వర్షాన్ని ఆన్, ఆఫ్ చేయవచ్చా..? అవసరం ఉన్నపుడే వర్షం పడేలా ప్రయోగాలు

వర్షాన్ని ఆన్, ఆఫ్ చేయవచ్చా..? అవసరం ఉన్నపుడే వర్షం పడేలా  ప్రయోగాలు

న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించి, కచ్చితమైన అంచనాలను వేగంగా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెదర్‎ను అంచనా వేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగించాలని నిర్ణయించింది. దీనికోసం 'మిషన్ మౌసమ్' పేరుతో రానున్న ఐదేండ్లలో రూ.2 వేల కోట్లను ఖర్చుచేయాలని భావిస్తున్నది. వాతావరణ ప్రక్రియల సంక్లిష్టత, మోడల్స్, అబ్జర్వేషన్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లలోని పరిమితులతో మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వాతావరణాన్ని ముందస్తుగా అంచనా వేయడం కష్టంగా ఉంది. 

ముఖ్యంగా ప్రస్తుత న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్(ఎన్‎డబ్యూపీ) పరిధి 12కి. మీ. మాత్రమే ఉండటంతో స్వల్పకాలిక వాతావరణ మార్పులను అంచనా వేయడం సవాలుగా మారిందని ఎర్త్ సైన్సెస్ శాఖ పేర్కొంది. వాతావరణ మార్పులు అస్తవ్యస్తంగా ఉండటంతో భారీ వర్షాలతో వరదలు, ఉరుములు, పిడుగుపాట్లు, క్లౌడ్ బరస్ట్ సంభవిస్తున్నాయి. తద్వారా కరువు వంటి తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకే వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని అంచనా వేయటం చాలా అవసరమని ఎర్త్ సైన్సెస్ శాఖ స్పష్టం చేసింది. 

మిషన్ మౌసమ్ ముఖ్య అంశాలివే..

వాతావరణ ప్రక్రియల గురించి పూర్తి అవగాహన అవసరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మిషన్ మౌసమ్‎లో భాగంగా ఎన్ డబ్ల్యూపీ పరిధిని 12 కి.మీ. నుంచి 6 కి.మీ. వరకు తగ్గించనున్నారు. క్లౌడ్ సీడింగ్‌‌‌‌‌‌‌‌ను స్టడీ చేయడానికి పుణెలోని ఇండియన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎమ్)లో లేబొరేటరీ ఏర్పాటు, రాడార్ల సంఖ్యను భారీగా పెంచడం, కొత్త శాటిలైట్ వ్యవస్థలు, అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ల వంటి వాటిని సమకూర్చనున్నారు. 

ఈ మిషన్ వచ్చే ఐదేళ్లలో రెండు దశల్లో చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. క్లౌడ్ సీడింగ్, వెదర్ మాడిఫికేషన్ టెక్నాలజీ అనేవి వాతావరణ ప్రభావాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు.. ఆగకుండా పడుతున్న వర్షాన్ని మనకు నచ్చినప్పుడు ఆపేయవచ్చు. కృత్రిమంగా వర్షాన్ని ఆపడం ద్వారా వరద ప్రాంతాల్లో  ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అలాగే.. కరువు పీడిత ప్రాంతాలలో వర్షపాతాన్ని పెంచవచ్చు. యూఎస్, చైనా, యూఏఈతో సహా అనేక దేశాలు ఇప్పటికే ఇలా క్లౌడ్ సీడింగ్‌‌‌‌‌‌‌‌తో ప్రయోగాలు చేస్తున్నాయి. 

మిషన్ లక్ష్యాలివే..

మిషన్ తొలిదశలో భాగంగా మార్చి 2026 వరకు పరిశీలనాత్మక నెట్ వర్క్ ను విస్తరిస్తారు. వీటిలో దాదాపు 70 డాప్లర్ రాడార్లు, సూపర్ కంప్యూటర్లు, 10 విండ్ ప్రొఫైలర్లు, 10 రేడియో మీటర్లను ఏర్పాటు చేస్తారు. రెండోదశలో శాటిలైట్లు, విమానాలను ఉపయోగిస్తారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ.. మేఘాల్లో జరిగే ప్రక్రియలపై స్టడీ కోసం ఐఐటీఎమ్‎లో క్లౌడ్ చాంబర్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాదిన్నరలో దీన్ని పూర్తి చేస్తారు. మొత్తంగా వాతావరణ అంచనాల కచ్చితత్వాన్ని 5 నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఈ మిషన్ చేపట్టనున్నారు. 

అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలకు వాతావరణ అంచనాలను చేరవేయడం కూడా ఇందులో భాగం. తద్వారా వ్యవసాయానికి అవసరమైన కచ్చితమైన అంచనాలు అందించాలని భావిస్తున్నారు. ఇప్పుడున్న ఫోర్కాస్ట్ (ముందస్తు అంచనాలు) స్థానంలో నౌకాస్ట్ (తక్షణ అంచనాలు) వ్యవస్థను వచ్చే అయిదేళ్లలో అమల్లోకి తెస్తారు. ప్రస్తుతం నౌకాస్ట్ ను మూడు గంటల ముందు ఇస్తుండగా.. దానిని ఒక గంటకు తగ్గించాలని భావిస్తున్నారు.