భారతదేశంలో విద్యావ్యాప్తికి 1813 చార్టర్ చట్టం ప్రకారం మొదటిసారిగా లక్ష రూపాయలను కేటాయించింది. 1835లో భారత్‌లో ఇంగ్లీష్ భాషను భాషా మాధ్యమంగా ప్రకటించారు. 1835లోనే మెకాలే విద్యకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. దీనికే మెకాలే మినిట్ అనే పేరు. దీని ప్రకారం ఆంగ్ల మాధ్యమం అధికారికంగా గుర్తించబడింది. ఆ తర్వాత 1844లో ఈస్టిండియా కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. తప్పనిసరిగా ఆంగ్ల భాషా పరిజ్ఞానం కలిగి ఉండాలని హార్డింజ్ ప్రకటించారు. బొంబాయి, మద్రాస్, బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల్లో 1855లో ప్రత్యేక విద్యా విభాగాల ఏర్పాటయ్యాయి. విద్యారంగంలో ఉన్నత పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి 1897లో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసు ఏర్పడింది.
అధోముఖగాలన సిద్ధాంతం: బ్రిటిష్ వారి ఆధునిక విద్య ఉన్నత, మధ్య తరగతికి చెందిన కొద్దిమందికి మాత్రమే పరిమితమని, ఈ విద్య పొందిన వీరు మిగతా ప్రజలను ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రజలను విద్యావంతులను చేయాలని ప్రతిపాదించిందే ఈ సిద్ధాంతం.
ఆడమ్స్ రిపోర్ట్: 1835లో విలియం బెంటింక్ బెంగాల్, బిహార్ ప్రాంతాల్ల విద్య స్థితిగతులను సర్వేచేసి నివేదిక సమర్పించాలని విలియం ఆడమ్స్ కోరారు. ఈ విషయమై మూడు నివేదికల రూపంలో ఆడమ్స్ నివేదిక సమర్పించారు.
ఉడ్స్ డిస్పాచ్: ఈ డ్రాప్ట్‌ను 1835లో ఎడ్యుకేషన్ బోర్డుకు అధ్యక్షుడైన చార్లెస్ ఉడ్ రూపొందించగా 1854 జులై 19న భారత్‌కు వచ్చింది. దీన్నే మాగ్నాకార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఇంటలెక్చువల్ చార్టర్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఇది విద్య అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతిపాదించింది. ఉడ్స్ డిస్పాచ్ ప్రకారం విద్య లక్ష్యం సంప్రదాయ భారతీయ విద్యా విధానంలో శాస్త్రీయతను, హేతువాదాన్ని జోడించడమే. ఇది అధోముఖ గాలన సిద్ధాంతాన్ని తిరస్కరించింది. ప్రాథమిక, స్త్రీ, వృత్తి విద్యలు, సాంకేతిక విద్యల గురించి కూడా ప్రస్తావిస్తూ విద్యావిధానపరంగా విప్లవాత్మకమైన మార్పులను ప్రతిపాదించింది.
థామస్ ర్యాలీ కమిషన్: థామస్ ర్యాలీ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడు. లార్డ్ కర్జన్ 1902లో థామస్ ర్యాలీ చైర్మన్‌గా కమిషన్ ఏర్పాటు చేశాడు. ఒకే ఒక భారతీయ సభ్యుడిగా సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి ఉన్నాడు. దీనిని యూనివర్సిటీ విద్యావిధానాన్ని సమీక్షించడానికి ఏర్పాటు చేశారు. విద్యాలయాలు ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేయాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ సిఫారసు మేరకు 1904 విశ్వవిద్యాలయ చట్టాన్ని చేశారు.
సాండ్లర్ కమిటీ: డిగ్రీ స్థాయిలో డిగ్రీ కోర్సు కాలపరిమితిని మూడేండ్లుగా నిర్ణయించింది.
హర్టోగ్ కమిటీ: పాఠశాల విద్య, ఉన్నత విద్యకు ప్రత్యేకంగా బోర్డులు ఉండాలని ప్రతిపాదించింది.
