీంనగర్​పోవాలి. ఇప్పుడిప్పుడే ఆర్మూర్​లో కోల్డ్​స్టోరేజ్​లు వస్తున్నాయి. ఇవన్నీ పెట్టుకోలేక రైతులు మార్కెట్​లో ఏ ధర ఉంటే ఆ ధరకు అమ్ముకుంటున్నారు. ఇలాంటి సౌకర్యాలు మండల, గ్రామ స్థాయిలో రావాలనేది మా ఆలోచన. రైతుకు పసుపు కేజీకి రూ.60 వస్తుంది. అదే అమెరికాలో కేజీకి రూ.వెయ్యి నుంచి రూ.1,800 వరకు అమ్ముతున్నారు. సేంద్రియ పసుపుకైతే రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు అమ్ముడుపోతుంది. ఆర్గానిక్​ పద్ధతిలో పండించాలంటే కొంత మొత్తమే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. రైతులు ఆర్గానిక్​పద్ధతిలో పసుపు పండిస్తే లాభం మంచిగా ఉంటుంది. ఎలాంటి గ్యాప్స్​ ఉండకుండా ఉండేందుకే పెద్ద ఎక్స్​పోర్టర్స్​ మన ప్రాంతానికి వచ్చి ఇండస్ర్టీలు పెట్టేలా కేంద్రం సహకరిస్తోంది. ప్రాసెసింగ్​ ప్లాంట్లు పెడుతరు. వాళ్లే పసుపు రైతు దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఉడకబెట్టి, పాలిష్​ చేసి, ప్రాసెస్​ చేసి పౌడర్​ను ఇంటర్నేషనల్​ స్టాండర్డ్​లో ప్యాకింగ్​ చేసి ఎక్స్​పోర్ట్​ చేస్తారు. దీనివల్ల దళారులు, ఏజెంట్ల బెడద పోతది. ఇటువంటి పెద్ద ఇండస్ర్టీలు వస్తే వేల ఎకరాల్లో టై ఆప్​ చేసుకుంటారు. రైతులకు బై బ్యాక్​ అగ్రిమెంట్​ చేసుకునే ఏర్పాటును నూతన వ్యవసాయ చట్టం కల్పిస్తోంది. రైతులు ఏ పసుపు వేయాలి. ఎంత వేయాలి? సేంద్రియ  పద్ధతిలో ఎట్లా పండించాలి? అనే విషయాలు వారే చెప్తారు. రెండు, మూడు సంవత్సరాల వరకు అడిషనల్​ సపోర్ట్​ చేస్తారు. సైంటిస్టులను పెట్టి రైతులకు అవగాహన కల్పించే కెపాసిటీ కూడా ఈ కంపెనీలు చేస్తాయి. 70 ఏండ్ల ప్రభుత్వాలు ఇవేమీ చేయలేదు. స్టేట్​ అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​కూడా పట్టించుకోలేదు. ఇన్​ఫ్రాస్ర్టక్చర్ అయిన​గోడౌన్​లు, కోల్డ్​ స్టోరేజ్​లు, మిగతా వాటికి సబ్సిడీలు ఇచ్చేందుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​తోమర్​ చెప్పారు. వీటిని టైస్(టీఐఈఎస్) స్కీమ్, క్లస్టర్​స్కీమ్ కింద కంపెనీలు పెట్టిన వారికి సబ్సిడీ ఇస్తరు. ఎంఎస్ఎంఈ కింద కూడా లోన్లు ఇస్తున్నరు. ఎఫ్ పీవో (ఫార్మర్ ​ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్స్)కు కూడా కేంద్రం రుణాలు ఇస్తుంది. మండలానికి ఒక ఎఫ్​పీవోను రైతులు ఏర్పాటు చేసుకుని నేరుగా ప్రైవేట్​ కంపెనీలతో టై అప్​ పెట్టుకోవచ్చు.

