కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం

 కాళేశ్వరం అప్పుల్ని రీస్ట్రక్చర్ చేయలేం
  • ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్రం సమాధానం
  • ఆర్బీఐ గైడ్​లైన్స్ పేరిట తప్పించుకునే ప్రయత్నం
  • వడ్డీ రేటు 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలని కోరుతున్న రాష్ట్రం
  • స్పందించని కేంద్రం.. మార్గదర్శకాల పేరుతో దాటవేత
  • అపాయింట్​మెంట్​ కోరితే రెస్పాన్స్ ఇవ్వని కేంద్ర మంత్రి నిర్మల ఆఫీసు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు, సంక్షేమ పథకాల అమలుకు గుదిబండగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్(కేఐపీసీఎల్) అప్పులను రీ-స్ట్రక్చర్ చేయలేమని కేంద్రం చెప్పింది. ఇందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గైడ్ లైన్స్ ను అడ్డుగా చూపే ప్రయత్నం చేసింది. మంగళవారం రాజ్యసభలో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ) ద్వారా చేసిన అప్పులను రీస్ట్రక్చర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేఐపీసీఎల్ ద్వారా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ లిమిటెడ్)నుంచి రూ.37,737.11 కోట్లు, రూరల్ ఎలక్ట్రీఫికేషన్ కార్పొరేషన్(ఆర్ఈసీ) ఆర్ఈసీ నుంచి రూ.30,536.08 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్ బీఎఫ్ సీ) రుణ ఖర్చు ఆధారంగా వడ్డీరేట్లను నిర్ణయిస్తాయని తెలిపారు. అయితే అప్పు రీస్ట్రక్చర్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఆధారంగా.. పీఎఫ్సీ/ఆర్ఈసీ లిమిటెడ్ నిబంధనల పరిగణనలోకి తీసుకొని కేఐపీసీఎల్ అప్పులను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్ కు తగ్గించవచ్చని పేర్కొంది.

లోన్​ టైమ్​30 ఏండ్లకు పెంచండి

గత సర్కార్ చేసిన అప్పులను రీస్ట్రక్చర్ చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్​సర్కార్ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం(ఆర్థిక మంత్రి) భట్టి విక్రమార్కలు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రధానంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పుల రీస్ట్రక్చర్ కు సహకరించాలని కోరుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఉన్న వడ్డీ శాతాన్ని 10 శాతం నుంచి 8 శాతానికి తగ్గించాలని, అలాగే ఐదేండ్ల షార్ట్ టైమ్ లోన్ నుంచి లాంగ్ టైమ్ లోన్ (రూల్ ప్రకారం 30 ఏండ్లు) కు పెంచాలని కోరారు. సీఎం నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఆ భేటీలో ఆమె మొండిగా నిరాకరించారు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి ఇదే అంశంపై నిర్మలా అపాయింట్​మెంట్ కోరారు. కానీ.. నిర్మలా ఆఫీస్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో చాలా సేపు నిరీక్షణ తర్వాత భట్టి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే అదే రోజు ఢిల్లీ పర్యటను వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం ఆమె అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై హస్తినలో చర్చ జరిగింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు సహకరించడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే అప్పుల ఊబి నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలంగాణకు కేంద్రం సహకరించే ఆలోచనే ఉంటే.. తాజగా ఎంపీ అనిల్ కుమార్ ప్రశ్నకు సమాధానం మరోలా ఉండేదని, ఆర్బీఐ పేరుతో దాటవేసే సమాచారం ఇచ్చేది కాదంటున్నారు.

కాళేశ్వరం అప్పు వడ్డీ రేటు 10 శాతం

గత బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం.. దొరికినకాడల్లా అప్పులు చేసింది. దాదాపు 10 శాతం వడ్డీకి అప్పులు తెచ్చింది. ప్రాజెక్ట్ ద్వారా పారే నీటిని పరిశ్రమలు, కంపెనీలకు మళ్లించి వచ్చే ఆదాయంతో ఐదేండ్లలో అప్పును తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. కానీ, కాళేశ్వరం కుప్పకూలడంతో నీటిని మళ్లించే పరిస్థితి లేకపోయింది. దీనికి తోడు ప్రతి నెల పెరిగిన అప్పుల భారం రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారింది. ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించాలనే అజెండాతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కు ఇదో పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రానికి ప్రస్తుతం ప్రతి నెల‌ ఆదాయం రూ.18,500 కోట్లు కాగా.. జీతాలు, పింఛ‌న్లకు నెల‌కు రూ.6,500 కోట్లు, ఈ అప్పుల‌కు వ‌డ్డీల‌కు రూ.6,500 కోట్లు కడుతున్నది. మిగిలిన రూ.5,500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం చేప‌ట్టే పరిస్థితి నెలకొంది.