పన్నుల ఆమ్దానీ పెరుగుడు మంచిదా?

రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఆదాయం వస్తుంది. ఇందులో ప్రధానమైనవి -ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ‘వ్యాట్’, రెండు కేంద్ర జీఎస్టీలో రాష్ట్ర వాటా, మూడు, మద్యం అమ్మకాలపై వచ్చే ఎక్సైజ్ పన్ను, నాలుగు, భూమి లావాదేవీలపై వచ్చే రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజ్ లు, ఐదు మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ పన్ను. 2017- నుంచి 2021 మధ్యలో సగటున తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పన్నుల ఆదాయంలో 35.1 శాతం వ్యాట్ ద్వారా, 33.1 శాతం ఎస్‌‌జీ‌‌ఎస్‌‌టీ రూపంలో,17 శాతం ఎక్సైజ్ పన్ను రూపంలో, 8.6 శాతం భూమి రిజిస్ట్రేషన్, స్టాంప్ ఫీజ్ రూపంలో, 6 శాతం మోటారు వాహనాల పన్ను రూపంలో వచ్చినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సుస్థిర అభివృద్ధి సాధ్యం కావాలంటే, పన్నుల వ్యవస్థ కూడా ఆరోగ్యకరమైనదై ఉండాలి. శక్తికి మించి చేసే అప్పులు, వాటిపై చెల్లించే వడ్డీలు ఎప్పుడూ ప్రమాదకరమే. అలాగే రాష్ట్రం ఎక్కువగా ఆధారపడుతున్న‘వ్యాట్’ ప్రజలపై అత్యంత భారాన్ని మోపేదే. ముఖ్యంగా గత రెండేండ్లుగా అమ్మకం పన్ను రాష్ట్రానికి ఎక్కువగా వస్తున్నది. దానికి కారణం పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రం విధిస్తున్న పన్నులు. ఈ పన్నులు జీ‌‌ఎస్‌‌టీ పరిధిలో లేవు కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ లపై పన్నులు బాదుతూ ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నాయి.  

పన్నులు ఎగ్గొట్టే తీరు..

ఆర్థిక వ్యవస్థలో లాభాలు సంపాదిస్తూ ఉన్నవాళ్లపై సంపద పన్ను విధిస్తూ ప్రభుత్వాలు నిధులు సమకూర్చుకుని పేద ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాలి. కానీ లాభాలు సంపాదిస్తున్న వాళ్లు.. ఎలా పన్నులను ఎగ్గొట్టాలో ఈ ఏడు దశాబ్దాలలో బాగా అర్థం చేసుకున్నారు. ప్రభుత్వాల్లో ఉన్నదే ధనిక వర్గాల ప్రతినిధులు కాబట్టి ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం రాకుండా తగ్గిపోతుందో స్పష్టంగా తెలిసినా మిన్నకుంటున్నారు. లేదా ఆ మోసాల్లో భాగం పంచుకుంటున్నారు. నిజానికి ఒక పరిమితి దాటాక, వ్యవసాయ ఆదాయంపై కూడా పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఇవాల వ్యవసాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను లేక పోవడం వల్ల, అనేక మంది బడా బాబులు తాము సంపాదించే నల్ల ధనాన్ని, వ్యవసాయేతర వృత్తుల వాళ్ల తమ అదనపు ఆదాయాన్ని భూములపై పెట్టుబడిగా పెడుతున్నారు. వ్యవసాయంలో నష్టాలు వచ్చినట్లుగా చూపిస్తూ, ఆదాయ పన్నులు కూడా ఎగ్గొడుతున్నారు. విత్తన కంపెనీలు కూడా ఈ పేరున ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్నాయి.

కాంట్రాక్టర్ల చేతిలో భూములు

రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న మరొక పన్ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ పన్ను. 2014-–2015లో రూ. 2,177 కోట్లు ఉన్న ఈ పన్ను ఆదాయం 2021-–2022 నాటికి రూ.12,500 కోట్లకు చేరింది. ఏటా భూమి రిజిస్ట్రేషన్ విలువలు, లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నది. కానీ ఈ క్రమంలో రాష్ట్ర సహజ వనరుగా ఉన్న భూములు చాలా వేగంగా రియల్ ఎస్టేట్ పేరుతో, లేదా సాగు భూముల కొనుగోళ్ల పేరుతో, సాగు చేయని వాళ్ళ చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. దేశ దేశాల ఎన్‌‌ఆర్‌‌ఐలు, కాంట్రాక్టర్లు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు వ్యవసాయేతర ఆదాయాలు పొందుతున్న వాళ్లు ఎక్కువగా ఈ భూములను కొనుగోలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ, ఉన్న భూములను అమ్ముకోవడమే కానీ, అదనంగా వ్యవసాయ ఆదాయంతో ఒక్క ఎకరం కొన్ని దాఖలాలు ఎక్కడా లేవు. 

అప్పుల ఊబిలోకి..

రాష్ట్ర ప్రభుత్వం రాను రాను అప్పుల ఊబిలో కూరుకు పోతున్నది. మార్కెట్ రుణాలు రూ. 2,44,238 కోట్లు. బ్యాంకులు, ఇతర సంస్థల రుణాలు రూ. 14,161 కోట్లు, పీ‌‌ఎఫ్, ఇన్సూరెన్స్ ఫండ్స్ రూ.12,785 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ. 7,555 కోట్లు, ఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ఎఫ్ ప్రత్యేక సెక్యూరిటీలు రూ. 6,377 కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన రుణాలు రూ. 1,35,282 కోట్లు ఉన్నాయి. రాష్ట్ర జీ‌‌ఎస్‌‌డీపీలో రుణాల పరిమితి ఆంక్షలను ఎప్పుడో దాటేసింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వాలు అప్పులు చేయకూడదని ఎవరూ అనరు. అనివార్యం కూడా. కానీ అప్పులు ఎందుకోసం చేస్తున్నాం? నిజమైన ప్రణాళికాబద్ధ అభివృద్ధికే అవి ఖర్చు చేస్తున్నామా? ప్రజలపై భారం వేయకుండా అప్పులను తీర్చే మార్గమేమిటి ? భూమి లాంటి  రాష్ట్ర సహజ వనరులను అమ్ముకుని అప్పులు తీర్చాలనుకోవడం ఎంత వరకు సరైంది? ఒక ప్రభుత్వ పరిపాలనా కాలం ఐదేండ్లయినప్పుడు, రాబోయే 25- ఏండ్లలో తీర్చే విధంగా, అప్పులు చేయడం ఎంతవరకు సమంజసం ? మొత్తంగా రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. తాజాగా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేకుండా పోయింది. సహజ వనరుగా రాష్ట్రానికి ఉపయోగ పడాల్సిన భూమి, ఇప్పుడు ప్రభుత్వం చేతిలో అమ్మకపు సరుకుగా మారింది. 

మద్యం ఆదాయం..

ఖనిజ ఉత్పత్తులు, ఇసుకను చవక ధరలకు కొట్టేస్తూ కాంట్రాక్టర్లు, కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ మాఫియాతో రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం(కొండలు, గుట్టలు,ఇసుక )  జరుగుతుండగా మరో వైపు ప్రభుత్వానికి కనీస ఆదాయం కూడా రావడం లేదు. మద్యంపై పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్థిర ఆదాయం ఉంది . 2014-–2015 లో రూ. 2,808 కోట్లు మాత్రమే ఉన్న ఈ ఆదాయం 2021-–2022 నాటికి రూ. 17 వేల కోట్లకు పెరిగింది. అంటే కనీసం 700 శాతం పెరిగింది. 2022–-2023 బడ్జెట్ లో ఈ పన్ను ఆదాయాన్ని రూ.17,500 కోట్లుగా అంచనా వేశారు. తాజాగా మద్యం ధరల పెంపుతో ఈ ఏడాది మరో రూ.12 వేల కోట్ల అదనపు పన్ను ఆదాయం వస్తుందని అంచనా. మగవాళ్లను తాగుడుకు బానిసలుగా మారుస్తూ, మహిళలను హింసకు, వేదనకు గురి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంపాదిస్తున్న సొమ్ము ఇది. ఇది అత్యంత అన్యాయమైనది. అనైతికమైనది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నుల్లో నికరమైన వృద్ధి రేటు ఒక్క మద్యం మీదే ఉందనేది దృష్టిలో ఉంచుకోవాలి.  
- కన్నెగంటి రవి,రైతు స్వరాజ్య వేదిక