- ఎత్తిపోతలు పనిచేయకపోవడంతో ఎండుతున్న పొలాలు
- 1.68 లక్షల ఎకరాల్లో పంటలపై ఎఫెక్ట్
- ఆందోళనకు దిగుతామంటున్న రైతులు
మేళ్లచెరువు, వెలుగు : ‘లిఫ్ట్‌ల కోసం రైతులు ఒక్క పైసా ఖర్చు చేయొద్దు.. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది’ అని హుజూర్‌నగర్ ఉప ఎన్నిక తర్వాత జరిగిన కృతజ్ఞతా సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదు. అటు సాగర్ ఎడమకాల్వకు గండి పడి నీరు రాకపోవడం, ఇటు లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
లిఫ్ట్‌లకు తరచూ రిపేర్లే...
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 35 లిఫ్ట్‌లు ఉన్నాయి. వీటి కింద సుమారు 1.68 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. నియోజకవర్గంలోని 11 లిఫ్ట్‌లు తరచూ రిపేర్లకు గురవుతుండడంతో వాటిపై ఆధారపడి సాగు చేస్తున్న 35 వేల ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. లిఫ్టుల నిర్వహణ, రిపేర్లకు అవసరమైన డబ్బులను రైతులే సొంతంగా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. వరి, పత్తి, మిరప పంటలు సాగు చేసి రెండు నెలలు కూడా గడవడం లేదు. ఈ టైంలో నీళ్లు లేకపోవడంతో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. కనుచూపుమేరలోనే పులిచింతల ప్రాజెక్టు ఉన్నా.. లక్షలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతున్నా తమకు మాత్రం సాగునీరు కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి లిఫ్ట్‌ను పునరుద్ధరించకపోతే ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
జీవో ఇచ్చినా.. పైసలియ్యలే...
చింతలపాలెం మండలంలోని వెల్లటూరు వద్ద గల శివగంగ లిఫ్ట్ ఇరిగేషన్, గరిడేపల్లి వద్ద ఉన్న ఎల్ 27, ఎల్ 29 లిఫ్ట్‌లకు రూ. 7.14 కోట్లు మంజూరు చేస్తూ ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని ఒక మండలంలో ఉన్న సిమెంట్ ఇండ్రస్ట్రీ శివగంగ లిఫ్ట్ నిర్వహణ కోసం రూ. 8 లక్షలు అందజేసింది. అయితే ఈ డబ్బులను లీడర్లే వాడుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిండా మునిగిన
నేను భూమిని కౌలుకు తీసుకుని రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టి 20 ఎకరాల్లో పత్తి, 5 ఎకరాల్లో మిర్చి వేసిన. బోరు ఎండిపోయింది. లిఫ్ట్ నుంచి నీళ్లు ఇవ్వాలని అడిగినా ఎవరూ పట్టించుకుంటలేరు. లిఫ్ట్ ఎందుకు నడపట్లేదో కూడా చెప్పడం లేదు. పంటల సాగు నీళ్లు ఇయ్యకపోతే నిండా మునుగుతం.
– ఎర్రం శంభిరెడ్డి, చింతలపాలెం
ఫండ్స్ రాలె
లిఫ్ట్‌లన్నీ రైతులే నిర్వహిస్తున్నరు. ప్రభుత్వం నుంచి ఫండ్స్ రాలేదు. పరిస్థితిని ఉన్నతాధికారిలకు చెప్పాం. ఫండ్స్ ఎప్పుడు వస్తాయే చెప్పలేం.
– శ్రీనివాస్, ఈఈ, ఎన్నెస్పీ, హుజూర్‌నగర్