చీమలు చేసిన సాయం

చీమలు చేసిన సాయం

ఒక అడవిలో బోయవాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ వల వేసి పక్షులను పట్టుకుని, వాటిని సంతలో అమ్మేవాడు. అదే అతని జీవనాధారం. ఎప్పటిలాగే ఒకరోజు పక్షులను పట్టుకుందామని, వలను భుజాన వేసుకుని అడవిలోకి వెళ్లాడు. ఒక చెట్టు మీద చాలా పావురాలు కనిపించాయి. ‘ఆహా! ఈ చెట్టు మీద చాలా పావురాలు ఉన్నాయి. నా పంట పండింది’ అని మనసులో అనుకున్నాడు. ఆ చెట్టు కింద వలను పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు వచ్చి వలలో ఏమైనా చిక్కాయో లేదో అని చూశాడు. 

వలలో ఒకే ఒక్క పావురం చిక్కింది. అదీ చనిపోయినట్టు కనిపించింది. దానిపైన చీమలు కూడా ఉండడంతో.. ‘ఛీ.. ఛీ.. ఇలా జరిగిందేంటి? ఒక్క పావురమే చిక్కింది. అదీ చచ్చిపోయి ఉంది. చనిపోయి కూడా చాలాసేపయింది కాబోలు. చీమలు కూడా బాగా పట్టాయి. చచ్చినదాన్ని ఎవరూ కొనరు’ అని మనసులో అనుకున్నాడు. ఆ వెంటనే పావురాన్ని వలలో నుంచి తీసి, దూరంగా విసిరేశాడు. 

అంతే! ఆ పావురం తుర్రున లేచి, రివ్వున ఎగిరి వెళ్లిపోయింది. ఆ వేటగాడికి మతిపోయినంత పనైంది. ఆశ్చర్యంతో నోరు తెరిచి బుర్ర గోక్కుంటూ.. ‘అసలు ఇలా ఎలా జరిగిందబ్బా!’ అని ఆలోచనలో పడ్డాడు. ఎంత ఆలోచించినా ఏమీ అర్థంకాలేదు. దాంతో చేసేదేమీలేక ‘ఎలాగూ దాన్ని మళ్లీ పట్టుకోలేను కదా’ అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. 

ఆ తర్వాత ఆ పావురం చీమల దగ్గరకు వెళ్లి ‘‘మీరు చెప్పిన ఉపాయం భలే పనిచేసింది’ అని చెప్పింది. పక్కనే ఉన్న మరో పావురం.. ఏంటా ఉపాయం? అని అడిగింది. దాంతో పావురం జరిగిందంతా వివరించసాగింది. 
రాత్రిపూట చెట్టు మీద కూర్చున్న నేను అనుకోకుండా కింద పడిపోయాను. అప్పటికే బోయవాడు వల పన్ని ఉండడం వల్ల అందులో చిక్కాను. దాంట్లో నుంచి బయటకు రాలేక చాలాసేపు అల్లాడిపోయాను. తెల్లవారితే బోయవాడు నన్ను సంతలో అమ్మేస్తాడని భయపడిపోయాను. 

అలా భయంతో ఉన్న నన్ను తెల్లవారుజామున చీమల దండు చూసింది. నా అవస్థ చూసి నన్ను కాపాడడానికి పెద్ద చీమ ఉపాయం చెప్పింది. అది చెప్పినట్టే నేను చనిపోయినట్టు నటించా. తర్వాత నాపైకి చీమలు వచ్చి చేరాయి. దాంతో నేను నిజంగా చనిపోయి చాలాసేపయిందని, చీమలు కూడా పట్టాయనుకున్నాడు బోయవాడు. చనిపోయిన పావురాన్ని అక్కర్లేదని దూరంగా విసిరేశాడు. 

వెంటనే నేను గాల్లోకి ఎగిరిపోయాను. ఆ విధంగా చీమలు నాకు ప్రాణభిక్ష పెట్టాయి. అందుకే నా ప్రాణం కాపాడిన చీమలకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను’’ అంటూ.. ‘‘మీరు నన్ను చూడకపోతే నా పరిస్థితిని గ్రహించకపోతే మీరు ఈ ఉపాయం చెప్పకపోతే ఆ బోయవాడికి అన్యాయంగా బలైపోయేదాన్ని. నన్ను కాపాడినందుకు మీకు ధన్యవాదాలు”అని పావురం చీమలకు చెప్పింది. పావురం ప్రాణం దక్కినందుకు చీమలు చాలా సంతోషించాయి. 

ఇక నుంచి వేటగాళ్లని, వలల్ని గమనిస్తూ జాగ్రత్తగా జీవించు”అని వాటిలో పెద్ద చీమ హెచ్చరించింది. ‘అలాగే’నంటూ పావురాలు గాల్లోకి ఎగరగా.. ఆహార అన్వేషణ కోసం ముందుకు కదిలింది పెద్ద చీమ. మిగతా చీమలు దాన్ని అనుసరించాయి. 

- మాకరాజు శ్రీనివాసరాజు