క్యాన్సర్ వైద్యంపై కేంద్రం శ్రద్ధ పెరగాలి

క్యాన్సర్ వైద్యంపై కేంద్రం శ్రద్ధ పెరగాలి

మనుషులలో క్యాన్సర్‌‌‌‌ను కలగజేసే పదార్థాలను కార్సినోజెన్స్ అంటారు.  నిపుణులు 100 కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలను గుర్తించారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు, ఆస్బెస్టాస్, వందల కొద్దీ రసాయనాలు, కలుషిత వాయువులు, కొన్ని వైరస్‌‌‌‌ల వల్ల వచ్చే ఇన్‌‌‌‌ఫెక్షన్లు వంటి జీవసంబంధమైనవి కూడా ఇందులో ఉన్నాయి. అయితే, కార్సినోజెన్‌‌‌‌  ముట్టుకోవడం లేదా దగ్గరికి రావడం వల్ల క్యాన్సర్‌‌‌‌ రాకపోవచ్చు. ఒక అమెరికన్ ప్రభుత్వ నివేదికదాదాపు 256 క్యాన్సర్ కారకాల జాబితా తయారు చేసింది. 

ఇందులో  రసాయన, భౌతిక, జీవసంబంధ కారకాలు, మిశ్రమాలు, వాతావరణ పరిస్థితులు వగైరా మానవులలో క్యాన్సర్‌‌‌‌కు కారణమవుతాయని భావిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) మానవులలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే పదార్థాలపై, కారణాలపై శాస్త్రీయ నివేదికలను రూపొందిస్తుంది. 1971 నుంచి ఈ సంస్థ 1,000 కంటే ఎక్కువ క్యాన్సర్ కారక పదార్థాలు, కారణాలను, పరిస్థితులను పరీక్షించింది. వీటిలో రసాయనాలు, సంక్లిష్ట  రసాయన మిశ్రమాలు, భౌతిక పదార్థాలు,  సూక్ష్మజీవాలు, పని ప్రదేశంలో పరిస్థితులు, జీవనశైలి ఉన్నాయి.

జీవనశైలి మారాలి

భారతదేశంలో  పురుషుల కంటే మహిళలే  ఎక్కువ మంది క్యాన్సర్‌‌‌‌తో బాధపడుతున్నారు. సుమారు 1,82,000 రొమ్ము క్యాన్సర్ కేసులు ఉన్నాయి. ఇవి 2030 నాటికి 2.5 లక్షలకు పెరుగుతాయని అంచనా.  క్యాన్సర్ కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆహారంలో కీటకనాశక రసాయనాలు. వేగంగా పట్టణీకరణ, అనారోగ్య జీవనశైలి, వస్త్రధారణ, జల కాలుష్యం, ఇంట్లో బయట వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వస్తువుల వాడకం, కలుషిత ఆహారం మొదలైనవి క్యాన్సర్ కారణాలు. ఈ మధ్య కొత్తగా కరోనా టీకాల వల్ల టర్బో క్యాన్సర్లు కూడా వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 

క్యాన్సర్ వలన రూ.1,10,000 కోట్ల ఆర్థికభారం

అంతర్జాతీయ పరిశోధనలు వెయ్యికి పైగా క్యాన్సర్ కారకాలు గుర్తిస్తే  భారతదేశంలో ఇప్పటికీ తంబాకు (tobacco) వలన మాత్రమే వస్తున్నట్టు  ప్రభుత్వం, వైద్యులు, ఆసుపత్రులు భావించడం శోచనీయం. మభ్యపెట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాన్సర్ వలన రూ.1,10,000 కోట్ల ఆర్థిక భారం దేశం మీద పడుతుంది అని ఒక అంచనా.  కరోనా మహమ్మారి దరిమిలా క్యాన్సర్  స్క్రీనింగ్, రోగ నిర్ధారణ, చికిత్సలో ఆలస్యం వంటి పరిణామాలు ఏర్పడ్డాయి.  ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కరోనాకు ఇచ్చిన ప్రాధాన్యత క్యాన్సర్​కు అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. భారతదేశం నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, క్యాన్సర్ కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే, క్యాన్సర్ నిర్ధారణ చాలా ఆలస్యంగా జరుగుతోంది అని నిపుణులు అంటున్నారు. తత్ఫలితంగా మరణాల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. కోలుకునే రేట్లు తక్కువగా ఉన్నాయి. సరైన చికిత్స లేక ఖరీదైన మందులు వాడలేక, సరైన సేవలు అందకా కూడా క్యాన్సర్ రోగుల మరణాలు ఎక్కువ అవుతున్నాయి. క్యాన్సర్ పట్ల సర్వత్ర అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  

