- పార్లమెంటులో కేంద్ర మంత్రి ప్రవేశపెట్టిన వెంటనే యాప్‌లో వివరాలు
- ఇయ్యాల్టి నుంచి బడ్జెట్ సమావేశాలు
- తొలి రెండు రోజులు నో జీరో, క్వశ్చన్ హవర్స్
- ‘యూనియన్ బడ్జెట్’ అప్లికేషన్‌ను రూపొందించిన కేంద్రం
- పార్లమెంటులో ప్రవేశపెట్టిన వెంటనే యాప్‌లో వివరాలు
న్యూఢిల్లీ, వెలుగు: మారుతున్న కాలానికి తగ్గట్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే తీరు కూడా మారుతోంది. 2019లో పేపర్ లెస్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టిన కేంద్రం.. ఇప్పుడు యాప్ బేస్డ్ బడ్జెట్ తీసుకొస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్‌ను మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆ వెంటనే ‘యూనియన్ బడ్జెట్’ యాప్‌లో బడ్జెట్ అందుబాటులోకి రానుంది. ఆర్థిక మంత్రి ప్రసంగం, బడ్జెట్ వివరాలన్నీ అందులో ఉండనున్నాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ప్రస్తుత సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు 10 సిట్టింగ్ లలో ఫస్ట్ ఫేజ్, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు 19 సిట్టింగ్ లలో రెండో ఫేజ్ సమావేశాలు సాగనున్నాయి. తొలిరోజు సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడనున్నారు. ఆ తర్వాత లోక్ సభ ప్రారంభం కానుంది. ముందుగా లోక్ సభలో మధ్యాహ్నం 2:30 గంటలకు, ఆ తర్వాత రాజ్య సభలో 2021–22 ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో యూనియన్ బడ్జెట్ 2022–-23ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లెస్ ఫార్మాట్ లో దాదాపు 2 గంటల పాటు బడ్జెట్‌పై స్పీచ్ ఇవ్వనున్నారు. నాలుగోసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఉదయం రాజ్యసభ.. మధ్యాహ్నం లోక్ సభ
బడ్జెట్ సమావేశాల్లో తొలి రెండు రోజులు జీరో, క్వశ్చన్ అవర్స్ ఉండవు. ఫిబ్రవరి 2 నుంచి మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. కరోనా కారణంగా లోక్ సభ, రాజ్యసభ సెషన్స్ టైమింగ్స్ వేర్వేరుగా నిర్ణయించారు. మొదటి రెండు రోజుల్లో లోక్ సభ ఉదయం, రాజ్యసభ మధ్యాహ్నం సమావేశమవుతాయి. ఆ తర్వాత రాజ్యసభ ఉదయం, లోక్ సభ మధ్యాహ్నం సమావేశం అవుతాయి. ప్రతి సభ రోజూ 5 గంటల పాటు జరిగేలా షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక లోక్ సభలో 2, 3, 4, 7 తేదీల్లో రాష్ట్రపతి స్పీచ్ పై తీర్మానం జరగనుంది. రాష్ట్రపతిగా కోవింద్ పదవీకాలం వచ్చే జులైతో ముగియనుండటంతో ఆయనకు ఇదే చివరి సెషన్ కానుంది. మరోవైపు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఫస్ట్ ఫేజ్ బడ్జెట్ సెషన్ ముందుగానే వాయిదా పడే చాన్స్ ఉందని పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
ఇయ్యాల ఆల్ పార్టీ మీటింగ్
బడ్జెట్ సెషన్ సజావుగా జరిగేలా చూడాలని కోరుతూ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం వర్చువల్ మోడ్ లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎగువ సభ సభ్యులతో సమావేశం కానున్నారు. ఇక తెలంగాణకు సంబంధించిన అంశాలను ఆల్ పార్టీ మీటింగ్ లో, ఉభయ సభల్లో లేవనెత్తాలని టీఆర్ఎస్ యోచిస్తోంది.
రైతు సమస్యలు, పెగాసస్ పై ప్రతిపక్షాల ఫోకస్
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధానంగా రైతు సమస్యలు, పెగాసస్ స్పైవేర్ వివాదం, చైనా ఆక్రమణల అంశాలు లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పెగాసస్‌ను కేంద్రం కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ రెండు రోజుల కిందటే కథనం పబ్లిష్ చేసినందున ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ప్రధాని మోడీ సర్కారును టార్గెట్ చేయనుండటంతో ఈ సమావేశాలు కూడా వాడీవేడీగా సాగే అవకాశాలు ఉన్నాయి.