జాతీయ స్థాయిలో ‘మార్పు’ మాటల మతలబ్​ ఏంటి?

‘మార్పు’ ఎంత ప్రకృతి ధర్మమైనా.. ఇద్దరు ముఖ్య నాయకులు ‘మార్పు ఖాయం’ అని వేర్వేరు వేదికల నుంచి ఒకే రోజు చెప్పడం విశేషం. తెలంగాణలో(2023) అధికార మార్పునకు ప్రజలు మానసికంగా నిర్ణయించేశారని, ఫలం అందుకునేందుకు బీజేపీ సిద్ధమౌతోందని ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్​కు వచ్చి మరీ చెప్పారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన సీఎం కేసీఆర్.. ‘జాతీయ స్థాయిలో మార్పు తథ్యం, దాన్నెవరూ అడ్డుకోలేరు’అని మీడియాతో చెప్పారు. అసలీ మార్పులు జరుగుతాయా? జరిగితే, నిజంగా సగటు మనిషి జీవనగతి ఏమైనా మారుతుందా? వారు చెప్పేవి ‘ఏ మార్పుల’కు సంకేతాలో.. కాలమే తేల్చాలి! కానీ, ఈ లోపు, సదరు మార్పుల సాధ్యాసాధ్యాలపై చర్చ సహజం. ఇప్పుడదే జరుగుతోంది. 

ఒకందుకని కాదు, చాలా విషయాల్లో దివంగత నేత, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను యాది చేసుకోవాలె. ఆయన పుట్టిన రోజైన ఇయ్యాల్టి నుంచే తెలుగునాట శత జయంతి వేడుకలు మొదలు. తెలుగుదేశం పార్టీని నెలకొల్పి, రికార్డు టైమ్​లో ప్రభుత్వం ఏర్పరచిన ఆయన ఒక దశలో జాతీయ రాజకీయాల గురించీ ఆలోచించారు. ఆ నమూనాతోనే ‘భారతదేశం’ పార్టీ పెట్టాలని ప్రయత్నించినా ఎందుకో  నెరవేరలే! అయినా,1989–91లో మనుగడ సాగించిన ‘నేషనల్ ఫ్రంట్’కు ఆయనే నేతృత్వం వహించారు. 1996–98 కాలపు ‘యునైటెడ్ ఫ్రంట్’కు జాతీయ కన్వీనర్​గా ఆయన అల్లుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరించారు. నిన్నగాక మొన్న.. 2019 సాధారణ ఎన్నికల ముంగిట్లో పుట్టి, పురిట్లోనే సంధికొట్టిన ‘ఫెడరల్ ఫ్రంట్’ యోచన వెనుక కేసీఆర్ కీలక వ్యక్తి. కాలధర్మాన్ని, అవసరాన్ని బట్టి దేశంలో ఇలా పలు ఫ్రంట్లు పుట్టుకు వచ్చాయ్! అంతే వేగంగా కనుమరుగయ్యాయి. ‘ఫ్రంట్’ మాట వాడకపోయినా.. లోక్​నాయక్  జయప్రకాశ్ నారాయణ పిలుపు మేరకు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వివిధ పార్టీలు ఒక్కటై, గెలుపుతో చరిత్ర సృష్టించిన ‘జనతాపార్టీ’ది కూడా అల్పాయుష్షే! తర్వాతి ఎన్నికల్లో ఓడినంక అది చీలికలు పీలికలైంది. ‘భారతదేశం’ నుంచి ‘భారత రాష్ట్ర సమితి’ వరకు ‘ప్రత్యామ్నాయాలు’ అన్నీ అయితే కేవలం ఆలోచనలు, లేకుంటే ప్రయోగాలు! అందుకేనేమో.. మొదట్లో కాస్త ఉత్సాహం చూపినా, ‘ఫ్రంట్’ అనే మాటను కేసీఆర్ తర్వాతి రోజుల్లో పక్కన పడేశారు. ఒక దశలో ‘ఫ్రంట్ లేదు గ్రింట్ లేదు.. ప్రత్యామ్నాయ రాజకీయ  వ్యవస్థ కోసం, మాదొక ఉమ్మడి ప్రయత్నం, అంతే’ అని కూడా వివరించారు. 

మూణ్నెల్లలో.. ఏంటా సంచలనం?