సఫ్రూ కమిటీ: వృత్తి విద్య ప్రాముఖ్యతను తెలియజేసింది.
వార్ధా విద్యావిధానం: భారతదేశంలో ఎలాంటి విద్యావిధానం ఉండాలో అనే అంశాలను హరిజన్, యంగ్ ఇండియా పత్రికల్లో మహాత్మాగాంధీ వ్యాసరూపంగా తెలియజేశాడు. ఇది గాంధీజీ భావాలకు అనుగుణంగా రూపొందించిన విద్యావిధానం. ఈ విద్యావిధానం సహ జీవనానికి, సాంఘిక సమతుల్యత, వృత్తివిద్య, విలువలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ విద్యా విధానానికి మరో పేరు నయీతాలీమ్. దీనిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన వార్ధా సమావేశానికి జాకీర్ హుస్సేన్ అధ్యక్షత వహించాడు.
సార్జంట్ కమిషన్: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ తరహా విద్యావిధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధిపరచాలని సూచించింది. 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల ద్వారా మొదటిసారిగా విద్య భారతీయుల ఆధీనంలోకి వచ్చింది.
సివిల్ సర్వీసెస్ సంస్కరణలు
మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకులు సివిల్ సర్వెంట్స్‌గా పిలువబడ్డారు. 1772లో వారెన్ హేస్టింగ్స్ సివిల్ సర్వీసెస్ వ్యవస్థకు పునాదులు వేశాడు. సివిల్ సర్వీసెస్ వ్యవస్థను ఆధునికీకరించి అందులో సంస్కరణకు కారణమైనందున కారన్వాలీస్ను సివిల్ సర్వీస్ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తారు. 1806 నుంచి వాస్తవంగా సివిల్ సర్వీస్ ఉద్యోగులకు లండన్‌లోని హైలీబరీలోని ఈస్టిండియా కళాశాలల్లో రెండేండ్లు శిక్షణ ఇచ్చేవారు. పోటీపరీక్షను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పర్యవేక్షణలో మొదటగా 1854 నుంచి నిర్వహించడమైంది. 1858 నుంచి హైలీబరీలోని ఈస్టిండియా కళాశాల స్థానంలో పరీక్షల శిక్షణ సివిల్ సర్వీస్ కమిషనర్ల చేతిలోకి వెళ్లాయి.
అచిన్సన్ కమిషన్: సివిల్ సర్వీసు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వైశ్రాయ్ లార్డ్ డఫ్రీన్ ఈ కమిటీని నియమించాడు. అచిన్ సన్ కమిటీ సిఫారసుల మేరకు ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు లండన్‌లో మాత్ర మే నిర్వహించారు. సివిల్ సర్వీస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 23 సంవత్సరాలుగా నిర్ణయించింది.
మాంట్‌ఫోర్డ్ సంస్కరణలు: సివిల్స్ పరీక్షలు ఇంగ్లాండ్, ఇండియాల్లో ఒకేసారి జరగాలి. 1/3 వంతు భర్తీ ప్రక్రియను ఇండియాలోనే నిర్వహించాలి.
లీ కమిషన్: వైశ్రాయ్ లార్డ్ రీడింగ్ కాలంలో ఈ కమిషన్ నియమించబడింది. దీనిప్రకారం సివిల్ సర్వీస్ నియామకాల్లో భారతీయులకు 50శాతం కేటాయించాలి. సివిల్ సర్వెంట్ల నియామకం కోసం ఒక స్వయం ప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగానే దేశంలో మొదటగా 1926 అక్టోబర్ 1న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీలో ఏర్పడింది. దీనికి మొదటి చైర్మన్‌గా రాస్ బార్కర్
నియామకమయ్యారు.
న్యాయ సంస్కరణలు
ఆధునిక భారతదేశంలో న్యాయవ్యవస్థ వారెన్ హేస్టింగ్స్ కాలం నుంచి అభివృద్ధి చెందింది.
గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌ల పాత్ర
వారెన్ హేస్టింగ్స్: భారతదేశంలో న్యాయవ్యవస్థపై శ్రద్ధచూపిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఈయన స్థానిక వివాదాల పరిష్కారానికి మున్సిఫ్ కోర్టులను ఏర్పాటు చేశాడు. జిల్లా స్థాయిలో సివిల్ కేసుల పరిష్కారానికి దివాని న్యాయస్థానాలను, క్రిమినల్ కేసుల పరిష్కారానికి నిజామత్ న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. కేంద్రస్థాయిలో సివిల్ కేసుల పరిష్కారానికి సదర్ దివానీ అదాలత్, క్రిమినల్ కేసుల పరిష్కారానికి సదర్ నిజామత్ అదాలత్‌లను ఏర్పాటు చేశారు.
కారన్‌వాలీస్: 1793లో లార్డ్ కారన్‌వాలీస్ కలెక్టర్ల చేతుల్లో కేంద్రీకృతమైన అధికారాలు చూసి అన్ని అధికారాలు కలెక్టర్ల వద్ద ఉండాల్సిన అవసరం లేదని భావించి మెజిస్టీరియల్ అధికారాలను తొలగించాడు. ఇతను ఆధునిక భారత న్యాయవ్యవస్థలో పలు సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగానే కారన్‌వాలీస్ కోడ్ అనే న్యాయ నియమావళిని ప్రవేశపెట్టాడు. పాట్నా, ఢాకా, ముర్షిదాబాద్, కలకత్తాల్లో నాలుగు సర్క్యూట్ కోర్టులు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా తీర్పులను భద్రపరిచే విధానం ప్రవేశపెట్టాడు.
విలియమ్ బెంటింక్: ఇతని కాలంలో 1833 చార్టర్ చట్టానికి అనుగుణంగా లార్డ్ మెకాలే (18 34) చైర్మన్‌గా మొదటి లా కమిషన్ ఏర్పడింది.
లార్డ్ కానింగ్: ఇతని కాలంలో 1859లో ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్, 1860లో ఇండియన్ పీనల్ కోడ్, 1861లో ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రవేశపెట్టారు.
లార్డ్ ఎల్జిన్: 1861లో వచ్చిన హైకోర్టుల చట్టం ప్రకారం ఇతను 1862లో మద్రాసు, కలకత్తా, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేశాడు.
సర్ జాన్ లారెన్స్: లార్డ్ ఎల్జిన్ కాలంలో ఏర్పాటు చేసిన హైకోర్టులను ఇతను 1865లో ప్రారంభించాడు. 1866లో అలహాబాద్‌లో ఒక హైకోర్టును ఏర్పాటు చేశాడు.
లార్డ్ రిప్పన్: సమన్యాయ పాలనకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వైశ్రాయ్ లార్డ్ రిప్పన్. ఇతను 1883లో ఇల్బర్ బిల్లు ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం యూరోపియన్స్ను భారతీయ మెజిస్ట్రేట్స్ క్రిమినల్ కేసులకు సంబంధించి విచారించవచ్చు. భారతదేశంలో బ్రిటిష్‌వారు పరిపాలనాపరంగా పలు సంస్కరణలను ప్రవేశపెట్టారు. అందులో విద్య, న్యాయ, సివిల్ సర్వీసెస్ సంస్కరణలు ముఖ్యమైనవి. విద్యా సంస్కరణల్లో భాగంగా పలు కమిటీలను ఏర్పాటు చేశారు. కొంతమంది గవర్నర్ జనరళ్లు, వైశ్రాయ్‌లు న్యాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ఐపీసీ, సీఆర్పీసీలను రూపొందించారు. సివిల్ సర్వీసెస్ వ్యవస్థను ఆధునికీకరించి అందులో సంస్కరణకు కారణమైనందున కారన్వాలీస్ను సివిల్ సర్వీస్ వ్యవస్థ పితామహుడిగా పిలుస్తారు.