కొత్త చట్టాలతో ఎంతో ప్రయోజనం

ఇక బోర్డు విషయానికొస్తే పసుపు ఉద్యమంలో ముందున్న జగిత్యాల తిరుపతిరెడ్డితోపాటు మరో నలుగురు రైతులను ఢిల్లీకి తీసుకుపోయాం. సంజయ్​అగర్వాల్​డైరెక్ట్​గా మీటింగ్​లో తిరుపతిరెడ్డిని స్పష్టంగా అడిగారు. బోర్డు ఎందుకో తెలియజేయాలన్నారు. అయితే తిరుపతిరెడ్డి చెప్పిన జవాబులో స్పష్టత లేదు. ఆ మీటింగ్​ తర్వాత పసుపునకు సంబంధం ఉన్న అన్ని మంత్రిత్వ శాఖల మంత్రులను, ఉన్నతాధికారులను కలిసినం. కేంద్ర హోం మంత్రి అమిత్​షా కూడా ప్రత్యేక చొరవ చూపారు. ఇవన్నీ జరుగుతున్నపుడు ఒక విషయం అర్థమైంది. బోర్డులన్నీ చాలా పరిమితమైన పరిధిలో ఉన్నాయి. బడ్జెట్​ కూడా పెద్దగా లేదు. స్పైసెస్​బోర్డుకు వచ్చేది రూ.100 కోట్లు కూడా ఉండదు. యాభై స్పైస్​లకు అడ్మినిస్ర్టేషన్​ ఖర్చులు పోను ఒక్కోదానికి రూ. కోటి, రెండు కోట్లు వస్తయి. ఇందులో కొన్ని బ్రాయిలర్లు, టార్ఫాలిన్లు, డ్రైయింగ్​ ఫ్లాట్​ఫామ్స్​ మాత్రమే తెచ్చుకోగలం. విత్తనాలు నాటిన నుంచి పసుపు సూపర్​మార్కెట్​లో అమ్మే వరకు ఎండ్​ టు ఎండ్ కనెక్టివిటీ అవసరం. వ్యవసాయంలో ఎటువంటి విధానాలు పాటించాలి. ఎంత పసుపు పండించాలి. క్వాలిటీ, క్వాంటిటీ వంటివి చాలా ముఖ్యం. సేంద్రియ పసుపు ధర అమెరికాలో సాధారణ పసుపు కంటే ఆరింతలు ఎక్కువ. హార్వెస్టింగ్​లోనూ మనం పాత పద్ధతులనే పాటిస్తున్నాం. ఇప్పటికీ చిన్న, చిన్న యంత్రాలే నడుస్తున్నాయి. ఎంతో కష్టపడి రైతులు మార్కెట్​కు వెళితే అక్కడి దళారులు, ఏజెంట్లు నిలువునా దోచుకుంటున్నారు. వాళ్లు క్వింటాకు రూ.5 వేలు అంటే అంతే. ఒక్క రూపాయి పెంచరు. అన్ని చార్జీలు రైతుపైనే. తేమ పేరుతో, క్వాలిటీ పేరుతో ధరను ఇష్టమొచ్చినట్లు నిర్ణయిస్తున్నారు. రైతులు ఇట్లా దగా పడుతున్నారే విషయం బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. అనేక పంటలకు ఇలాగే జరుగుతోంది. ఆనాడే కేంద్రంలోని మంత్రులు బోర్డులు, సీసీఐ, కార్పొరేషన్​లు 70 ఏండ్లలో రైతుకు మేలు చేయలేకపోయాయని కొత్త వ్యవసాయ విధానాలు వస్తున్నాయన్నారు. పాత సిస్టంలో ఉన్నవన్నీ మారుస్తామని చెప్పారు. చెప్పినట్టే కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చాయి. అవి పసుపు రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

బాధ్యత మరిచిన టీఆర్ఎస్ సర్కారు

ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) అయినా, ఎంఐఎస్(మార్కెట్​ఇంటర్వెన్షన్​స్కీమ్) అయినా రైతులకు గిట్టుబాటు అయ్యేందుకు కేంద్రం అమలు చేస్తుంది. కోట్ల ఎకరాల్లో పండించే అనేక పంటలకు కేంద్రం ఎంఎస్పీ నిర్ణయిస్తది. అయితే ప్రొక్యూర్​మెంట్​రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. నిబంధనలకు అనుగుణంగా పండిన పంటలో కొంత మొత్తాన్ని ఎంఎస్పీతో కేంద్రం కొనేందుకు సహకరిస్తుంది. వరి, గోధుమలు మొత్తం కేంద్రమే కొంటుంది. కందులు, మక్కల వంటి మిగతా కొన్ని పంటలను కొంత కేంద్రం కొంటుంది. కొంత రాష్ట్రాలు సొంతంగా కొంటాయి. ఇక ఎంఐఎస్​ స్కీమ్​కు వస్తే ప్రాంతీయ పంటల కోసం తక్కువ విస్తీర్ణంలో సాగయ్యే వాటి కోసం పెట్టింది. ఏదైనా ప్రాంతంలో రైతులకు గిట్టుబాటు ధర రాకపోతే అక్కడి ప్రభుత్వం కేంద్రానికి రాతపూర్వకంగా ప్రపోజల్స్​ పంపాలి. రైతులు ఎలా నష్టపోతున్నారు. ఎంత కొనాలి. ఎంత ధర ఇవ్వాలనే వివరాలు పంపాలి. కేంద్రం వాటిని పరిశీలించి తన వాటా ఇచ్చి సహకరిస్తుంది. సుమారు 15 ఏండ్ల కింద ఈ స్కీమ్​కింద పసుపు రైతులకు కేంద్రం సాయం వచ్చింది. ఇప్పుడు కూడా అదే రకంగా ఎంఐఎస్​కింద రైతులను ఆదుకునే అవకాశం ఉంది. అయితే కేసీఆర్​ ప్రభుత్వం ఇప్పుడు మార్కెట్​లో ఉన్న సమస్యను ప్రపోజల్స్​రూపంలో పంపిస్తే కేంద్రం సాయం చేయడానికి రెడీగా ఉంది. ఆ విషయం ఎన్నోసార్లు చెప్పాం. మొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్​చుగ్​ కూడా బోధన్​ సభలో ఇదే విషయం స్పష్టం చేశారు. ఇక పసుపు బోర్డు విషయానికొస్తే లోక్​సభ ఎన్నికల్లో గెలిచాక పసుపు ప్రత్యేక ధర విషయంలో రైతులతో అనేక మీటింగ్​లు పెట్టుకుని అవగాహన తెచ్చుకున్నాం. పంట పెట్టుబడి రూ.6 వేలు అవుతుంది. అయితే స్వామినాథన్​సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా రూ.9 వేలు ఇవ్వాల్సి ఉంది. 2019 సెప్టెంబర్​లోనే ఈ పని పూర్తయింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. కేంద్రానికి ప్రపోజల్స్​పెట్టడం లేదు.