చూస్తూ ఉండండి, రెండు మూడు నెలల్లో సంచలన ప్రకటన ఉంటుందని వారంలో కేసీఆర్ రెండు సార్లు చెప్పారు. ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్(పంజాబ్ సీఎం), అఖిలేశ్ యాదవ్(ఎస్పీ) లతో భేటీ తర్వాత తొలిసారి ఈ ప్రకటన చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ,  కుమారస్వామిలతో తాజా భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన దాన్ని బట్టి,  పేరు స్వరూపం ఏదైనా.. రాబోయేది దేశంలోని ప్రధాన స్రవంతి పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​లకు, వాటి కూటములకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ వేదిక అనేది లీలామాత్రంగా తెలుస్తోంది. సంచలనం అని పదే పదే చెబుతుండటాన్ని బట్టి దాని కూర్పు,  స్వరూపం, స్వభావం భిన్నంగా ఉండొచ్చేమో! తానే నేతృత్వం వహించేలా పలువురి సయోధ్యతో కేసీఆర్ జాతీయ పార్టీ ఏదైనా నెలకొల్పుతారేమోననే ఊహాగానాలూ సాగుతున్నాయి. ‘భారత రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్ లాగే బీఆర్ఎస్) అని పార్టీ వర్గాలు ఇదివరకే ప్రచారంలో పెట్టాయి. కలిసివచ్చే కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల కూటమిగానో, ప్రత్యేక పార్టీగానో ఆయన రావచ్చేమో అన్నది ఒక అనుమానం. అందులో రాజకీయ నాయకులే కాకుండా ప్రశాంత్ కిషోర్ (పీకే) వంటి ఎన్నికల వ్యూహకర్తలు, రిటైర్డ్ సివిల్​సర్వెంట్లు, అధికారులు, జర్నలిస్టులు ఇతర అకడమీషియన్లు ఉంటారా? పీకే, కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ సయ్యద్ మసూద్ హుస్సేన్ ,  సీనియర్ జర్నలిస్టు ప్రణయ్​రాయ్(ఎన్డీటీవీ) తదితరులతో కేసీఆర్ ఇటీవలి భేటీలు ఈ అనుమానాన్ని బలపరిచేవిగా ఉన్నాయి. కేసీఆర్ ఊరకే ఉండరు. కొంత కాలంగా ఆయన అనుసరిస్తున్న వ్యూహాత్మక మౌనం వెనుక, ఏదో కృషి లోలోపల జరుగుతోందనేది ఆయననెరిగిన వారి సందేహం. తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్​కు బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏదో అంతర్గత అవగాహన ఉంది, వారిది ‘లాలూచీ పోరు’ అనేది ఇంతకాలం పలువురు నమ్ముతూ వచ్చారు. ‘టీఆర్ఎస్​తో మనకే ఇబ్బందీ లేదు, తెలంగాణలో కాంగ్రెస్​ను ఎదగనీయకుండా కట్టడి చేస్తే చాల’నే భావనతో బీజేపీ ఉంటుంది, కనుక ఈ సూత్రీకరణ నిజమేనేమో! అనుకున్న వారూ ఉన్నారు. కానీ, 2019లో 4 ఎంపీ స్థానాలు, తర్వాత రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు గెలిచి, హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో బాగా స్కోర్ చేశాక బీజేపీకి రాష్ట్రంలో ఆశలు పెరగటంలో ఆశ్చర్యం లేదు. ఆర్ఎస్ఎస్ దన్ను ఉండనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిందని నమ్ముతున్న బీజేపీ, వారిని దెబ్బకొట్టి రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు ఇదే తగిన సమయమని భావిస్తోంది. ప్రత్యక్ష విమర్శలతో ఎయిర్​ఫోర్ట్ సభలో మోడీ స్వరం పెంచిన తీరే వారి పోరాట వైఖరికి నిదర్శనం. తగినంత ముందుగానే ఇది గ్రహించిన కేసీఆర్ వ్యూహాల్లో తలమునకలవుతున్నారు.

మోడీ చెప్పిన మార్పూ అంత తేలిక్కాదు!

రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలంటే బీజేపీ అసాధారణ ఎదుగుదల నమోదు చేయాలి. మరెన్నో రెట్లు క్రియాశీలం కావాలి. దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక తర్వాత బీజేపీ బలంగా ఉన్నది తెలంగాణలోనే! దానికి తోడు ఆర్ఎస్ఎస్ బేస్ కూడా ఇక్కడ బాగుంది. కానీ, ఎన్నికల ఫలితాలు పార్టీ పెద్దగా రుచి చూస్తున్నది ఇటీవలే! నిజానికి ఢిల్లీ నాయకత్వానికి ఉన్నంత పట్టుదల, శ్రద్ధ స్థానిక నాయకత్వానికి లేక పలుమార్లు మాటపడాల్సి వచ్చింది. ‘రాష్ట్ర విభాగం, మా వేగం అందుకోలేకపోతోంది’ అని జాతీయ నాయకులన్న సందర్భాలున్నాయి. మోడీ ప్రసంగ దాటికి, బేగంపేట విమానాశ్రయ సభకు జరిపిన జనసమీకరణకు పొంతనే లేదు. ఈ వైఫల్యాన్ని కేంద్ర నాయకత్వం గుర్తించింది, స్థానిక నాయకత్వం సర్ది చెప్పింది. పార్టీ విస్తరణ సరిగా లేదు. విపక్షంగా ఉన్నపుడు, సంస్థాగత ఎదుగుదలకు దోహదపడేలా పార్టీ శ్రేణులకు కార్యక్రమాలు ఇవ్వటంలో విఫలమౌతున్నారు. ప్రతి జనావాసంలోనూ ఉనికి ఉన్న పార్టీ అయినా, రాష్ట్రం ఏర్పడ్డాక చతికిలపడ్డ కాంగ్రెస్ కోలుకోలేకపోతున్న పరిస్థితిని బీజేపీ సానుకూలంగా మలచుకోవాలని పార్టీ శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు సూచిస్తున్నారు. 
పార్టీ రాష్ట్ర అధినేత సంజయ్ పాదయాత్రతో కొంత కదలిక వచ్చిందనే అభిప్రాయం ఉంది. పార్టీలో వన్–టూ–త్రీ  అనదగ్గ మోడీ, అమిత్​షా, జేపీ నడ్డా... ముగ్గురూ ఒక నెలలోనే రాష్ట్రానికి  వచ్చి, పెద్ద సభల్లో ప్రసంగాలు చేయడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊపు ఇలాగే కొనసాగిస్తే, ఎన్నికల నాటికి పార్టీ బలోపేతమయ్యే ఆస్కారం ఉంటుంది. అటువంటిదేదో జరిగితేనే, ప్రధాని మోడీ ఉత్సాహంగా ప్రకటించిన ‘మార్పు’ సాధ్యపడవచ్చని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య!

స్పందన పొందడమెలా...?

బీజేపీని దీటుగా ఎదుర్కోవడం ఇపుడు కేసీఆర్ ముందున్న కర్తవ్యం. దేశవ్యాప్తంగా కూటమి కట్టే సన్నాహాలు నాలుగేండ్ల కిందే మొదలెట్టారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్​లను వ్యతిరేకించే రాజకీయ శక్తుల నుంచి ఆశించిన స్థాయి స్పందన లభించకపోవడం ఆయనను కలవరపరుస్తోంది. అయినా అలుపెరుగకుండా కోల్​కత, రాంచీ, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, ముంబై, చెన్నై.. ఇలా కాలికి బలపం కట్టుకు తిరుగుతూనే ఉన్నారు. వేర్వేరు కారణాలున్నాయి. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం మీద కోపమున్నా.. కొందరు బీజేపీతో, అదీ మోడీతో వైరానికి సిద్దంగా లేరు. ప్రత్యామ్నాయ శిబిరానికి నేతృత్వం విషయంలో కొందరికి అభ్యంతరాలు, తమ చేతిలోనే పగ్గాలుండాలని ఇంకొందరిది నాయకత్వ ఆశ. మరికొన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్​కు వ్యతిరేకంగా జట్టు కట్టలేరు. వీటన్నిటికీ తోడు..ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం ఒక పెద్ద సమస్య! కూటమి రాజకీయాల్లో, అలంకారపు పదవుల్లో ఓకే అంటారు తప్ప, అధికార హోదాల్లో దక్షిణాది ఆధిపత్యానికి ఉత్తరాది పార్టీలు ససేమిరా అంటాయి. పార్టీలే కాదు, నేతలు, కార్పొరేట్లు, లాబీలు, మీడియా కూడా అంతవరకు మోసి, అధికారం పంచుకునే సమయం రాగానే.. అమాంతం వదిలేస్తారు. ఎన్టీఆర్, చంద్రబాబు విషయంలో  జరిగిందదే! ‘ఊ’ అంటే మనవాళ్లు ఢిల్లీలో ‘చక్రం తిప్పడం, మీడియాలో రాయించుకోవడం..  అదంతా ఉట్టిదే! 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్ని రాష్ట్రాలు తిరిగారు! మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, గుజ్రాల్ ఇలా ఎందరెందరినో ఏపీకి, తనకు అనుకూల ప్రచారానికి తీసుకువచ్చారు. ఎంతగా బతిమాలించుకొని, ఎంత అయిష్టంగా వారు వచ్చారో, టీడీపీ  వ్యూహకర్తను అడిగితే చెబుతారు.

- దిలీప్ రెడ్డి

dileepreddy.r@v6velugu.com