ఈ సృష్టిలో కొన్ని విషయాలు అసలెందుకు జరుగుతాయో ఎవరికీ అర్థం కావు. దాని వెనుక ఏదో బలమైన కారణముందని తెలిసినా.. అదేంటన్నది మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. మాంసాన్ని విక్రయించడానికి దాని యజమాని కోసిన కోడి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. కోడి తల లేకున్నా కూడా అది సజీవంగానే ఉంది. ఇది నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి. అందుకే వింత మరణం అప్పట్లో చర్చనీయాంశమైంది.
అమెరికాలోని కొలరాడోకి చెందిన లాయిడ్ ఒల్సెన్, క్లారా అనే జంట మాంసం అమ్ముతూ జీవనం సాగించేవారు. ఒకసారి అతను మాంసం కోసం మొత్తం 50 జంతువులను చంపాడు. కానీ వాటిలో ఒకటి ఇంకా సజీవంగా, చురుకుగా ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతను ఈ తల లేని కోడిని ఆ రోజు రాత్రి ఓ ఆపిల్ బాక్స్‌లో ఉంచాడు. ఆ తర్వాత అది ఖచ్చితంగా చనిపోతుందని వారు అనుకున్నారు. కానీ ఆ మరుసటి రోజు వారు పెట్టె ఓపెన్ చేసి చూసేసరికి అది ఇంకా బతికే ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ కోడి వారాలు కాదు.. మొత్తం 18 నెలల పాటు తల లేకుండా జీవించింది. చాలా మంది ఈ వింత కోడిని చూడటానికి వందల మైళ్ల నుండి వచ్చారు.
ఈ సంఘటన సెప్టెంబర్ 10, 1945న జరిగింది. దీని గురించి ఈ దంపతుల మునిమనవడు మాట్లాడుతూ.. ఆ సమయంలో లైఫ్ మ్యాగజైన్ కూడా ఈ తల లేని కోడిపై స్టోరీని రూపొందించిందని, దానికి మైక్ అని పేరు పెట్టారన్నాడన్నారు. ఒల్సేన్ దంపతులు కోడిని చూపించడానికి చాలా ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఈ టూర్ ద్వారా వారికి డబ్బు కూడా వచ్చేది. ఇలా మొత్తం 18 నెలల పాటు కొనసాగింది. చివరకు 1947లో అరిజోనా పర్యటనలో ఈ కోడి మరణించింది. అసలే తల లేకపోవడంతో భార్యాభర్తలు నేరుగా దానికి ఫుడ్‌పైప్ ద్వారా తినిపించేవారు. ఒకరోజు ఆహారం గొంతులో ఇరుక్కుపోయి కోడి చనిపోయింది. ఎన్నో నెలలపాటు తల లేకుండా బతికిన ఈ కోడి చరిత్రలో ఇదొక అపూర్వ సంఘటనగా నిలిచిపోయింది..