- సుప్రీం కోర్టుకు కేంద్రం అఫిడవిట్
- దీన్ని నేరంగా చూస్తే వివాహ వ్యవస్థే నాశనమైతది
- ఇదొక సామాజిక సమస్య అని అభిప్రాయం
న్యూఢిల్లీ: మ్యారిటల్ రేప్ ను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాన్ని నేరంగా పరిగణిస్తే వివాహ వ్యవస్థే నాశనమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మ్యారిటల్ రేప్ ను నేరంగా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్లపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసింది. మ్యారిటల్ రేప్ అనేది సోషల్ ఇష్యూ అని, ఇది సమాజంపై నేరుగా ప్రభావం చూపుతుందని పేర్కొంది. ‘‘ఇది సుప్రీంకోర్టు పరిధిలోని అంశం కాదు. దీనిపై అన్ని వర్గాలతోనూ చర్చించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది” అని కేంద్రం తెలిపింది.
ఇప్పటికే చట్టాలున్నయ్..
మహిళల గౌరవం, స్వేచ్ఛ, హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం అఫిడవిట్ లో పేర్కొంది. ‘‘భార్యతో భర్త బలవంతంగా సెక్స్ చేయడానికి, అత్యాచారానికి చాలా తేడా ఉంది. భర్త తన భార్య నుంచి తరచూ సెక్సువల్ రిలేషన్ కోరుకోవచ్చు. కానీ అది ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఉండకూడదు. ఒకవేళ ఇలాంటివి జరిగినప్పుడు.. దానికి పరిష్కారంగా ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్, క్రూయల్టీ టు విమెన్ వంటివి అందులో భాగమే. వీటిని కాదని.. భార్యతో బలవంతంగా సెక్స్ చేసినందుకు అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్షించడం సరైంది కాదు” అని కేంద్రం తెలిపింది.