మునుగోడు ఉప ఎన్నిక ఏర్పాట్లపై ఇవాళ సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఎన్నికల కోడ్ అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఏర్పాట్లు వంటి కీలక అంశాలపై చర్చించనుంది. అభ్యర్థుల గుర్తుల్లో గందరగోళం, ఆర్వో నిర్లక్ష్యం, బ్యాలెట్ పత్రాల్లో అచ్చు తప్పులు దొర్లడం వంటి అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు, యాదాద్రి, నల్గొండ జిల్లా కలెక్టర్లు, రాచకొండ, నల్గొండ పోలీస్ కమిషనర్లు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పాల్గొననున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో
మునుగోడు ఉప ఎన్నిక నూతన ఆర్వోగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్ కు బాధ్యతలు అప్పగించింది. ఇండిపెండెంట్ అభ్యర్థికి గుర్తులు కేటాయించే విషయంలో జగన్నాథ రావును బాధ్యతల నుంచి తొలగించింది. ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తు మార్పుపై ఆర్వో జగన్నాథరావును విధుల నుంచి తప్పించింది.
అంతకుముందు ఏం జరిగిందంటే..?
మునుగోడు ఉప ఎన్నికలో యుగతులసీ నుంచి పోటీ చేస్తున్న శివకుమార్ కు ముందుగా రోడ్డు రోలర్ కేటాయించారు. ఆ తర్వాత బేబీ వాకర్ కేటాయించడంతో శివకుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. తనకు కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును హఠాత్తుగా మార్చారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. శివకుమార్ కు తిరిగి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి.