ఉమ్మడి మెదక్ పై​ చలి పంజా

ఉమ్మడి మెదక్ పై​ చలి పంజా

 

  • కోహీర్​ 6.8,  శివ్వంపేట 8 డిగ్రీలు 
  •  గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • చాలా ప్రాంతాల్లో 9 డిగ్రీల లోపే 

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాను చలి పులి వణికిస్తోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడిపోయాయి. ఆదివారం సంగారెడ్డి జిల్లా కోహీర్​ లో అత్యల్పంగా 6.8 సెల్సియస్​ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. మెదక్​ జిల్లా శివ్వంపేటలో కూడా 8 సెల్సియస్​ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. 

సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలవుతోంది. రాత్రి ఏడయ్యే సరికి తీవ్రతా బాగా పెరుగుతుండగా, తెల్లవారి 8 గంటల వరకు కూడా చలి ప్రభావం తగ్గడం లేదు. దీంతో సాయంత్రం, ఉదయం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం పూట గ్రామాల నుంచి పట్టణాల్లోని స్కూళ్లకు వెళ్లే పిల్లలు, పాలు, కూరగాయలు అమ్మేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇపుడే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు చలి తీవ్రత మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.   

ప్రమాదకరంగా పొగ మంచు 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న క్రమంలోనే ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కూడా మంచు దుప్పటి వీడడం లేదు.  రోడ్ల మీద ముఖ్యంగా 44, 65, 161,  765 డి  నేషనల్ హైవేలను పొగమంచు తీవ్ర స్థాయిలో కమ్మేస్తోంది. 

దీంతో వాహనాల రాకపోకలకు అసౌకర్యం కలుగుతోంది. ఉదయం పూట సైతం వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుండగా, దగ్గరికి వచ్చే వరకు ముందున్న వెహికల్స్​ కనిపించకపోవడంతో అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని రహదారి నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని, అవసరమైతేనే ఆయా వేళల్లో బయటకి వెళ్లాలని 
చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు

చలి గజ గజ వణికిస్తుండటంతో ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అనేక మంది సర్ది, దగ్గు, జ్వరాలు సోకుతున్నాయి. ఆయా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది.-


మెదక్ జిల్లా


ప్రాంతం                           డిగ్రీలు
శివ్వంపేట                            8.0
బోడగట్టు                                9.4
భుజరంపేట                          9.6
వాడి                                        9.6
దామరంచ                             9.7
పెద్దశంకరంపేట                   9.7
టేక్మాల్                                   9.8
నాగాపూర్                                9.9


సిద్దిపేట జిల్లా


ప్రాంతం                      డిగ్రీలు
పోతారెడ్డిపేట                    8.6
నంగునూర్                    ​    9.1
హబ్సిపూర్​                         9.7
అంగడి కిష్టాపూర్               9.9

సంగారెడ్డి జిల్లా


ప్రాంతం                డిగ్రీలు
కోహీర్                      6.8
న్యాల్​ కల్            ​    6.9
మల్​చెల్మ                8.3
నల్లవల్ల                    8.3
సిర్గాపూర్                  8.4
ముక్తాపూర్            ​    8.4
నిజాంపేట               8.5
అల్మాయిపేట          8.5
అల్గోల్                  ​    8.6
కంకోల్                      8.9
లక్ష్మీసాగర్           ​    8.9