కేంద్రం నెలరోజులు కాల్పులు ఆపాలి..మావోయిస్టులతో శాంతిచర్చలకు రావాలి

కేంద్రం నెలరోజులు కాల్పులు ఆపాలి..మావోయిస్టులతో శాంతిచర్చలకు రావాలి
  • ప్రొఫెసర్‍ హరగోపాల్‍.. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్​ డిమాండ్ 

వరంగల్‍, వెలుగు: చత్తీస్ గఢ్​లో మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య పోరులో అమాయక ఆదివాసీలు, చిన్నపిల్లలు చనిపోతున్నారని ప్రొఫెసర్‍ హరగోపాల్‍ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలు నెల రోజులు కాల్పులు ఆపాలని డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్రస్థాయి పౌర హక్కులు, ప్రజా సంఘాల ప్రతినిధులు గ్రేటర్‍ వరంగల్‍ ప్రెస్‍క్లబ్‍లో మీడియా సమావేశం నిర్వహించారు. హరగోపాల్‍ మాట్లాడుతూ.. మావోయిస్టులు 50 ఏండ్లుగా కొట్లాడుతుంటే.. ఈస్ట్ ఇండియా కంపెనీ 200 ఏండ్ల కింద అడవుల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఆదివాసీలకు రాజ్యాంగంలోని షెడ్యూల్‍ 5లో ఇచ్చిన హామీతో పాటు పీసా చట్టం అమలు ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘించడం సరికాదన్నారు. మావోయిస్ట్ పార్టీలు శాంతి చర్చలకు సిద్ధమని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాభిప్రాయం మేరకు చర్చలకు కేంద్రప్రభుత్వం మానవీయంగా ముందుకురావాలన్నారు. శాంతి చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా పరిష్కరించుకోవాలని కోరారు.  

కేంద్ర బలగాలు గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు 480 మందిని మావోయిస్టుల పేరుతో ఎన్‍కౌంటర్లలో కాల్చిచంపగా అందులో 350 మంది ఆదివాసీలున్నట్లు పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్​తెలిపారు. ఇందులోనూ 150 మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు పేర్కొన్నారు. చత్తీస్‍గఢ్​ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని.. మావోయిస్ట్ పార్టీ ముందుకురావాలని చెప్పిందని గుర్తుచేశారు.  

చత్తీస్‍గఢ్‍ సర్కార్‍, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే మావోయిస్టులతో శాంతి చర్చలకు ముందుకురావాలని డిమాండ్‍ చేశారు. సమావేశంలో భారత్‍ బచావో నేత గోపినాథ్‍ ప్రజా సంఘాల నేతలు ప్రొఫెసర్‍ కాత్యాయని, రమేశ్‍ చందర్‍, రవిచందర్‍, తిరుపతయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.