మూడు దశల్లో..మ్యాంగో క్లస్టర్​

మూడు దశల్లో..మ్యాంగో క్లస్టర్​

పాలమూరు జిల్లాను ఎంపిక చేసిన కేంద్ర సర్కారు

  •     త్వరలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మామిడి నర్సరీల ఏర్పాటు
  •     జడ్చర్ల లేదా భూత్పూర్​ వద్ద కోల్డ్​ స్టోరేజీలు, ప్యాక్​ హౌస్​ల ఏర్పాటు 
  •     ఎన్​హెచ్​-44కు దగ్గరలో 15 ఎకరాల స్థల పరిశీలన

మహబూబ్​నగర్, వెలుగు:పాలమూరు జిల్లాలో మూడు దశల్లో మ్యాంగో క్లస్టర్​ ఏర్పాటుకు కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది. దేశంలో ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లను ఏర్పాటు చేస్తోంది. ఏపీలో అరటి క్లస్టర్, తెలంగాణలో మామిడి క్లస్టర్​ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మామిడి ఎక్కువగా సాగువుతున్న పాలమూరు జిల్లాలో ఈ క్లష్టర్​ ఏర్పాటు చేయనుంది. జులై నుంచి ఈ క్లస్టర్​ ప్రారంభం కానుంది.

రూ.వంద కోట్ల ప్రాజెక్ట్..​

క్లస్టర్​ డెవలప్​మెంట్​ ప్రోగ్రాం (సీడీపీ) కింద రూ.వంద కోట్లతో కేంద్ర ప్రభుత్వం పాలమూరులో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని గ్రాండ్​ చార్టన్​ ఏజెన్సీ త్వరలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి ఇక్కడ మామిడి తోటల రకాలు? ఎంత మంది రైతులు? ఎన్ని ఎకరాల్లో తోటలు సాగు చేస్తున్నారనే వివరాలు సేకరించనుంది. తోటలు మరింత పెంచడానికి ఎన్ని నర్సరీలు అవసరం అవుతాయి? అందులో హైటెక్​ నర్సరీలు ఎన్ని అవసరం అవుతాయనే రిపోర్టును ఏజెన్సీ తయారు చేయనుంది.

మూడు భాగాలుగా క్లస్టర్..​

క్లస్టర్​ను నర్సరీ స్టేజ్, ప్రొడక్షన్, పోస్ట్​ ప్రొడక్షన్​ స్టేజ్​లనే మూడు విభాలుగా చేయనున్నారు. నర్సరీ స్టేజ్​లో మొక్కల పెంపకం చేపట్టనున్నారు. ప్రొడక్షన్​ స్టేజ్​లో మామిడి చెట్లకు పిందె నుంచి కాయలు పట్టే సమయంలో పురుగు పట్టకుండా ఉండేందుకు ఫ్రూట్​ బ్యాగ్​ సిస్టమ్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు. కాయ చిన్న సైజుగా ఉన్న సమయంలో వర్షాలు పడితే, కాయకు పురుగు పట్టకుండా ఈ ఫ్రూట్​ బ్యాగ్​తో ప్యాక్ చేస్తారు. పోస్ట్​ ప్రొడక్షన్​ స్టేజ్​లో ప్యాకింగ్​ ఎలా చేయాలి? ఇతర దేశాలకు ట్రాన్స్​పోర్ట్​ ​ చేసేటప్పుడు డబ్బాలు ఏ క్వాలిటీలోఉండాలి? ల్యాగిస్టిక్ ​ఎలా ఉండాలి? అనే దానిపై శిక్షణ ఇస్తారు.

15 ఎకరాల్లో ఇన్​ఫ్రాస్ట్రక్చర్..​

క్లస్టర్​లో భాగంగా ఎన్​హెచ్​-44కు దగ్గరలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​మెంట్​ చేయనున్నారు. ఇందులో కోల్డ్​ స్టోరేజీలు, ప్యాక్​ హౌస్​లు ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం 15 ఎకరాల స్థలం అవసరం ఉంది. ఇప్పటికే ఏసీపీ నుంచి మహబూబ్​నగర్​ కలెక్టర్​కు గత నెల లెటర్​ కూడా వచ్చింది. ప్రస్తుతం జడ్చర్ల, భూత్పూర్​ ప్రాంతాల్లో ఎన్​హెచ్​-44కు 10 కిలోమీటర్ల దగ్గరలో ఉండే స్థలం కోసం పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి దొరకనుంది. 

తీరనున్న మార్కెటింగ్​ సమస్య..

పాలమూరు మామిడి రైతులను దశాబ్దాలుగా మార్కెటింగ్​ సమస్య వేధిస్తోంది. క్వాలిటీ పండ్లు అందుబాటులో ఉన్నా, మార్కెటింగ్​ చేయలేకపోతున్నారు. మద్దతు ధరకు కాకుండా తక్కువ రేట్​కే హైదరాబాద్, బెంగళూరు వ్యాపారులకు పండ్లు అమ్మి నష్టపోతున్నారు. క్లస్టర్​ ఏర్పాటు వల్ల మార్కెటింగ్ సౌకర్యం ఈజీ కానుంది. అలాగే మామిడిలో కొత్త వెరైటీల సాగుకు ప్రోత్సహించనున్నారు. పండ్లను ఎక్స్​పోర్ట్​ చేసి రైతులకు లాభాలు వచ్చేలా క్లస్టర్​ను డెవలప్​ చేయనున్నారు.

గుత్తకు ఇచ్చిన..

నాకు మూడెకరాల మామిడి తోట ఉంది. మార్కెట్​ సౌకర్యం లేక ప్రతీ సీజన్​లో ఇబ్బంది పడుతుంటి. కరోనా తర్వాత బండ్ల కిరాయి బాగా పెరగడంతో కాయలు వేరే చోటికి తీసుకుపోతలేను. ఈ సీజన్​లో తోట పూత దశలో ఉన్నప్పుడు గుత్తకు ఇచ్చిన. క్లస్టర్  వస్తే మార్కెటింగ్ సౌలత్​తోటి లాభాలు వస్తాయి.
‌‌ ‌‌– అనంతారెడ్డి, మామిడి రైతు, నంచర్ల

దళారులు చెప్పిన రేట్​కే ఇస్తుంటిమి..

నేను రెండు ఎకరాల్లో మామిడి తోట సాగు చేస్తున్నా. సీజన్​లో కాయలు కోసి హైదరాబాద్​ మార్కెట్​కు తరలిస్తాం. కాయ మంచిగున్నా దళారులు చెప్పిన రేట్​కు అమ్మాలే. వాళ్లను కాదని ఎవరూ కొనేందుకు ముందు రారు. మామిడి క్లస్టర్​ వస్తే మంచి జరుగుతది. 
‌‌– కుర్వ మల్లప్ప, మామిడి రైతు, గాధిర్యాల్