వానొస్తే సిటీలు మునుగుడే!

  • మొన్నటి వరకు జీహెచ్​ఎంసీ.. ఇప్పుడు వరంగల్, నిర్మల్, ఖమ్మం, కరీంనగర్​ సిటీలు
  • పట్టణాల విస్తరణలో చెరువులు, కుంటల బఫర్​ జోన్లు కబ్జా 
  • అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్నపాటి వానలు కురిస్తే చాలు ప్రధాన సిటీల్లో రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జీహెచ్ఎంసీలో ఒక గంట పాటు ఆగకుండా వాన పడితే ఎక్కడికక్కడ వరద నీరు నిలిచి ఇండ్లలోకి చేరుతుండగా, ఇప్పుడు ఇతర సిటీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విస్తరిస్తున్న పట్టణాల విషయంలో రాష్ట్ర సర్కార్ కు సరైన ప్లానింగ్​లేకపోవడం, అర్బన్​డెలప్​మెంట్​అథారిటీలు సరిగ్గా పనిచేయకపోవడం, చెరువులు, కుంటలు కబ్జాలకు గురి కావడంతోపాటు అసంపూర్తిగా నాలాల ఏర్పాటు, మొక్కుబడి డ్రైనేజీ వ్యవస్థతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. వర్షపు నీరు వెళ్లడానికి వీల్లేకుండా నిర్మాణాలు చేస్తుండడం కూడా కాలనీలను వరద నీరు ముంచెత్తడానికి ఒక కారణంగా ఇంజనీర్లు చెప్తున్నారు. నీటి పారుదలకి అడ్డం వచ్చే ఏ నిర్మాణంపైనయినా కొత్త మున్సిపల్​ చట్టం ఆధారంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉన్నా, అంతా అధికార పార్టీ అండదండలు ఉన్నవారే కావడంతో అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. 

నాలాలు, చెరువుల కబ్జా 
పెరుగుతున్న జనాభాతో రాష్ట్రంలో సిటీలు విస్తరిస్తున్నాయి. చుట్టుపక్కల చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. ఒకప్పుడు వరంగల్‌లో ఉండే వందలాది చెరువులున్న ప్రాంతాలు ఇప్పుడు కాలనీలుగా మారాయి. నిర్మల్​జిల్లా కేంద్రంలోనూ అనేక చెరువులు, కుంటలు, వరద నీరు ప్రవహించే వాగుల్లో కూడా అక్రమ నిర్మాణాలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో ఫుల్​ట్యాంక్​లెవెల్(ఎఫ్​టీఎల్)కు అనుణంగా వంద మీటర్ల దూరం వరకు బఫర్​జోన్​ఉంటుంది. అయితే బఫర్​జోన్లు దాటి ఇళ్లు కట్టడం, కొన్నిచోట్ల చెరువులోని కొంత ప్రాంతాన్ని అక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడంతో  ఆ ప్రాంతాలు నీట మునుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి 30 సంవత్సరాల సగటు వర్షపాతం ఆధారంగా  టౌన్​ప్లానింగ్ చేయాలి. వరద నీరు పోయేందుకు నాలాలు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్​లోనూ రూల్స్​ప్రకారం నాలాలు నిర్మించడం లేదు. కొందరు నాలాలపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా పట్టణాల్లో సక్రమంగా లేదు. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి. హైదరాబాద్​ తరువాత చెప్పుకునే  వరంగల్‌లో ఇంకా ప్రపోజల్స్​ దశలో ఉన్నాయి.

అన్నిచోట్లా అదే పరిస్థితి
హైదరాబాద్ తరువాత మెయిన్ ​సిటీగా చెప్పుకునే వరంగల్​లో గతేడాది వాన పడితే సిటీ మొత్తం బురదమయంగా మారింది. అయితే 2016లోనూ ఒకసారి వరంగల్‌లో వరదలు వచ్చాయి. కానీ తీవ్రత ఇంతగా లేదు. 2020లో వానలకు మాత్రం వరంగల్‌లో దాదాపు100 వరకు కాలనీలు నీట మునిగాయి. ఖమ్మం, కరీంనగర్​ జిల్లాల్లోనూ అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. క్రమంగా వృద్ధి చెందుతున్న నిర్మల్​ పట్టణం మొత్తం గురువారం నీట మునిగింది. నది ప్రవాహం మధ్యలో ఇండ్లు వచ్చాయా అన్నట్లు తలపించింది. ఒక్కరోజు కురిసిన వర్షానికే కొన్ని కాలనీల్లో ఫస్ట్​ ఫ్లోర్​వరకు నీరు చేరింది. ఈ సమస్య మిగతా సిటీల్లోనూ భవిష్యత్​లో కనిపించే  ప్రమాదం లేకపోలేదని మున్సిపల్​ డిపార్ట్​మెంట్లో పనిచేస్తున్న ఇంజనీర్లే పేర్కొంటున్నారు. 

పేరుకే అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీలు
రాష్ట్రంలో హెచ్ఎండీఏతో పాటు కాకతీయ,  నిజామాబాద్, శాతవాహన, కులి కుతుబ్​షా, సిద్దిపేట, స్తంభాద్రి అర్బన్​ డెవలప్​మెంట్​అథారిటీలతో పాటు యాదాద్రి, వేములవాడ టెంపుల్​ఏరియా డెవలప్​మెంట్​అథారిటీలు ఉన్నాయి. ఇవి వాటి పరిధిలో ఉన్న పట్టణాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాల్సి ఉంటుంది. సిటీల విస్తరణలో భాగంగా భవిష్యత్​లో వరదలు, భూకంపాలు, ట్రాఫిక్​ వంటి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. కానీ అవేం లేకుండానే ఇష్టారీతిన అనుమతులు ఇవ్వడం, ప్లానింగ్​ సరిగ్గా చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 


విశ్వనగరం.. లండన్, డల్లాస్​ ఉత్తి ముచ్చటే
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పర్యటన చేసినప్పుడల్లా వాటిని అద్భుతంగా మారుస్తామంటూ సీఎం కేసీఆర్​ గుప్పించిన హామీలు ఉత్తి ముచ్చటగానే మిగిలాయి. హైదరాబాద్ ను​డల్లాస్​గా విశ్వనగరంగా చేస్తామని, కరీంనగర్​ను లండన్, వరంగల్​ను స్మార్ట్​సిటీ తరహాలో తీర్చిదిద్దుతామన్న మాటలు మూలకు పడ్డాయి. ఇతర దేశాల్లోని పెద్ద నగరాలుగా మారకపోయినా, వానలు పడి వరదొచ్చినప్పుడు బతికి బట్టకట్టేలా ఉంటే చాలని జనాలు అంటున్నారు. ఆధునాతన అండర్​ డ్రైనేజీ వ్యవస్థ, రూల్స్​ప్రకారం నాలాలు ఉంటే వరద నీరు ఇండ్లలోకి చేరడం ఉండదని ఇంజనీరింగ్​ఎక్స్ పర్ట్స్​చెప్తున్నారు.