- నల్గొండ, నకిరేకల్, కోదాడ, హుజూర్‌నగర్, సాగర్‌లో పోటీపోటీగా ప్రోగామ్స్
- మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుకు నిరసన సెగ
- మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం పట్టుబట్టిన ఎస్సీ లీడర్లు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మరోసారి బహిర్గతమైంది. శుక్రవారం సీఎం పుట్టినరోజు సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యేలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దఎత్తున సెలబ్రేషన్స్ నిర్వహించడంతో పాటు, మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ దావాఖానాల్లో రోగులకు పాలు, పండ్లు పంచారు. వీరితో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పార్టీ లీడర్లు, మాజీ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో సపరేట్‌గా కేసీఆర్ బర్త్‌డే నిర్వహించారు.
ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సెలబ్రేషన్స్
ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నల్గొండ, నకిరేకల్, కోదాడ, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు సపరేట్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించారు. మిర్యాలగూడలో మాత్రం ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు ఎస్సీ లీడర్ల నుంచి నిరసన సెగ తగిలింది. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వ్ అయినా ఇప్పటివరకు భర్తీ చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు క్యాంప్ ఆఫీస్‌లో జరిగిన బర్త్‌డే వేడుకల్లో నిరసన తెలిపారు. చైర్మన్ పదవిని పార్టీ సీనియర్ నాయకుడు సోముల ఫ్యామిలీకి ఇవ్వాలని ఎమ్మెల్యేను నిలదీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ ఆఫీస్‌లో సెలబ్రేషన్స్ నిర్వహించారు. కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా 70 కేజీల కేక్ కట్ చేశారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు, జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దాదాపు 700 మందితో పార్టీ ఆఫీస్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి ఆధ్వర్యంలో గుత్తా అమిత్‌రెడ్డి నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఫ్రీ కోచింగ్ సెంటర్‌లో బర్త్‌డే వేడుకలు జరిపారు. పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, చాడ కిషన్‌రెడ్డి, చకిలం అనిల్‌కుమార్‌లు తిప్పర్తి, నల్గొండలో తమ ఇంట్లో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు.
నకిరేకల్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వేర్వేరుగా సెలబ్రేషన్స్ చేశారు. చిట్యాల పట్టణంలో వీరేశం వర్గీయులు ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వీరేశం హాజరైన ఈ కార్యక్రమానికి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్న కంచర్ల కృష్ణారెడ్డి హాజరుకావడం విశేషం. కట్టంగూరు ఎంపీపీ వీరేశానికి మద్దతుగా సీఎం బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తే, ఎమ్మెల్యే చిరుమర్తికి మద్దతుగా జడ్పీటీసీ చేశారు. నకిరేకల్ పట్టణంలోనూ ఎంపీపీ శ్రీదేవి సపరేట్‌గానే సెలబ్రేషన్స్ నిర్వహించారు.
నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే భగత్ హాలియా
క్యాంప్ ఆఫీస్‌లో బర్త్‌డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తే, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి నందికొండ మున్సిపాలిటీలోని కమలానెహ్రూ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే హాలియాలో క్రికెట్ పోటీలు ప్రారంభించారు.
కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీస్‌లో బర్త్‌డే వేడుకలు నిర్వహించి, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ప్రభుత్వ హాస్పిటల్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరే కంగా మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, కన్మంత శశిధర్‌రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు కలిసి చందర్‌రావు ఇంట్లో కేక్ కట చేశాక, ప్రభుత్వ హాస్పిటల్‌లో పండ్లు పంపిణీ చేశారు. హుజూర్‌నగర్‌లో ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎంపీపీ బూర్గు శ్రీనివాస్ బూరుగడ్డలో సీఎం బర్త్‌డే వేడుకలు జరిపారు.
నల్గొండలో బ్లడ్ డొనేషన్ క్యాంప్
వెలుగు నెట్‌వర్క్ : సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలను శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నల్గొండలో జరిగిన వేడుకలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరై భారీ కేక్ కట్‌చేశారు. పానగల్ ఛాయాసోమేశ్వరాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో మంత్రి, ఎమ్మెల్యేలతో సహా 800 మంది రక్తదానం చేశారు. సూర్యాపేటలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో కేక్‌ను కట్ చేసిన అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు అంబులెన్స్ అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో, గ్రామాల్లో బీఆర్‌ఎస్ లీడర్లు కేక్ కట్ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.