సంప్రదాయ వైద్య  పద్ధతులవైపు మొగ్గు

 క్యాన్సర్ వస్తే సంబంధిత శరీర భాగం తీసివేయడం అల్లోపతి చికిత్స విధానంలో మొదటి అడుగుగా చాలామంది భావి స్తున్నారు. ఆ తరువాత తీసివేసిన భాగంలో మళ్లీ క్యాన్సర్ కణాలు పెరగకుండా రకరకాలుగా కణాలను మాడుస్తారు.  అయితే, ఈ ప్రక్రియ క్యాన్సర్ నివారిస్తుందా, పెంచుతుందా అనే అనుమానం కూడా ఉన్నది.  కీమోథెరపి వల్ల శరీరం మీద చూపే  తీవ్ర దుష్ప్రభావాల గురించిన అవగాహన లేకపోవడం  క్యాన్సర్ పట్ల భయానికి నాంది అయ్యింది. క్యాన్సర్ నుంచి విముక్తులు అయిన వ్యక్తులు మళ్లీ సాధారణ జీవితం గడుపుతారు అని కూడా చెప్పడానికి వీలులేదు. పూర్వ, ఉత్తేజిత జీవనశైలి తిరిగి పొందడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.  

భారంగా మారిన చికిత్స

దేశంలో  కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్​ను తొందరగా గుర్తించడం, సమస్య తీవ్రతను తగ్గించడం, వ్యాధి నిర్వహణ గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నది. ప్రైవేటు ఆసుపత్రులకు క్యాన్సర్ కేసులు కాసులు కురిపించే కామధేనువుగా మారింది.  చికిత్సకు వసూలు చేస్తున్న చార్జీలు ఇష్టానుసారంగా ఉంటున్నాయి. సంప్రదాయ వైద్య పద్ధతులు అయిన హోమియో, ఆయుర్వేద, యునాని వంటి వైపు మళ్లుతున్నారు. తృణధాన్యాలు తింటే క్యాన్సర్ తగ్గుతున్నది అని బలంగా భావించి ఆ వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. 

క్యాన్సర్  కారకాలుగా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్​

భారత్​లో  ప్రధానంగా క్యాన్సర్ వ్యాపింపజేసే పరిస్థితి వ్యవసాయంలో ఇష్టారీతిన వాడుతున్న క్రిమికీటక నాశక మందులు (pesticides), రసాయన ఎరువులు ( fertilisers) నుంచి వస్తున్నది.  పట్టణాలలో గాలి కాలుష్యం (వాహనాల పొగ, దుమ్ము, ధూళి), ఆహారం, కలుషిత నీళ్ళ వల్ల వస్తున్నది.  కొన్ని ప్రాంతాలలో పారిశ్రామిక వ్యర్థాలు (ఘన, గాలి, నీటి) క్యాన్సర్  కారణమవుతున్నాయి. అమెరికా తదితర దేశాలలో కరోనా మహమ్మారి నివారణకు ఉపయోగించిన టీకాలు (వ్యాక్సిన్లు) వల్ల కూడా క్యాన్సర్ వస్తున్నది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

పిల్లల్లోనూ..

