ఢిల్లీ ఎన్నికల్లో సీఎంల జోరు.. ఆయా పార్టీల తరఫున హోరాహోరీ ప్రచారం

ఢిల్లీ ఎన్నికల్లో సీఎంల జోరు.. ఆయా పార్టీల తరఫున హోరాహోరీ ప్రచారం

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న తమ పార్టీల ముఖ్యమంత్రులను సైతం రంగంలోకి దింపి విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్‏ల పక్షాన ఆయా పార్టీల సీఎంలు కూడా జోరుగా ప్రచారం చేస్తూ.. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. అయితే, సీఎంలతో ప్రచారం విషయంలో మిగతా రెండు పార్టీల కంటే బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. 

ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా తొమ్మిది మంది సీఎంలతో ర్యాలీలు నిర్వహించగా.. కాంగ్రెస్ కేవలం ఇద్దరు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తనకు ఉన్న ఇద్దరు సీఎంలతో క్యాంపెయిన్ సాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు ప్రధానంగా మాజీ సీఎంలే విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. పోలింగ్‎కు ఇంకా రెండు రోజులే ఉండటం.. ప్రచారానికి గడువు మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో చివరి కొద్ది గంటల్లోనూ క్యాంపెయిన్ జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయి. 

బీజేపీ దూకుడు 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆ పార్టీ అధికారంలో ఉన్న ఆయా రాష్ట్రాల సీఎంలు విస్తృతంగా ప్రచారం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. 

అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల్లో కీలకమైన జేడీయూ నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా కూటమి అభ్యర్థులకు ప్రచారం చేశారు. వీరిలో బీజేపీ సీఎంలంతా ఢిల్లీలో ఆప్ పాలనపై వాడీవేడి విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‏పై మాటల తూటాలు పేల్చారు. ఈ సారి ఎలాగైనా ఢిల్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో బీజేపీ ఉండటంతో.. ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా సహా ఆ పార్టీ అగ్ర నేతలందరినీ రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. 

చెమటోడుస్తున్న ఆప్ 

ఒకవైపు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా వంటి అగ్రనేతలతోపాటు వరుసగా సీఎంలను ప్రచార బరిలోకి దింపుతున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు ఆప్ చెమటోడ్చి ప్రచారం చేస్తోంది. ఢిల్లీ సీఎం ఆతిశి, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వరుస ర్యాలీలతో క్యాంపెయిన్ నిర్వహించగా.. మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం బీజేపీ నేతల విమర్శలను ఎదుర్కొంటూ, పోరాటం కొనసాగిస్తున్నారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నా.. కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగా పోటీ చేస్తుండటంతో ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి సైతం విమర్శలు ఎదురయ్యాయి. అయితే, ఇండియా కూటమిలోని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారంలో పాల్గొనకపోయినా.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‎కు మద్దతు ప్రకటించారు. 

అగ్ర నేతలతోనే కాంగ్రెస్ క్యాంపెయిన్ 

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మాత్రం పార్టీ అగ్ర నేతలతోనే విస్తృత క్యాంపెయిన్ నిర్వహించింది. ఆ పార్టీకి వివిధ రాష్ట్రాల్లో సీఎంలు ఉన్నా.. కేవలం హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖూ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే ర్యాలీల్లో పాల్గొన్నారు. ప్రధానంగా పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వంటి అగ్ర నేతలతోనే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేపట్టింది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్యే పోటీ నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా, కాంగ్రెస్ కూడా ఆ రెండు పార్టీలకు దీటుగా క్యాంపెయిన్‎తో ఉనికిని చాటుకుంది.