విశ్లేషణ: నేతన్నలకు నిధులేవి?

నూతన సంస్కరణలు, పారిశ్రామిక విధానాల పరంపరలో పద్మశాలీలు, నేతన్నలు పూట గడవక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. చేనేతల బతుకులు మాత్రం మారడం లేదు. గత ప్రభుత్వాలు తెచ్చిన పథకాల్లో చాలా వాటిని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నవాటికి  కూడా సరిపోను నిధులు కేటాయిస్తలేదు. నేత కార్మికులకు 40 శాతం సబ్సిడీ అంటూ రాష్ట్ర సర్కారు తెచ్చిన చేనేత మిత్ర స్కీమ్ ఎక్కడా​ సరిగా అమలు కావడంలేదు. క్షేత్రస్థాయిలో నేతన్నలకు రాయితీ అందడం లేదు.

నేతన్నల కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నామని చెప్పుడే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం పట్ల చిత్త శుద్ధితో వ్యవహరించడం లేదు. ఈ ఏడాది బడ్జెట్​లో చేనేతకు ప్రభుత్వం రూ.467 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తంలో రూ. 400 కోట్లు బతుకమ్మ చీరల కోసమే కావడం గమనార్హం. చేనేత మిత్ర అనే పథకం ఉన్నప్పటికీ.. దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదు. ఈ పథకానికి గత ఆరు నెలలుగా 40 శాతం నూలు సబ్సిడీకి డబ్బులు మంజూరు చేయలేదు. ప్రస్తుత బడ్జెట్ లో దాదాపు రూ.40 కోట్ల వరకు అవసరం ఉన్నా.. ఎలాంటి కేటాయింపులు లేవు. సంబంధిత శాఖ మంత్రి ఎలాంటి కారణం వెల్లడించకుండానే నేతన్నకు చేయూత(త్రిఫ్ట్ ఫండ్) పథకాన్ని సంవత్సరం పాటు నిలిపివేశారు. హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా పద్మశాలీల ఓట్లను దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ పథకాన్ని అమలులోకి తెచ్చారు. నేతన్నలు, అనుబంధ కార్మికుల కోసం ఈ పథకం కింద సుమారుగా రూ.50 కోట్లు కేటాయించాల్సి ఉంది. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. పవర్‌‌‌‌‌‌‌‌లూమ్ కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకం అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. గత ఏడేండ్లుగా ఆ ముచ్చటనే పక్కకు పెట్టింది. పవర్​లూమ్​కార్మికులకు కూడా ఈ స్కీంను వర్తింప జేస్తే.. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్​అవసరం ఉంటుంది. 

టెస్కో బకాయిలు..

చేనేత మగ్గాల ఆధునికీకరణ కోసం వంద కోట్ల వరకు అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ స్థాయిలో కేటాయింపులు చేయలేదు. చేనేత వర్క్ షెడ్ పథకానికి సుమారుగా వంద నుంచి రెండు వందల కోట్లు కావాల్సి ఉంది. టెస్కో కొనుగోలు చేసిన వాటికి సంబంధించి వంద కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించేందుకు కూడా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు లేవు. 350 చేనేత సహకార సంఘాలకు గాను120 నుంచి 80 చేనేత సహకార సంఘాలు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నా, వాటిని అమ్మలేకపోతున్నారు. టెస్కో షోరూములు సుమారుగా తెలంగాణ వ్యాప్తంగా 30 నుంచి 40 వరకు ఉన్నాయి. వాటిని ఆధునీకరించి ఏసీ షోరూములుగా మార్చాల్సి ఉంది.  ప్రైవేటు, ప్రభుత్వ లేదా ఫ్రాంచైజీ​గా మార్చి చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. సంబంధిత శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని రూ. 500 కోట్ల వరకు కేటాయిస్తే అద్భుతమైన మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయి. చేనేత కార్మికులకు చేతి నిండా పని, వినియోగదారులకు చవక రేట్లకు వస్త్రాలు దొరుకుతాయి. 

నిల్వల కొనుగోలుకు హామీ లేదు..