ఈ మధ్య పిల్లల క్యాన్సర్ కేసులు పెరిగినాయి. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 75,000 పిల్లలకు క్యాన్సర్‌‌‌‌ నిర్ధారణ అవుతున్నది. ఈ సంఖ్య ప్రపంచ బాల్య క్యాన్సర్ సంఖ్యలో కనీసం 20 శాతం. భారతదేశంలో చిన్ననాటి క్యాన్సర్‌‌‌‌లలో అత్యంత సాధారణ రకాలు లుకేమియా, మెదడు క్యాన్సర్‌‌‌‌లు, లింఫోమాలు, న్యూరోబ్లాస్టోమాస్, ట్యూమర్‌‌‌‌లు (ఘన కణితులు). ఇండియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ ప్రకారం భారతదేశంలో క్యాన్సర్‌‌‌‌తో బాధపడుతున్న 40 శాతం పిల్లలు ఇప్పటికే రోగ నిర్ధారణలో పోషకాహార లోపంతో ఉన్నారు.

మూడో స్థానంలో భారత్

2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షిక కేసుల నమోదులో వరుసగా చైనా, అమెరికా దేశం తరువాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది.  కేరళ, మిజోరం, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, అస్సాం రాష్ట్రాలలో అత్యధికంగా క్యాన్సర్ రేట్లు (లక్ష జనాభాకు  130 కంటే ఎక్కువ కేసులు) ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వం మూడు అత్యంత సాధారణ రకాలైన - నోటి, రొమ్ము, గర్భాశయ  క్యాన్సర్లపైనే దృష్టి పెట్టింది. మిగతావి పట్టించుకోవడం లేదు. 19 రాష్ట్ర క్యాన్సర్ సంస్థలు (SCI), 20 తృతీయ సంరక్షణ క్యాన్సర్ కేంద్రాలను (TCCCలు) ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది. కానీ, నివారణ మీద పెట్టుబడులు లేవు. నిధులు లేవు. ఆలోచన లేదు. క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? కారణాలు ఏమిటి? గ్రామీణ భారతంలో కూడా క్యాన్సర్ పెరగడానికి తగిన అధ్యయనాలు లేవు. 

పరిష్కారాలు

క్యాన్సర్ ఆధునిక అభివృద్ధి అనే హాలాహలం నుంచి పుట్టింది.  క్యాన్సర్ నివారణ ఒకే నిషేధం వలన సాధ్యం కాదు.  జీవనశైలి, ఆహారం, పారిశ్రామిక అభివృద్ధి, రవాణా, ప్రయాణం వంటి వాతావరణంలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవనశైలిలో,  ఆహారంలో,  తాగే నీటిలో,  పీల్చే గాలిలో  మార్పులు తీసుకువస్తే ఫలితాలుంటాయి. ప్రభుత్వం వీటిలో మార్పులు తేవాలంటే తీవ్ర కృషి అవసరం. అయితే క్యాన్సర్ తీవ్రతను, క్యాన్సర్ వచ్చి చిధ్రమవుతున్న బతుకుల గురించి మన ప్రభుత్వాలకు పట్టడం లేదు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రోగం గురించి ఫలానా కార్యక్రమం చెయ్యమంటేనే  చేసే దశకు మన నాయకులు చేరుకున్నారు. ఆహారంలో, ఉత్పత్తిలో, తినడంలో, తీవ్ర తక్షణ మార్పులు అవసరం.  ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఆహారం శరీరానికి బలం ఇస్తుంది. క్యాన్సర్​తోపాటు అనేక రోగాలను నివారించే శక్తి కూడా వస్తుంది. స్వచ్ఛమైన గాలి ఉండే వాతావరణం సృష్టించుకోవడం కూడా చాలా ముఖ్యం.  అడవులు, పచ్చదనం ఉండే ప్రాంతాల విస్తీర్ణం పెరగాలి.  నివాస ప్రాంతాల డిజైన్ మార్చుకోవాలి. నీటి కాలుష్యం తగ్గించే ఉపాయాలు అమలుచెయ్యాలి.  గాలి, నీరు, ఆహారం పట్ల జాగ్రత్తలు  తీసుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు.  క్యాన్సర్ నివారించవచ్చు.

- డా. దొంతి నరసింహారెడ్డి