- జనం రూల్స్ పాటించేలా చూడాలని ఆ రాష్ట్రాలకు లెటర్
- 24 గంటల్లో 19 రాష్ట్రాల్లో ఒక్క మరణం నమోదవలె
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్రం అలర్టయింది. వైరస్ వ్యాప్తి ఎక్కువున్న 9 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపింది. జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారుల నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందాలను మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్‌లకు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో ఈ బృందాలు కలిసి పని చేస్తాయని.. కేసులు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుంటాయని తెలిపింది. వైరస్ వ్యాప్తి తగ్గించేందుకు రాష్ట్రాలతో కలిసి చర్యలు తీసుకుంటాయంది. మరోవైపు జనం కరోనా రూల్స్ పాటించేలా చూడాలని ఆ 9 రాష్ట్రాలకు కేంద్రం లెటర్ రాసింది. వైరస్ చైన్‌ను ఆపేందుకు ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ టెస్టులు పెంచాలని సూచించింది. కాగా, దేశంలో కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ఢిల్లీ అలర్టయింది. జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఢిల్లీకి వచ్చే వాళ్లు కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించేలా రూల్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ నుంచి ఢిల్లీ వచ్చే వాళ్లకు దీన్ని కచ్చితంగా అమలు చేయాలనుకుంటోంది. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడొచ్చని అధికారులు చెప్పారు.
24 గంటల్లో 104 మరణాలు
19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,46,907 యాక్టివ్ కేసులున్నాయని.. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 1.33 శాతమేనని చెప్పింది. దేశంలో గత 24 గంటల్లో 13,742 కేసులు నమోదయ్యాయంది. కొత్త కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదయ్యాయని వివరించింది. గత వారం రోజుల్లో 12 రాష్ట్రాల్లో ప్రతిరోజూ సరాసరి 100కు పైగా కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. దేశంలో గత 24 గంటల్లో కరోనాతో 104 మంది చనిపోయాని.. ఇందులో మహారాష్ట్రలో 51 మంది, కేరళలో 14 మంది, పంజాబ్‌లో 10 మంది మరణించారని కేంద్రం చెప్పింది.
నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసిన పలు రాష్ట్రాలు
- ఢిల్లీ: మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్చూపించాల్సిందేనని కేజ్రీవాల్ సర్కారు స్పష్టంచేసింది. ఈ నెల 26 నుంచి మార్చి 15 వరకు ఈ రూల్ అమలు చేస్తామని పేర్కొంది.
- కర్నాటక: మహారాష్ట్ర నుంచి తమ రాష్ట్రంలోకి అడుగుపెట్టే వారు కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలని కర్నాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్తీసుకున్న 72 గంటలలోగా రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలిపింది.
- మహారాష్ట్ర: కేరళ, గోవా, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ల నుంచి వచ్చే ప్రయాణికులను కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ చూపిస్తేనే అనుమతిస్తామని మహారాష్ట్ర సర్కారు తెలిపింది.
- ఉత్తరాఖండ్: హరిద్వార్ కుంభమేళాకు హాజరయ్యేందుకు వచ్చే ప్రయాణికులలో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకుని, నెగెటివ్ సర్టిఫికెట్తో రావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
- జమ్మూకాశ్మీర్: కాశ్మీర్లో అడుగుపెట్టే ప్రయాణికులను ఎయిర్‌పోర్టులోనే ఆపి అధికారులు వారికి కరోనా టెస్ట్ చేయిస్తున్నారు. రిపోర్టు వచ్చే వరకూ అక్కడే ఉంచేసి, నెగెటివ్ వస్తే ఓకే.. పాజిటివ్ వచ్చినోళ్లను ఐసోలేషన్‌కు పంపిస్తున్నారు.
- మణిపూర్: మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారికి కరోనా టెస్ట్ రిపోర్ట్ తప్పనిసరి అని మణిపూర్ సర్కారు ప్రకటించింది.