పాస్‌పోర్ట్‌ స్కాంలో ముగ్గురు మహిళలు అరెస్ట్

పాస్‌పోర్ట్‌ స్కాంలో ముగ్గురు మహిళలు అరెస్ట్
  • చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న సీఐడీ

హైదరాబాద్‌, వెలుగు: ఫేక్​డాక్యుమెంట్లతో శ్రీలంకతోపాటు ఇతర దేశాలకు చెందిన వారికి భారత పౌరసత్వం కల్పించి పాస్‌పోర్టులు ఇప్పించిన ముగ్గురు మహిళలను సీఐడీ స్పెషల్‌ టీమ్‌ శనివారం అరెస్ట్ చేసింది. అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడ్డ 21 మంది శ్రీలంక దేశస్తులకు తమిళనాడుకు చెందిన మీడియేటర్​ప్రియాధర్మలింగంతోపాటు మరో ఇద్దరు మహిళలు ఫేక్‌ పాస్‌పోర్టులు అరేంజ్​చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ముగ్గురిని చెన్నై ఎయిర్​పోర్టులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. 

సీఐడీ చీఫ్‌ శిఖాగోయల్‌ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జహవరీ ఫేక్​ఆధార్, ఓటర్‌‌, రేషన్ కార్డులు, బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారుచేసి అముతున్నాడు. సమాచారం అందుకున్న సీఐడీ అధికారులు గతేడాది కేసు నమోదు చేశారు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జహవరీ నుంచి ఫేక్​సర్టిఫికెట్లు కొన్న తమిళనాడుకు చెందిన ప్రియా ధర్మలింగం 125 మంది శ్రీలంక దేశస్తులకు భారత పౌరసత్వం కల్పించినట్లు గుర్తించారు. 

వారిలోని పరునియ తిరువన ఉక్కరాసు(30), జె.సంజిక(29) భారత పాస్‌పోర్ట్‌లు పొందారు. ప్రియధర్మ లింగంతోపాటు తిరువన ఉక్కరాసు, జె.సంజిక చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడి ఎయిర్​పోర్టు పోలీసులు అరెస్ట్​చేశారు. 

26 మంది అరెస్ట్,108 పాస్‌పోర్టులు సీజ్‌

ఈ కేసులో16 మంది పాస్‌పోర్ట్‌ ఏజెంట్లు, ఆరుగురు స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది, పాస్‌పోర్ట్‌ స్పోర్టు సేవా కేంద్రం ఉద్యోగి, ముగ్గురు శ్రీలంక జాతీయుల్ని సీఐడీ పోలీస్‌లు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పట్టుబడిన ముగ్గురు మహిళలతో కలిపి ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 26కు చేరింది. కాగా కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు108 పాస్‌పోర్టులు,33 మొబైల్ ఫోన్లు,5 ల్యాప్‌టాప్స్‌,5 సీపీయూలు,3 ప్రింటర్లు,11 సీపీయూలు, స్కానర్, వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన 82 రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐడీ చీఫ్‌ శిఖాగోయల్ వెల్లడించారు.