చేనేత మగ్గాలకు ఏ రాష్ట్రంలో లేని విధంగా జియోట్యాగింగ్ విధానం తీసుకొచ్చినా.. 20 శాతం మగ్గాలకు ట్యాగింగ్​పూర్తయింది. ఇంకా 80 శాతం మగ్గాలకు చేయాల్సి ఉంది. పావలా వడ్డీ పథకం పేరుకే గానీ ఆచరణలో ఎక్కడా అమలు కావడం లేదు. చేనేత సహకార సంఘాలకు 2018లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ ఎలాంటి ఎలక్షన్స్​ లేవు. పద్మశాలి, నేతన్నల నుంచి మంచి నాయకత్వం రాకుండా కుట్ర జరుగుతోంది. చేనేత కార్పొరేషన్, పవర్​లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆ విషయమే మరిచిపోయింది. చేనేత నిల్వలను కొనుగోలు చేయాలని 70 రోజులు సమ్మె చేస్తే.. పోచంపల్లి, మునుగోడు ప్రాంత పద్మశాలీల, నేతన్నల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. వాటి కొనుగోలుకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. 

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో..

వస్త్ర ఉత్పత్తి రంగంలో చాలా సమస్యలున్నాయి. నూలు కొనుగోలు నుంచి బట్ట అమ్మకం వరకు పరిశ్రమ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంది. ఈ గుత్తాధిపత్యం కారణంగా కార్మికుల ఉపాధిపై ప్రభావం పడుతోంది. ప్రభుత్వం దాన్ని నియంత్రించడంతోపాటు నూలు డిపోలను ఏర్పాటు చేసి, వస్త్ర ఉత్పత్తికి అవసరమైన నూలు అందిస్తే ఆసాములకు, కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. కార్మికులందరికీ బీమా కల్పించడం, హెల్త్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇవ్వడం, కార్మికుల కుటుంబ సభ్యులకు గార్మెంట్‌‌‌‌‌‌‌‌ రంగంలో ఉపాధి కల్పించడం, వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. 

జీఎస్టీపై చిత్త శుద్ధి ఉందా..

ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దసరా, సంక్రాంతి లాంటి పండుగలకు 20 నుంచి 40 శాతం డిస్కౌంట్ తో ఆప్కో నుంచి ప్రతి ఉద్యోగితో కొనుగోలు చేయించేది. ఇప్పుడు ఆ స్కీమ్ ను ఎత్తేశారు. మంచి పథకాలను పక్కనపెట్టడంతోపాటు, ప్రభుత్వం చాలా వాటికి బడ్జెట్​లో సరిపోను నిధులు కేటాయించడం లేదు. చేనేత మంత్రిగా తన శాఖకు న్యాయం చేయాల్సింది పోయి 5 శాతం జీఎస్టీ గురించి కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఆ 5 శాతంలో నుంచి కూడా 2.5 శాతం జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోంది. తన వాటా 2.5 శాతం జీఎస్టీని ఎత్తివేసి చిత్తశుద్ధిని నిరూపించుకొని మిగతా 2.5 శాతం జీఎస్టీ రద్దు కోసం కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తే బాగుంటుంది. 

ధరల పెరుగుదలతో..

ముడి సరుకుల ధరలు పెరగడంతో రాష్ట్రంలోని నేతన్నలు పని దొరకక ఇబ్బందులు పడుతున్నారు. పట్టు చీరల తయారీ ఖర్చు బాగా పెరిగింది. పట్టు నూలు, రంగుల రేట్లు రెండింతలయ్యాయి. ఆరు నెలల క్రితం కిలో నూలు రూ.3 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.6,200 పలుకుతోంది. రాష్ట్రంలో పట్టుగూళ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో పాటు చైనా నుంచి దిగుమతి ఆగిపోయింది. నూలుతో పాటు రంగులు, వార్పు, జరి, సోడా, సబ్బులు, గ్యాస్‌‌‌‌‌‌‌‌ ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో రంగుల ధర రూ.600 ఉండగా, ఇప్పుడు రూ.వెయ్యి దాటింది. ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో చీరలు నేసినా గిట్టుబాటు కాక, గిరాకీ లేక నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. నేత కార్మికులను ఆదుకునే దిశగా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- దుస్సా యాదగిరి నేత, రాష్ట్ర అధ్యక్షులు, చేనేత, పద్మశాలి సంఘం