‘అంబులెన్స్​ల దందాపై’ సీఎంఓ సీరియస్

  •     వెలుగు కథనానికి స్పందన 
  •     పేషెంట్​ మృతిపై రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్​కు ఆదేశాలు 
  •     హుటాహుటిన సీఎంఓకు రిపోర్టు పంపిన అధికారులు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్​ల  కమీషన్​ దందాపై ‘అత్యాశతో ఆయువు తీస్తుండ్రు’  అని సోమవారం 'వెలుగు'లో పబ్లిష్​ అయిన స్టోరీపై తెలంగాణ సీఎంఓ  స్పందించింది.   దీనిపై వెంటనే రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్​కు సంతోష్​కు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు డీఎంహెచ్​ఓ  డాక్టర్​ సుబ్బారాయుడు హుటాహుటిన కలెక్టర్​కు రిపోర్టు అందజేయగా, సీఎంవోకు పంపినట్టు సమాచారం.  

పేషెంట్​ మృతిపై రిపోర్టు...  

అంబులెన్స్​ డ్రైవర్​ కమీషన్​ కక్కుర్తి కారణంగా ఇటీవల ఒక పేషెంట్​ మృతి చెందిన ఘటనపై పూర్తి వివరాలతో సీఎంవోకు రిపోర్టు సమర్పించారు. మార్చి 29న లక్సెట్టిపేటకు చెందిన సింధూజ  యాక్సిడెంట్​తో తీవ్రంగా గాయపడ్డది.  కుటుంబసభ్యులు  అంబులెన్స్​లో   మంచిర్యాల గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తరలించే క్రమంలో  అంబులెన్స్​ ఓనర్​ కమ్​ డ్రైవర్​ సాగర్ కు  30 నుంచి 40 శాతం కమీషన్​ ఇచ్చే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.  

డాక్టర్లు ట్రీట్​మెంట్​ చేస్తుండగానే సింధూజ బ్రెయిన్​ డెడ్​ అయింది. అరగంట ముందు వస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని డాక్టర్లు చెప్పారు.   డ్రైవర్​ అత్యాశ కారణంగా  పేషెంట్​ చనిపోయిందని  కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేయగా..  నిందితుడిని   రిమాండ్​కు పంపారు. ఈ ఘటన పై  పూర్తి  అధికారులు సీఎంఓకు రిపోర్టు పంపారు. 

అంబులెన్స్​ల కంట్రోల్​పై ఫోకస్​....  

ఈ ఘటనతో అంబులెన్స్​ల దందాను కంట్రోల్​ చేయడంపై సీఎంవో ఫోకస్​ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వీటిని ఏ డిపార్ట్​మెంట్​ కంట్రోల్​ చేస్తుందన్నది అధికారులకే క్లారిటీ లేకపోవడం గమనార్హం. అంబులెన్స్​లకు పర్మిషన్లు ఇస్తున్న ఆర్టీఏ అధికారులు ఆ తర్వాత వాటి ఫిట్​నెస్​ గురించి కానీ, ఇతర విషయాల గురించి కానీ పట్టించుకోవడం లేదు. మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులు తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు కేసులు ఫైల్​ చేస్తున్నారు. 

అంబులెన్స్​లలో అసవరమైన పరికరాలు ఉన్నాయా? అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకు కనీసం ఆక్సిజన్​ పెట్టేంత నైపుణ్యం డ్రైవర్లకు ఉందా? లేదా? అన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. మంచిర్యాల నుంచి పేషెంట్లను కరీంనగర్​, వరంగల్​, హైదరాబాద్​ తీసుకెళ్తుంటారు. ప్రయాణానికి కనీసం 5 గంటల టైమ్​ పడుతుంది. అక్కడికి చేరేంత వరకు దేవుడిపై భారం వేసి ఊరుకుంటున్నారు. వెంటిలేటర్​ అంబులెన్స్​లలో మాత్రం ప్రైవేట్​ హాస్పిటళ్లలో పనిచేసే సిబ్బందిని పేషెంట్ల వెంట తీసుకెళ్తున్నారు. అధికారుల కంట్రోల్​ లేకపోవడంతో డ్రైవింగ్​ వస్తే చాలు అంబులెన్స్​ మెయింటెన్​ చేయవచ్చన్న పరిస్థితి  ఉంది.    

108లో ఉండే టెక్నీషియన్ల మాదిరిగా ప్రైవేట్​ అంబులెన్స్​ల డ్రైవర్లకు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ట్రెయినింగ్​ ఇవ్వాలని సూచిస్తున్నారు. పూర్తిస్థాయి పర్యవేక్షణ బాధ్యతలను 108 ఏజెన్సీకి కానీ, మెడికల్​ అండ్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​కు గానీ అప్పగించడం మేలంటున్నారు. ప్రస్తుతం అంబులెన్స్​ నిర్వాహకులంతా సిండికేట్​ అయి ఇష్టారీతిన రెంట్​ వసూలు చేస్తున్నారు. అంబులెన్స్​లకు పోటీపడి కమీషన్లు ఇస్తున్న హాస్పిటళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.