ప్రభుత్వానికి పన్నులు విధించడం ద్వారా వచ్చే రాబడిని పన్ను రాబడి అంటారు. ఇవి నిర్బంధ చెల్లింపులు. ప్రజల సామాన్య ప్రయోజనం కోసం విధిస్తారు. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. అలాంటి పన్నుల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలను నియమించింది. వాటి సిఫారసుల అనుగుణంగా అనేక మార్పులు చేసింది.
1991లో రాజా చెల్లయ్య అధ్యక్షతన పన్ను సంస్కరణల కమిటీ నియామకమైంది. ఈ కమిటీ 1992లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ కమిటీని నియమించడంలో లక్ష్యాలు. అవి.. పన్ను ఎగవేత నివారణ, పన్ను చట్టాల సూక్మీకరణ, పన్ను భారం తగ్గించడం, పన్ను యంత్రాంగ సామర్థ్యాన్ని పెంచడం. చెల్లయ్య కమిటీ పలు సిఫారసులు చేసింది.
1. ప్రత్యక్ష పన్నులు : పన్ను రేటు, శ్లాబ్స్ తగ్గించాలని, కార్పొరేషన్ ట్యాక్స్ తగ్గించి దేశీయ, విదేశీ కంపెనీలపై ఉన్న కార్పొరేషన్ ట్యాక్స్ వ్యత్యాసాన్ని 10 శాతం కంటే మించకుండా చూడాలని, చిన్న వ్యాపారస్తులు, టోకువర్తకులపై సంభవనా పన్ను విధించాలని, షేర్లు, బాండ్లు తదితర ఉత్పాదక ఆస్తులపై సంపద పన్ను మినహాయించాలని సూచించారు.
2. పరోక్ష పన్నులు : కస్టమ్ డ్యూటీస్ దశలవారీగా తగ్గించాలని, ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ ప్రవేశ పెట్టాలని, సేవలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని, స్పెసిఫిక్ డ్యూటీ కంటే అడొలరెమ్ డ్యూటీస్ మెరుగైనవని సూచించారు.
3. ఇతర అంశాలు : టీఐఎన్ (ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్)కు బదులు పాన్ (పర్మినెంట్ అకౌంట్ నంబర్)ను ప్రవేశపెట్టాలని సూచించారు.
అమలు : ఆదాయ పన్ను రేట్లు, కార్పొరేషన్ ట్యాక్స్ రేట్లు తగ్గించారు. 2000–01లో సీఈఎన్ వ్యాట్‌ను 1994–95లో సర్వీస్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు.
1991 తర్వాత పన్ను సంస్కరణలు
పన్ను సంస్కరణల కమిటీ చెల్లయ్య అధ్యక్షతన నియమించారు. ఈ కమిటీ పన్నులను సూక్ష్మీకరించడం, తక్కువ పన్ను రేట్లు, మినహాయింపుల కుదింపు, పన్ను సూత్రాలను అనువర్తింపజేసేటప్పుడు పన్ను అధికారులకు తక్కువ అధికారాలు ఇవ్వడం తదితర అంశాలకు అనుగుణంగా నివేదిక ఇచ్చారు. 2002లో పన్నులపై విజయ్ కేల్కర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం నియమించింది. ఇది కూడా పన్ను విధానంలో సమత్వం, సులభంగా వసూలు ఉండాలని పేర్కొంది. తక్కువ పన్ను రేట్లు, తక్కువ పన్ను మినహాయింపులు, సర్చార్జెస్ ఎత్తివేతపై అనుకూలంగా నివేదిక అందజేసింది.
అమలు తీరు
- 1992–93లో ఆదాయపు పన్ను శ్లాబ్‌లను మూడింటికి తగ్గించారు(20 శాతం, 30 శాతం, 40 శాతం). 1997–98 బడ్జెట్లో దీనిని 10 శాతం, 20 శాతం, 30 శాతానికి మార్చారు. 2017–18 బడ్జెట్లో 5 శాతం, 20 శాతం, 30 శాతానికి మార్చారు. 2020–21(బీఈ)లో ఏడు పన్ను శ్లాబ్‌లను ప్రవేశ పెట్టారు (నిల్, 5 శాతం, 10 శాతం, 15 శాతం, 20 శాతం, 25 శాతం, 30 శాతం).
- కార్పొరేషన్ పన్నును 1994–95లో 40 శాతానికి, 1997–98లో 35 శాతానికి, 2005–06లో 30 శాతానికి తగ్గించారు. 2017–18లో రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వాటికి 25 శాతానికి తగ్గించారు. 2019–20(బీఈ)లో నిర్మలా సీతారామన్ రూ. 400 కోట్ల టర్నోవర్ వరకు దీనిని పెంచారు. 2019, సెప్టెంబర్ లో ఆర్థిక మంత్రి వీటిపై పన్ను రేటును 22 శాతానికి తగ్గించారు. కొత్తగా ప్రారంభించే కంపెనీలపై 15 శాతానికి విధించారు.
