ఇటు హైదరాబాద్..అటు వరంగల్ వానొస్తే ఆగమే

  • చిరుజల్లులకే పొంగి పొర్లుతున్న కాల్వలు
  • నీట మునుగుతున్న బస్తీలు, కాలనీలు
  • గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లు.. జనం అవస్థలు
  • ఎక్స్ పర్ట్స్ కమిటీల సిఫార్సులను మూలకు పడేసిన సర్కార్

హైదరాబాద్‌‌, వెలుగు:చిన్న వాన పడితే చాలు.. ఇటు హైదరాబాద్​, అటు వరంగల్​ ఆగమైపోతున్నాయి. వరద నీరు, బురద నీరు కలగలిసి రోడ్ల మీద పొంగిపొర్లుతున్నది. చిన్న చిన్న బస్తీలు మొదలు.. పెద్ద పెద్ద కాలనీల దాకా నీట మునిగిపోతున్నాయి. స్లమ్​ ఏరియాల్లోని జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తున్నది. రోడ్ల మీద గంటల తరబడి ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడుతున్నాయి. అడుగు తీసి అడుగు వేస్తే ఎక్కడ ఏ మ్యాన్​హోల్​ ఓపెన్​ ఉందో తెలియని పరిస్థితి. బుధవారం, గురువారం కురిసిన వర్షానికి హైదరాబాద్​లో చాలా కాలనీలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీళ్లు చేరి జనం అవస్థలు పడ్డారు. వరద నీటికి బైక్​లు, కార్లు కొట్టుకుపోయాయి.  గత నెలలో కురిసిన వర్షానికి వరంగల్​ సిటీలో ఎక్కడ చూసినా వరద పొంగింది. సుమారు వంద కాలనీలు నీట మునిగాయి. నాలాలు, చెరువులను ఎక్కడికక్కడ కబ్జా చేయడంతోనే ఈ సమస్య ఏర్పడింది. సమస్యలు పరిష్కరిస్తామని ఎలక్షన్​టైంలో నాయకులు హామీలు ఇచ్చి.. అటు తర్వాత మరిచిపోతున్నారని జనం మండిపడుతున్నారు.

విశ్వనగరమేమో కానీ..

హైదరాబాద్‌‌ను  విశ్వనగరంగా తీర్చి దిద్దుతామని ఎన్నికల టైంలో టీఆర్​ఎస్​ చెప్పింది. చుక్క నీరు కూడా రోడ్ల మీద నిల్వ కుండా చేస్తామన్నది. అద్భుతమైన రోడ్లు, మంచి డ్రైనేజీ వ్యవస్థ రూపొందిస్తామన్నది. ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీలు వేసి ప్రాబ్లమ్‌‌ సాల్వ్‌‌ చేస్తామని చెప్పింది. కానీ హైదరాబాద్​ సిటీ నీట మునిగేందుకు కారణమైన సమస్యలు ఎక్కడివక్కడ ఎప్పటిలాగే పడి ఉన్నాయి.

నాలాల కబ్జాలు, చెరువుల ఆక్రమణలు, అస్తవ్యస్తమైన డ్రైనేజీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌, వరద నీటి కాల్వల నిర్వహణ లోపం, ఇరుకైన రోడ్లు.. ఇలా ఎన్నో  సమస్యలు వెంటాడుతున్నాయి. దీని పరిష్కారం కోసం జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ లాంటి వర్సిటీలు చేసిన సిఫార్సులు ఏండ్లు గడుస్తున్నా అమలవట్లేదు. రూ. 5 వేల కోట్ల ఖర్చు పెడితే సిటీకి వాన ముంపు తప్పుతుందని చెప్పినా.. అటు వైపు అడుగు కూడా పడలేదు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ 650 కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. వెయ్యి కిలోమీటర్ల మేర డ్రైనేజీ, వరద నీటి కాల్వలున్నాయి. 216  మేజ‌‌‌‌‌‌‌‌ర్ నాలాలు, 735  కిలోమీట‌‌‌‌‌‌‌‌ర్ల విస్తీర్ణంలో పైప్‌‌‌‌‌‌‌‌లైన్ డ్రెయిన్‌‌‌‌‌‌‌‌లున్నాయి. 9 వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వర్షం పడితే హైదరాబాద్​ జలమయం కావడానికి వీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడమేనని జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ  ఎక్స్​పర్ట్స్​ తేల్చారు. ఓ ఎన్జీవో స్టడీ ప్రకారం గ్రేటర్‌​​లో నాలాలపై 28 వేల ఆక్రమణలు ఉన్నట్లు తేలింది.

 జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ స్టడీ.. సిఫారసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వరద ముంపును అరికట్టేందుకు జేఎన్​టీయూ ఎక్స్​పర్ట్స్ ‘అర్బన్ ఫ్లడ్స్ -ఇంటిగ్రేటెడ్ స్టోర్మ్​ వాటర్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ (అర్బన్ బైపాస్)’ పేరుతో 2018లో రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. అప్పట్లో గ్రేటర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న దానకిశోర్‌‌‌‌‌‌‌‌ సూచన మేరకు జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్‌‌‌‌‌‌‌‌ గిరిధర్, లక్ష్మణరావు, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎస్‌‌‌‌‌‌‌‌ఈలు, ఈఈలు, ఏఈఈలతో కలిసి గ్రౌండ్​ లెవల్​లో పరిశీలన జరిపారు. వర్షపు నీరు నిలిచిపోతున్న ప్రాంతాలను గుర్తించిన జేఎన్​టీయూ ప్రొఫెసర్లు అన్ని ఏరియాల్లో  ఇంకుడు గుంతలు (హార్వెస్టింగ్​ పిట్స్​) నిర్మించాలని, ఇంజెక్షన్‌‌‌‌‌‌‌‌ వెల్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. వరద, నీటి ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రణాళికను జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ ఎక్స్​పర్ట్స్​ జీహెచ్​ఎంసీకి అందజేయగా స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆ రిపోర్ట్​ను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ కోసం పంపింది. కానీ ఆ ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడలేదు. హైదరాబాద్​లో 10 సెంటి మీటర్ల వర్షం కురిసిన సమయంలోనూ వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా నగరవ్యాప్తంగా 450 కిలోమీటర్ల మేర పెద్ద సైజు వర్షపు నీటి కాల్వలు, 1,092 కిలోమీటర్ల మేర చిన్నసైజు వర్షపునీటి కాల్వలు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 636 వాటర్ ట్యాంక్స్​ నిర్మించాలని కమిటీ తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో చెప్పింది. 2,70,000  హార్వెస్టింగ్​ పిట్స్​(ఇంకుడు గుంతలు) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. దీని కోసం రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని చెప్పింది. రోడ్ల వెడల్పు, రీడిజైన్​ కు మరో రూ. 3 వేల కోట్లు  అవసరమవుతాయని సూచించింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్​ నియంత్రణ,  రోడ్ల నిర్వహణకు  ప్రభుత్వం ఏటా సుమారు రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఈ సిఫార్సుల అమలుకు రూ.  ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే ప్రభుత్వానికి వెయ్యి కోట్ల దాకా ఆదా అవుతుందని ఈ స్టడీకి నాయకత్వం వహించిన జేఎన్​టీయూహెచ్​ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణారావు
అభిప్రాయపడ్డారు.

ఇతర స్టడీలు.. సిఫార్సులు..

హైదరాబాద్​లో వర్షపు నీళ్లు వెళ్లేలా ట్రంక్‌‌‌‌‌‌‌‌ లైన్లు ఏర్పాటు చేయాలని మరికొందరు ఎక్స్​పర్ట్స్​ సూచించారు. నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాలని చెప్పారు. 2007లో జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఏర్పడ్డ తర్వాత ఓయెంట్స్‌‌‌‌‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌‌‌‌‌ గ్రేటర్ సమస్యలను స్టడీ చేసింది. సిటీలో గంటకు 2 సెం.మీ. వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయంది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో 7.5 నుంచి 10.9 సెంటీమీటర్ల దాకా వాన పడింది. నాలాల్లో వ్యర్థాలు వేయకుండా అడ్డుకోవాలని, అందులోని చెత్తను తొలగించాలని ఓయెంట్స్​ కన్సల్టెంట్​ చెప్పింది. మేజర్‌‌‌‌‌‌‌‌ నాలాలను 390 కిలో మీటర్ల మేర విస్తరించాలన్నది. ఈ పనులకు అడ్డంగా ఉన్న 28 వేల ఆక్రమణలను తొలగించాలని సిఫార్సు చేసింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ చేసిన మరో సర్వేలో నాలాలను డెవలప్ ​చేయాలంటే  12 వేల నిర్మాణాలను తొలగించాల్సి ఉందని తెలిసింది. 47 బాటిల్‌‌‌‌‌‌‌‌నెక్స్‌‌‌‌‌‌‌‌ని గుర్తించి 16.60 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించిన డ్రోన్‌‌‌‌‌‌‌‌ సర్వేలో తక్షణంగా వంద కిలో మీటర్ల మేర ఉన్న ఇష్యూస్‌‌‌‌‌‌‌‌ని సాల్వ్‌‌‌‌‌‌‌‌ చేయాలని, వీటికి రూ. 470 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. సిటీ సమస్యలకు సంబంధించి కిర్లోస్కర్‌‌‌‌‌‌‌‌ కమిటీ కూడా  71 నాలాల్ని 170 కిలో మీటర్ల విస్తరించాలంది. ఏండ్ల తరబడి ఎన్ని స్టడీలు జరిగినా, సిఫార్సులు వచ్చినా అమలుకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదు.

హైదరాబాద్​ ముంపు పరిష్కారానికి కమిటీల సిఫార్సులు ఇవీ

  • అన్ని ఏరియాల్లో  ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఇంజెక్షన్‌ వెల్స్‌ ఏర్పాటు చేయాలని 2018లో
    జేఎన్​టీయూ ఎక్స్​పర్ట్స్ కమిటీ సూచించింది. సిటీ చుట్టూ 450 కిలోమీటర్ల మేర పెద్ద సైజు వర్షపు నీటి కాల్వలు, 1,092 కిలోమీటర్ల మేర చిన్నసైజు వర్షపునీటి కాల్వలు,  ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 636 వాటర్ ట్యాంక్స్​ నిర్మించాలని సిఫార్సు చేసింది. రోడ్ల పక్కన వరద నీటి డ్రెయిన్లు ఏర్పాట్లు చేయాలని సూచించింది.
  • సిటీలో గంటకు రెండు సెంటీ మీటర్ల వర్షం పడితే చాలా ప్రాంతాలు నీట మునుగుతాయని ఓయెంట్స్‌ కన్సల్టెంట్‌ సంస్థ తన స్టడీలో తేల్చింది. మేజర్‌ నాలాలను 390 కిలో మీటర్ల మేర విస్తరించాలని సూచించింది. ఈ పనులకు అడ్డంగా ఉన్న 28 వేల ఆక్రమణలను తొలగించాలని సిఫార్సు చేసింది.
  • కిర్లోస్కర్‌ కమిటీ.. 71 నాలాల్ని 170 కిలో మీటర్ల విస్తరించాలని చెప్పింది.