జమ్మికుంట, వెలుగు: దశాబ్దానికిపైగా కొనసాగుతున్న అనాథాశ్రమం రూల్స్ ప్రకారం లేదంటూ మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. వెంటనే స్పందించిన ఆఫీసర్లు, పోలీసులు అందులోని 26 మంది పిల్లల్ని తరలించేందుకు వచ్చారు. నిర్వాహకుడు, స్థానికులు ఎంతగా వేడుకున్నా… ఇక్కడి నుంచి వెళ్లమని పిల్లలు ఎడ్చినా వినకుండా బలవంతంగా తరలింపు మొదలుపెట్టారు. దీంతో నిర్వాహకుడు, మరో ఇద్దరు పిల్లలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పందన అనాథాశ్రమం కొత్తపల్లిలో 11 ఏండ్లుగా కొనసాగుతోంది. 26 మంది పిల్లలు ఇందులో ఉంటున్నారు. వీరస్వామి అనే వ్యక్తి దీన్ని నిర్వహిస్తున్నారు. అనాథాశ్రమం రూల్స్ ప్రకారం లేదంటూ దీన్ని మూసేయాలని కొద్దిరోజుల కింద కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జులై 8న అధికారుల వచ్చి మూసేయాలని ఒత్తిడి చేశారు. స్థానికులు, రాజకీయ నాయకులు అడ్డుకోవడంతో వారు వెళ్లిపోయారు.
శుక్రవారం ఐసీడీఎస్ సీడీపీవో పర్విన్ స్థానిక తహసీల్దార్ హరికృష్ణ, పోలీసులతో వచ్చి పిల్లల్ని బలవంతంగా చైల్డ్‌కేర్ సెంటర్‌కు తరలించడం ప్రారంభించారు. తమను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని మేం ఎక్కడికి వెళ్లమని పిల్లలు ఎంతగా ఏడ్చినా పట్టించుకోకుండా బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో వేశారు. ఆశ్రమ నిర్వాహకుడు, అతని భార్య ఆఫీసర్ల కాళ్లవేళ్ల పడి వేడుకున్నా వినిపించుకోలేదు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్ర స్వరంలో హెచ్చరించారు. దీంతో నిర్వాహకుడు, సాయి, సంతోష్ అనే ఇద్దరు పిల్లలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అనంతరం వీరస్వామి మాట్లాడుతూ రూల్స్ ప్రకారమే అనాథాశ్రమం నడిపిస్తున్నామన్నారు. కేవలం సొంత బిల్డింగ్ లేదనే సాకుతో కక్షపూరితం వ్యవహరించి మూసివేయించారన్నారు. ఆశ్రమంలోని అనాథ పిల్లలందర్ని పసివారుగా ఉన్నప్పుడే తీసుకొచ్చి సొంత బిడ్డల్లా పెంచామని వారికి ఇష్టం లేకున్నా అధికారులు బలవంతంగా తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.
childcare, center,closed,rules