- 1996–97లో మ్యాట్, 2000–01లో సీఈఎన్ వ్యాట్, 1994–95లో సర్వీస్ ట్యాక్స్‌ను ప్రవేశపెట్టారు.
- 2007–08లో కస్టమ్స్ సుంకాలను 10 శాతానికి తగ్గించారు. పన్ను రంగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
కోశ/ పన్ను సంస్కరణలపై విజయ్ కేల్కర్ కమిటీ సిపారసులు(2002)
విత్త క్రమశిక్షణ కోసం వ్యయం తగ్గించడం కంటే పన్ను రాబడి పెంచే మార్గాలపై దృష్టి సారించాలని, పన్ను స్లాబ్‌లు రెండే ఉండాలని కార్పొరేషన్ ట్యాక్స్‌ను 35 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని సూచించింది. దీన్ని విదేశీ కంపెనీలపై 40 నుంచి 35 శాతానికి తగ్గించాలని, మ్యాట్‌ను తొలగించాలని, జాతీయ స్థాయిలో జీఎస్టీ ప్రవేశపెట్టాలని, షేర్ హోల్డర్స్ డివిడెండ్లపై పన్ను తొలగించాలని సిఫారసు చేసింది.
జీఎస్టీ
2003లో కేల్కర్ కమిటీ వ్యాట్ సూత్రం ఆధారంగా సమగ్ర వస్తు సేవల పన్ను ప్రవేశ పెట్టాలని సూచించారు. 13 సంవత్సరాల తర్వాత జీఎస్టీ బిల్లు చట్టరూపం దాల్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2017 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. జీఎస్టీని ఆమోదించిన తొలి రాష్ట్రం అసోం.
కౌన్సిల్
జీఎస్టీ బిల్లు ప్రకారం ఈ చట్టం అమలులోకి వచ్చిన 60 రోజుల లోపు రాష్ట్రపతి జీఎస్టీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి (చైర్మన్), ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు గానీ పన్ను వ్యవహారాలు చూసే మంత్రులు గానీ ఆ రాష్ట్రం నామినేట్ చేసే ఇతర మంత్రులు గానీ సభ్యులుగా ఉంటారు.
కౌన్సిల్ నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర – రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తుంది. జీఎస్టీ మండలి నిర్ణయాలు 3/4 వంతు మెజార్టీతో అమలులోకి వస్తాయి. 1/3 వంతు ఓట్లు కేంద్రానికి, 2/3 వంతు రాష్ట్రానికి ఉంటాయి. జీఎస్టీ చట్టంలోని 279 (ఏ) సెక్షన్ ప్రకారం ఈ మండలి ఏర్పాటైంది. దీని సచివాలయం ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు అధ్యక్షులు దీనికి శాశ్వత ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. అయితే, వీరికి ఓటింగ్ హక్కు ఉండదు. జీఎస్టీ కౌన్సిల్ కింది అంశాలను సిఫారసు చేస్తుంది.
1. జీఎస్టీలో విలీనం కానున్న పన్నులు, సెస్‌లు, సర్‌చార్జీలు
2. మినహాయింపు పొందే వస్తు సేవలు
3. టర్నోవర్ పరిమితి
4. జీఎస్టీ రేట్లు
జాన్మత్తై కమిటీ (1953) కార్పొరేషన్ పన్ను
కార్డర్ కమిటీ (1956) బహుమతి, సంపద, వ్యయం, మూలధన ఆదాయంపై పన్నులు
మహావీర్ త్యాగి కమిటీ (1959) ప్రత్యక్ష పన్నుల పరిశీలన
చందా కమిటీ (1964) పన్ను ఎగవేత నిరోధానికి సూచనలు
భూతలింగం కమిటీ (1967) పన్నుల విధానాల ఆధునికీకరణ
తివారీ కమిటీ (1967) కస్టమ్ డ్యూటీస్
వాంఛూ కమిటీ (1970) ప్రత్యక్ష పన్నులు, పన్ను ఎగవేత, నల్లధనం
కె.ఎన్.రాజ్ కమిటీ (1972) వ్యవసాయాదాయంపై పన్ను
ఎల్కే ఝా కమిటీ (1976-78) పరోక్ష పన్నులు (వ్యాట్‌ను సూచించారు)
చోక్సీ (1997) ప్రత్యక్ష పన్నుల సులభతరం, హేతుబద్ధీకరణ
రాజా చెల్లయ్య (1991) ప్రత్యక్ష, పరోక్ష పన్నులు (సేవా పన్నును సూచించారు)
రేఖీ కమిటీ (1992) పరోక్ష పన్నులు
పార్థసారథి సోం కమిటీ (2001, 2012) 10వ ప్రణాళికలో పన్ను సంస్కరణ, జీఏఏఆర్
విజయ్ కేల్కర్ కమిటీ (2002) ప్రత్యక్ష, పరోక్ష పన్నుపై (జీఎస్టీని సూచించారు)